
JANASENA - PAWANKALYAN- NAAGABAABu | జనసేనాని మాటలతోె కూటమిలో చిచ్చు
టీడీపీని ఉద్దేశించి నాగబాబు మాటలు ఒక పక్క. ఆయనకు డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు తోడయ్యాయి. వారి స్పందన కూటమిలో ప్రకంపనలు రేపేలా ఉన్నాయి.
జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు టీడీపీ నేతపై పరోక్షంగా చురకలు వేశారు. పవన్ కల్యాణ్ గెలవడానికి రెండు కారణాలు.
1. పవన్ కల్యాణ్ చరిష్మా.
2. పిఠాపురం జనసైనికులు, ఓటర్లు. వీరిద్దరు లేకుండా ఏమీ జరిగేది కాదు.
నేనే కాదు. ఇంకెవరైనా సరే. కల్యాణ్ విజయం వెనుక తన పాత్ర ఉందని ఎవరన్నా అనుకుటే వారి ఖర్మ అని వ్యాఖ్యానించారు. ఇది పరోక్షంగా టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్. వర్మను ఉద్దేశించి వ్యాఖ్యానించారా? అనేది తెరమీదకు వచ్చింది.
ఆయన తమ్ముడు, డిప్యూటీ సీెం పవన్ కల్యాణ్ కూడా నేనూ తగ్గేది లేదన్నట్లుగా.. జనసేనతోనే టీడీపీకి అధికారం దక్కింది. అని టీడీపీపై మాటలు సంధించడం చర్చకు దారి తీసింది. అంటే ఇద్దరు కూడా మితిమీరిన విశ్వాసం ప్రదర్శించారనే అబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
జనసేన నుంచి ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత కొణిదెల నాగబాబు మొదటిసభలో మాట్లాడారు. జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు పిఠాపురంలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ప్లీనరీలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రసంగం ప్రతులు చూస్తూ, తన సహజ ధోరణిలోనే నాగబాబు మాట్లాడారు.
మాటల మంటలు..
జనసేన, ఆ పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కల్యాణ్ పిఠాపురంలో విజయం సాధించిన తీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టించేలా ఉన్నాయి. ఆయన ఏమన్నారంటే.. తన తమ్ముడు, డిప్యూటీ సీఎ పవన్ కల్యాణ్ కోరకుండానే వరం ఇచ్చిన దేవుడిగా అభివర్ణించిన నాగబాబు తన ప్రేమానురాగాలు ప్రదర్శించారు. అంతవరకు చక్కగానే ఆయన ప్రసంగం సాగింది. తన తమ్ముడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయంపై ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
"పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో గెలవడానికి ఆయనకు ఉన్న ఇమేజీ తోపాటు పార్టీ కార్యకర్తలు కారణం" అని నాగబాబు గుర్తు చేశారు. "కల్యాణ్ బాబు విజయం తన వల్లే అని ఎరవన్నా భావిస్తే, అది వారి ఖర్మ" అని టీడీపీ నేత వర్మను ఉద్దేశించి వ్యాఖ్యానించారనే మాటలు వినిపిస్తున్నాయి.
పిఠాపురంలో జనసేన పోటీ చేయడానికి వీలుగా టీడీపీ ఆ సీటును వదులుకోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి వరకు ఫీల్డ్ లో ఉన్న వర్మకు సీటు గల్లంతైంది. కాగా,
2024 ఎన్నికల వేళ "తన గెలుపు వర్మ చేతుల్లో పెడుతున్నా. ఆయన తోపాటు ఆయన కుమారుడు జూనియర్ వర్మ కూడా విజయానికి సహకారం అందించాలి" అని పవన్ కల్యాణ్ కోరిన విషయం ప్రస్తావనార్హం. అన్ని శక్తులు పనిచేయడంతో పవన్ కల్యాణ్ పిఠాపురంలో 71,279 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
కుప్పంలో ఎనిమిదోసారి సీఎం చంద్రబాబుకు 48,006 మెజారిటీ లభించింది. 2019 ఎన్నికలతో పోలిస్తే, 18 వేల ఓట్లు పెరిగాయి.
