మాది తోక పార్టీ కాదు... ఆరోపణలపై గుర్రుమన్న జేడీ
x
జేడీ లక్ష్మీనారాయణ

మాది తోక పార్టీ కాదు... ఆరోపణలపై గుర్రుమన్న 'జేడీ'

'మాది తోక పార్టీ కాదు... యునైటెడ్ ఫ్రంట్‌కి తప్ప ఏ పార్టీకి మేము మద్దతివ్వం' అని సీబీఐ మాజీ చీఫ్ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.


తంగేటి నానాజీ



విశాఖపట్నం: 'ఏనుగు వెళ్తుంటే కుక్కలు ఎన్నో మొరుగుతాయి… వాటిని మేము పట్టించుకోం… మాపై వచ్చిన ఆరోపణల విషయంలో కూడా అంతే... మాపై మాకు, మా కార్యకర్తలకు క్లారిటీ ఉంది' అన్నారు సీబీఐ మాజీ చీఫ్ జై భారత పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ. విశాఖలో జరిగిన యునైటెడ్ ఫ్రంట్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.


క్లారిటీ ఇచ్చిన జెడి...


విశాఖ ఎంవీపీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన జై భారత్ పార్టీ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా యునైటెడ్ ఫ్రంట్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఆయనను కలిసిన ది ఫెడరల్ ప్రతినిధితో పలు విషయాలు పంచుకున్నారు. వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్నారని మీపై ఆరోపణ ఉంది. కాపుల ఓట్లు చీల్చేందుకే పార్టీ పెట్టారా... అన్న ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఈ ఆరోపణలు తన దృష్టికీ వచ్చాయని, వీటిని పట్టించుకోవలసిన అవసరం లేదని అన్నారు. తానేంటో తన పార్టీ ఏంటో ప్రజలకు తెలుసునన్నారు. ‘‘ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి. అలాగని ఏనుగు కుక్కలపై యుద్ధానికి దిగుతుందా... ఇదీ అంతే రాజకీయం అన్నాక ఇంకా బోలెడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదు’’ అంటూ క్లారిటీ ఇచ్చారు.


మళ్లీ విశాఖ నుంచే...


గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలైన జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం తాను స్థాపించిన జై భారత్ పార్టీ నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి పోటీ చేయనున్నట్టు తెలిపారు. అందుకు యునైటెడ్ ఫ్రంట్ పార్టీలు తనకు మద్దతుగా ఉన్నాయని, గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నానని అన్నారు.


రాజకీయాల్లో మార్పులు అవసరం...


ప్రస్తుత రాజకీయాలు భ్రష్టు పట్టాయని, రాజకీయాల్లో విలువలు అవసరమని జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో కూడా విశాఖ ప్రజలు తనను ఆదరించారని, ఈసారి కూడా తన అభ్యర్థిత్వాన్ని ఉత్తర నియోజకవర్గ ప్రజలు బలపరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.






Read More
Next Story