ఏబీ వెంకటేశ్వరరావు పోరాటం ఫలించింది. తీర పోస్టింగ్‌ వచ్చిన రోజే పదవీ విమరమణ పొందారు.


దేశ చరిత్రలో ఎన్నడు, ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఒక ఐపీఎస్‌ అధికారి, అదీ కూడా డీజీపీ ర్యాంకు అధికారి సస్పెండై ఐదేళ్ల కాలం విధులకు దూరంగా ఉండి, విధుల్లో చేరిన రోజే పదవీ విరమణ పొందడం ఏపీ చరిత్రలో నిలచిపోయే ఘటన. పోస్టులో చేరిన సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రెండు సంవత్సారాల తర్వాత ఇదే ఆఫీసులో చార్జ్‌ తీసుకుంటున్నా. నాకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన వారికి కృతజ్ఞతలు. ఇవాళ నా పదవీ విరమణ రోజు. ఈ రోజే పోస్టింగ్‌ ఆర్టర్‌ తీసుకున్నా. అదే రోజు సాయంత్రం పదవీ విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. కారణాలు ఏమైనా ఆల్‌ ఈజ్‌ వెల్‌ అని భావిస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా. ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. పోస్టింగ్‌ ఆర్డర్లు వచ్చాయి. విధుల్లో చేరాను. ఇప్పటికి ఇంత వరకే మాట్లాడాలి. ఇంత కాలం నాకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు. యూనిఫామ్‌తో పదవీ విరమణ చేయడం నా కల నెరవేరినట్లుగా భావిస్తున్నా అని ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడటం గమనార్హం.

పదవీ విరమణ సందర్భంగా మాట్లాడుతూ తుది శ్వాస వరకు అన్యాయాన్ని ఎదిరిస్తూనే ఉంటా. రిటైర్‌ అయినా జీవితాంతం ప్రజా సేవలోనే ఉంటా. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేందుకు రిటైర్‌మెంట్‌ అవకాశం వస్తుందని ఆశిస్తున్నా. సర్వీసులో ఉన్నన్ని రోజులు నీతి.. నిజాయితీతో పని చేశా. పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నా. వృత్తి రీత్యా ఎంతో మందిని చూశాను. నేను చేసిన పోరాటం చేసి ఎన్నో లక్షల లక్షల మంది స్పందించారు. వారందరికీ రుణపడి ఉంటా. నా బాధ, పోరాటం, నిజాయతీ, ఎంతో మందికి దగ్గర చేశాయి. ఈ రోజు వృత్తి రీత్యా మాత్రమే రిటైర్‌ అవుతున్నా. చివరి శ్వాస వరకు అన్యాయాన్ని ఎదిరిస్తూనే ఉంటా.. బాధితుల తరపున పోరాడుతూనే ఉంటా అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఐదేళ్ల కాలం రాజీ లేని పోరాటం చేసిన ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పని చేసిన ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఆ పదవి నుంచి తొలగించింది. పైగా ఆయన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు విని పెగాసిస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి దాని ద్వారా అప్పటి ప్రతిపక్ష నాయకులు ఎక్కడ ఉంటున్నారు.. ఏమి చేస్తున్నారో.. అనే వివరాలను తెలుసుకున్నారనే ఆరోపణలపై ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేసింది. అప్పటి నుంచి ఆయన పదివీ విరమణ రోజు వరకు న్యాయ పోరాటం చేసి ప్రభుత్వంపై విజయం సాధించారు. ఒక సారి సస్పెండ్‌ చేసిన అధికారిని అవే కారణాలు చూపిస్తూ తిరిగి రెండో సారి సస్పెండ్‌ చేయడాన్ని న్యాయం స్థానం తీవ్రంగా తప్పు పట్టింది. అయినా ప్రభుత్వం తన పద్దతిని మాత్రం మార్చు కోలేదు. వెంటనే ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకొని పోస్టింగ్‌ ఇవ్వాలని క్యాట్‌ ఆదేశాలిస్తే దానిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టును ఆశ్రయించారు. సీఎస్‌ పిటీషన్‌ను కొట్టివేస్తూ క్యాట్‌ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఏబీ వెంకటేశ్వరరావుకు 2024 మే 31వ తేదీతో 60 ఏళ్లు నిండటంతో పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. మే 31వ తేదీ ఉదయం ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ, స్టోర్స్‌ పర్చేజ్‌ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకోవలసిందిగా సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మే 31వ తేదీన ఉయదం బాధ్యతలు స్వీకరించిన ఏబీ వెంకటేశ్వరరావు సాయంత్రం పలువురు సన్నిహితులు, ఉద్యోగులు, అధికారులు మధ్య పదవీ విరమణ చేశారు.
