మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీల సమక్షంలో షర్మిల

షర్మిల రాకతో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. తిరిగి ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వస్తుందని పలువురు కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ పెరిగింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిల గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, యువజన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు, కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్‌గాంధీల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

ఏపీలో షర్మిల పార్టీ బాధ్యతలపై చర్చ
వైఎస్‌ షర్మిలకు ఏపీలో ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారనేదానిపై చర్చ కొనసాగుతున్నది. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రెండు రోజుల క్రితం మాట్లాడుతూ షర్మిల రాకను స్వాగతిస్తున్నామని, ఆమెకు ఏపీలో ఎటువంటి బాధ్యతలు అప్పగించినా కలిసికట్టుగా ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ఆమెను బలపరుస్తుందని విలేకరుల వద్ద ప్రకటించారు.
మాజీ ఎంపీ చింత మోహన్‌ తిరుపతిలో మాట్లాడుతూ ఏఐసీసీ సమావేశంలో షర్మిలను కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించారని, పార్టీ ఆలోచించి సముచిత స్థానం ఆమెకు కల్పిస్తుందని, ఆమె రాకను నేను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
వైఎస్సార్‌సీపీలో అనేక మంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. వారు తప్పకుండా కాంగ్రెస్‌వైపు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. షర్మిలతో ఇప్పటికే చాలా మంది టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. ప్రధానంగా మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ప్రయాణం షర్మిలతోనే ఉంటుందని ఇది వరకే ప్రకటించారు. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరగానే నేను కూడా కాంగ్రెస్‌లో చేరుతానని బుధవారం సీఎం కార్యాలయం వద్దే వెల్లడించారు.
వైఎస్సార్‌సీపీలో సీట్లు దక్కని ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ వైపు..
రాష్ట్రంలో సుమారు 60 మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటి వరకు ప్రకటించిన వారిలో 13 మంది ఎమ్మెల్యేల సీట్లు గల్లంతయ్యాయి. మిగిలిన వారికి వేరే నియోజకవర్గాల్లో అవకాశం కల్పించారు. ఈ 13 మంది ఇప్పుడు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రాజకీయాల నుంచి దూరంగా ఉండేందుకు వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తమ సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ పార్టీ ఉన్నందున అందులో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. షర్మిలకు తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌ పగ్గాలు ఇస్తారనే ప్రచారం సాగుతుండటంతో ఆమెను వీలైనంత వరకు కలిసి ఆమె ద్వారానే కాంగ్రెస్‌లోకి చేరేందుకు రెడీగా ఉన్నారు.
కాంగ్రెస్‌ వైపు యువత, మహిళల చూపు..
మహిళలను ఎక్కువగా షర్మిలను ఆకర్షించే అవకాశం ఉంది. అలాగే యువతరం కూడా షర్మిల బాట నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో కొత్తగా పరిశ్రమలు వచ్చిన దాఖలాలు పెద్దగా లేవని చెప్పాలి. ఉద్యోగల కల్పన విషయంలో యువత, నిరుద్యోగులు వేరే పట్టణాలను వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ ఏపీలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు చెప్పుకోదగినవి లేవు. బెంగళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి నగరాలను ఆశ్రయించాల్సి వస్తుంది. కాంగ్రెస్‌ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తప్పకుండా ఏపీకి మంచి రోజులు వస్తాయనే ఆలోచనలో ఉన్నారు. ప్రత్యేక హోదా ఏపీ సాధిస్తే ఇక తిరుగుండదని, అది కాంగ్రెస్‌తో మాత్రమే సాధ్యమవుతుందనే నమ్మకంలో యువత ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో షర్మిల ద్వారా ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని కాంగ్రెస్‌ చెప్పిస్తుంది. ఆ నినాదం రాష్ట్రంలో చాలా మంది ఓటర్లను రాబడుతుందనే నమ్మకంలో కాంగ్రెస్‌ వారు ఉన్నారు.
ఇప్పటికే మొదలైన కాంగ్రెస్‌ నేతల పర్యటనలు
రాష్ట్రంలోని ఎస్సీ వర్గాలను రానున్న ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఆల్‌ ఇండియా ఎస్సీసెల్‌ చైర్మన్‌ కొప్పుల రాజు, ఏఐసీసీ నాయకులు జేడీ శీలం రంగంలోకి దిగారు. ఇప్పటికే విజయవాడలో ఇటీవల జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఎస్సీల్లోని ముఖ్యనాయకులతో వీరు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గాలను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలకు రూపకల్పన విజయవాడలోనే జరిగింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో మంగళవారం రాత్రి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ముఖ్యనాయకులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేడీ శీలం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
రాహుల్‌ గాంధీ సూచన మేరకు ఏపీలో వీరి పర్యటన ప్రారంభమైనట్లు సమాచారం. వీరిద్దరూ ఏపీకి చెందిన వారు కావడం విశేషం. ఏపీలో కొప్పుల రాజు పలు జిల్లాల్లో కలెక్టర్‌తో పాటు రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాల్లో సమర్థవంతంగా పనిచేశారు. జేడీ శీలం కర్నాటక క్యాడర్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి. ఏపీ నుంచి బాపట్ల ఎంపీగా సినీ నిర్మాత రామానాయుడుపై పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం రాజ్యసభకు పంపించి శీలంను గౌరవించింది. కేంద్రంలో మన్మోహన్‌ సింగ్‌ క్యాబినెట్‌లో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా శీలం పనిచేశారు. ఈ చొరవతో ప్రజల్లోకి త్వరగా చొచ్చుకుపోగలరనే నమ్మకంతో రాహుల్‌ గాంధీ వీరికి ఏపీ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
ప్రస్తుతం వీరిరువురు సోనియా, రాహుల్‌ గాంధీల వద్ద అంతరంగికులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నెదురుమల్లి జనార్థన్‌రెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిల వద్ద మంచి పేరు సంపాదించారు. వైఎస్సార్‌ మరణానంతరం కె రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొప్పుల రాజు సీఎం ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టే ప్రతి ముఖ్యమైన కార్యక్రమం వీరి కనుసన్నల్లోనే అప్పట్లో జరిగేది.
కొప్పుల రాజు, జేడీ శీలం ఇరువురూ రాహుల్‌గాంధీ టీములో ఉన్నారు. ఎక్కువగా వీరు ఏఐసీసీ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. అయితే ఉన్నట్లుండి ఏపీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనటం పలువురిలో చర్చకు దారితీసింది.
Next Story