జనసేనలో కులాల కుంపటి.. పవన్‌ను నిలదీస్తున్న నేతలు
జనసేనలో కులాల చిచ్చు చెలరేగింది. టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ అధిష్టానం ఓసీలకు మినహా ఇతర కులాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయా వర్గాల నేతలు ఆగ్రహిస్తున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జనసేనకు కొత్త ఇబ్బందులు వస్తున్నాయి. టికెట్ తమకే ఇవ్వాలంటూ కొందరు డిమాండ్ చేస్తుంటే.. మరికొందరు ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడితే ఇప్పుడు మాకు తీరని అన్యాయం చేస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో ఇప్పుడు జనసేనలో కులాల కుంపటి మండటం మొదలైంది. జనసేన అధిష్టానం అగ్రవర్ణాలకే పెద్దపీట వేస్తుందంటూ ఇతర కులాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జనసేన ప్రకటించిన 18 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాలను ఓసీలకు కేటాయించడమే ఈ గందరగోళానికి కారణం. బీసీలకు కేవలం రెండు సీట్లు కేటాయించడంపై ఆ వర్గాలు కూడా జనసేనపై మండిపడుతున్నాయి. జనసేన అధిష్టానం మహిళలకు కూడా న్యాయం చేయలేదని, ఓసీలకు మాత్రమే పెద్దపీట వేయడం ఇతర కులాల వారికి తీరని అన్యాయం చేయడమేనంటూ ఇతర సామాజిక వర్గాల నేతలు ఆగ్రహిస్తున్నారు.
జనసేనపై ఆరోపణల వెల్లువ
జనసేనలో కులాల వివాదం రేగడంతో పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీట్ల విషయంలో శెట్టి బలిజ, గౌడ, తూర్పు కాపు, బీసీ, వెలమ, యాదవ, బోయ, కురుబ, చేనేత కులాలకు ప్రాతినిధ్యం దక్కపోవడం దారుణమని ఆయా వర్గాలు వారు అంటున్నారు. మైనారిటీలకు జనసేన ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంపై కూడా మైనారిటీ వర్గాలు మండిపడుతున్నాయి. సీట్ల విషయంలో జనసేన ఏం ఆలోచించి ఇతర సామాజిక వర్గాల వారిని పక్కన బెట్టి అగ్రవర్ణాల అభ్యర్థులకే ఎందుకు టికెట్లు కేటాయిస్తున్నారని నిలదీస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం తాము కష్టపడితే ఆ ఫలాలను ఇప్పుడు వేరే వారు అనుభవించేలా చేయడం ఏమాత్రం తగదు అని ధ్వజమెత్తుతున్నారు.
వలస నేతలకు టికెట్లు ఎలా ఇస్తారు
టికెట్ల విషయంలో జనసేన అధిష్టానం వలస నేతలకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తుందని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాల్లో అధిక శాతం సీట్లను వలస నేతలకు కేటాయించారని, సొంత పార్టీ నేతలు ఏమైనా చేతకాని వారా.. వలస నేతలకు టికెట్లు ఇవ్వడానికి అని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. దీనిపై పార్టీ నేతల్లోనే కాదు ప్రజల్లో కూడా అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయని అన్నారు. తిరుపతి, అనకాపల్లి, భీమవరం, పెందుర్తి సీట్లను వలస నేతలకు కేటాయించడంతో అసమ్మతి రేగింది.
పార్టీ కోసం పనిచేసిన నేతలకు టికెట్లు దక్కపోవడంపై పార్టీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీ ఇంకా మూడు సీట్లే కేటాయించాల్సి ఉంది. దీంతో వీటినైనా ఇతర సామాజిక వర్గాలకు కేటాయించి కొంతమేర అయిన న్యాయం చేయాలని కొందరు కోరుతుంటే మరికొందరు మాత్రం మూడు సీట్లతో ఎంతమందికి న్యాయం చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో జనసేన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Next Story