పులివెందులలో మాజీ సీఎం వైఎస్. జగన్ టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై 61, 687 మెజారిటీ వచ్చింది. 2019 ఎన్నికల్లో 89,708 మెజారిటీతో పోలిస్తే భారీగా ఓట్లు తగ్గిన విషయం తెలిసిందే. కాగా,
పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ విజయం వెనుక కూటమి నేతల పనితీరు, వైసీపీ ఉన్న వ్యతిరేకత కలిసొచ్చిందనడంలో సందేహం లేదు. ఇవన్నీ కాదని..
జనసేన ప్రధాన కార్యదర్శి, ఎంఎల్సీ కొణిదెల నాగబాబు శుక్రవారం పిఠాపురం జయకేతనం ప్లీనరీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలకు దారితీసేలా ఉన్నాయి. కూటమి నేతల మధ్య ప్రధానంగా టీడీపీతో వైరుధ్యం బయటపడినట్లు అంచనా వేస్తున్నారు.
గత ఎన్నికల్లో 21కి 21 స్థానాలు గెలిచిన జనసేన నేతల్లో ఆత్మస్థైర్యం హద్దులు దాటినట్లు తరచూ ఆ పార్టీ నేతల మాటల్లో వ్యక్తం అవుతోంది. తాజాగా కూడా అదే జరిగింది.
సార్వత్రిక ఎన్నికల్లో వర్మ సీటు కోల్పోయారు. ఆయనకు కార్పొరేషన్ పదవి కంటే, ఎంఎల్సీ పదవి దక్కుతుందని భావించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల తరువాత కూడా ఊరించిన పదవి దక్కలేదు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పట్టుబట్టడమే కాదు. మూడు నెలల కిందటే నాగబాబుకు ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రివర్గంలోకి తీసుకుంటానని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు కొన్ని రోజుల కిందటే నాగబాబును పదవి వరించింది. ఈ నేపథ్యంలో..
విజయం ముందే ఖరారు
పిఠాపురంలో జరిగిన సభలో నాగబాబు సందర్భాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా "పవన్ కల్యాణ్ విజయం సాధిస్తారని ఎప్పుడో తేలిపోయింది. ప్రధాన కార్యదర్శిగా తనకు ఇక్కడ పనిచేసే భాగ్యం కల్పించారు. నేను నా స్నేహితుడు ఉన్నాం. అది నామమాత్రమే అని తెలుసు" అని అన్నారు. " కల్యాణ్ విజయం ప్రజలు ఇచ్చింది. దీని వెనుక తమ ప్రమేయం ఉందని ఏవరైనా భావిస్తే వారి ఖర్మ" అని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై సోషల్ మీడియాలో అప్పుడే నిరసన వ్యక్తం అవుతోంది. పవన్ కల్యాణ్ ఆయన అన్న నాగబాబు కూడా సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వారే. వారికి మాస్ ఫాలోయింగ్ ఉండడం సహజం. అధికారంలో ఉన్నారు కాబట్టి, కార్యకర్తల్లో మరింత ఉత్సవాం ఉండవచ్చు. అందులో తప్పులేదు. కార్యకర్తలను ఉత్సాహ పరచడానికి మరో విధంగా మాట్లాడేందుకు అవకాశం ఉన్నప్పటికీ, దానిని కాదని "పవన్ కల్యాన్ విజయం వెనుక నాయకుల ప్రమేయం లేదు" అని అర్థం వచ్చేలా వ్యాఖ్యానించడం టీడీపీ ఇన్చార్జి వర్మను ఉద్దేశించే మాట్లాడినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ అంశం కూటమిలో మరో చర్చకు దారితీసేలా కనిపిస్తోంది. టీడీపీ నేత వర్మను పరోక్షంగానే దెప్పిపొడిచారనే భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. దీనిపై రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది వేచి చూడాల్సిందే.
Next Story