ప్రభుత్వానికి కక్ష అవసరమా?
పాలకులు అనే వాళ్లు ప్రభుత్వ పెద్దలుగా అన్నింటిని భరించేందుకు సిద్ధంగా ఉండాలి. ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు విధాన పరమైన నిర్ణయాధికారాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారు. అందుకు చట్ట సభల్లో చేసే శాసనాలు తప్పు దోవ పట్టకుండా అమలు చేసే బాధ్యత వీరిపైన ఉంటుంది. అందుకే కొన్ని సందర్బాల్లో ముఖ్యమంత్రి చెప్పినట్లు కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఏబీ వెంకటేశ్వరరావు కూడా అప్పటి ముఖ్యమంత్రి చెప్పినట్లు చేశారు. దీనిని పెద్ద నేరంగా పరిగణిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన అధికారాన్నంతా ఉపయోగించి ఏబీ వెంకటేశ్వరరావును ఐదేళ్ల కాలం ముప్పు తిప్పలు పెట్టారు. ఇందులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిందే ఎక్కువుగా ఉంటుందే తప్ప అధికారిగా ఏబీ వెంకటేశ్వరరావు చేసింది తక్కువే అని చెప్పొచ్చు. ముఖ్యమంత్రులు చేయాలనుకున్న పనులు ఉన్నతాధికారుల ద్వారా చేయించి ఆ తర్వాత వారి గురించి పట్టించుకోకుండా సంతకాలు పెట్టింది వారే కాబట్టి వారే బాధ్యులంటూ వారిపై చర్యలు తీసుకోవడం పాలకుల దుర్మార్గమైన చర్యగా ఇప్పటికే పలు ముఖ్యమంత్రులపై పలు రకాల ఆరోపణలు వచ్చాయి.
డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్విడ్‌ ప్రోకోకు పాల్పడ్డారంటూ వైఎస్‌ఆర్‌ మరణానంతరం కేసుల్లో ఐఏఎస్‌ అధికారులు ఇరుక్కున్నారు. ఐఏఎస్‌ అధికారులు వారంతట వారే కావాలని కేసుల్లో ఇరుక్కుంటారా? ముఖ్యమంత్రి చెప్పింది చేయక పోతే ఒక సమస్య. నిబంధనలకు విరుద్దంగా చేస్తే మరొక సమస్య. ఏదైనా ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం కాబట్టి వారు చెప్పినట్లు ఐఏఎస్‌లకు చేయక తప్ప లేదు. అందులో భాగంగానే ఏబీ వెంకటేశ్వరరావు విధులు కూడా నిర్వహించారనేది పలువురి వాదన. ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకోవలసిందేనని రిటైర్‌మెంట్‌కు ముందు రోజు హైకోర్టు స్పష్టం చేస్తే కానీ ప్రభుత్వం విధుల్లోకి తీసుకోలేదు.
ఐదేళ్ల బెనిఫిట్స్‌ ఏబీవీకి చెల్లించాల్సిందే
రిటైర్మెంట్‌ రోజు పోస్టింగ్‌ ఆర్డర్స్‌ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు ఏమని సంకేతాలు ఇస్తోంది. తాము కక్ష సాధింపు చర్యలకు పాల్పడినప్పుడు ఎన్నేళ్లైనా ఇలాగే రోడ్డున పడేస్తామని కోర్టు చెప్పింది కాబట్టి తిరిగి ఉద్యోగంలో చేరుకున్నామని సందేశం ఇస్తోందా? సస్పెండ్‌ అయిన నాటి నుంచి ఆయనకు ఎన్ని ప్రమోషన్లు ఇవ్వాలో, ఆ సమయంలో జీత భత్యాలు ఎంత మొత్తంలో పెంచాలో, ఆ పెరిగిన జీతం మొత్తాన్ని ఈ ఐదేళ్ల కాలానికి దశలు వారీగా లెక్కలు వేసి చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఐదేళ్ల కాలానికి ఎలాంటి పని చేయించుకోకుండా ప్రభుత్వం జీతం చెల్లిస్తుంది. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ప్రజల డబ్బును దుర్వినియోగం కదా అనేది పలువురి మేధావుల ప్రశ్న.
Next Story