సలహాల స్వీకరణకు క్యూఆర్ కోడ్.. పరిపాలనలో పవన్ కొత్త ట్రెండ్!
x

సలహాల స్వీకరణకు క్యూఆర్ కోడ్.. పరిపాలనలో పవన్ కొత్త ట్రెండ్!

ప్రజల సమస్యలే కాదు సలహాలు తెలుసుకోవడానికి కూడా ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందుకొచ్చారు. ప్రతి పౌరుడు తన ఫోన్ నుంచే తమ సలహాలు ఇచ్చేలా క్యూఆర్‌ను రెడీ చేశారు.


ఆంధ్ర డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న మొదటి రోజు నుంచి పవన్ తనదైన మార్క్‌తో పాలన కొనసాగిస్తున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగడమే కాకుండా వారి సమస్యలకు యుద్ధప్రాతిపదికన పరిష్కారాలు చూపిస్తున్నారు. తొలుత నుంచి ఆయన వినూత్న నిర్ణయాలతో శభాష్ అనిపించుకుంటున్నారు. తాజాగా అటువంటిదే మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ శాఖలను మరింత మెరుగైన సేవలు అందించేలా మార్చడానికి ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఫోన్ నుంచే ప్రభుత్వానికి పలు శాఖలు, వాటిలో పనితీరుకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని ప్రకటించారు. అందుకు వాళ్లు చేయాల్సిందల్లా ఒక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడమే అని వెల్లడించారు.

స్కాన్ చేయండి సలహా ఇవ్వండి

ప్రభుత్వ శాఖలు మెరుగైన సేవలు అందించడానికి ప్రతి పౌరుడు తమ సలహాలు, సూచనలు ప్రభుత్వానికి తెలియజేయొచ్చని జనసేన వెల్లడించింది. తమ పార్టీ అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన క్యూఆర్‌ కోడ్ స్కాన్ చేసి ప్రజలు తమ సలహాలు తెలపొచ్చని ప్రకటించారు పవన్. క్యూఆర్‌ను స్కాన్ చేసిన తర్వాత ఒక గూగుల్ ఫామ్ వస్తుందని, అందులో మీ సలహాలు, సూచనలు తెలపొచ్చని, ఏ శాఖకో కూడా పేర్కొనవచ్చని చెప్పారు. పవన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇతర పార్టీ నేతలు కూడా మెచ్చుకుంటున్నారు.

ఆ శాఖలకు సలహాలు!

ఈ ప్రకటనలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ శాఖ, పర్యావరణ శాఖ, పంచాయతీరాజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పౌరసరఫరాల శాఖ, టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలకు సంబంధించి ఎవరైనా తమ సూచనలు తెలపొచ్చని వెల్లడించారు. ఛార్జ్ తీసుకున్న రోజు నుంచే సమీక్ష సమావేశాలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ప్రజలకు పని పెట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అధికారులు, అధినేతలతో పాటు ప్రజలు కూడా కలిసి పనిచేయాలని ఆయన తన చర్యల ద్వారా చెప్పకనే చెప్తున్నారు.

ఇతర పార్టీలు వద్దన్నాయా!

అయితే ప్రజలు సలహాలు, సూచనలు చేయొచ్చని అని చెప్పిన శాఖలన్నీ కూడా జనసేన నేతలు తీసుకున్న శాఖలే కావడం కొన్ని సందేహాలను రేకెత్తిస్తున్నాయి. కేవలం తమ పార్టీ నేతలు తీసుకున్న శాఖ అభివృద్ధి కోసమే డిప్యూటీ సీఎం పనిచేస్తున్నారా? లేకుంటే తన ఐడియా చెప్తే ఇతర పార్టీలు నో చెప్పాయా? ఒకవేళ నిజంగానే నో చెప్పి ఉంటే.. ప్రజలతో ప్రభుత్వాన్ని మమేకం చేయడానికి ఇదొక గొప్ప మార్గమైనా ఈ అవకాశాన్ని ఆ పార్టీలు ఎందుకు వదులుకుంటున్నాయి? అన్న అనుమానాలు అధికం అవుతున్నాయి.

సమర్థ పాలనకు సాంకేతికత తోడు

ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడానికి జనసేన సాంకేతికత సహాయం తీసుకుని ఈ క్యూఆర్‌ కోడ్‌లనే ప్రణాళికలను సిద్ధం చేసిందని పార్టీ చెప్పింది. ప్రజలకు మెరుగైన, మంచి పాలన అందించడం జనసేన సిద్ధాంతమని, ఆ దిశగా తమ అడుగు ఉన్నాయని, ఉంటాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందుకు తాజాగా తమ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకున్న క్యూఆర్ కోడ్ నిర్ణయమే నిదర్శనమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

Read More
Next Story