తిరుపతిలో ఏం జరిగిందో.. ఆ పెరుమాళ్లకే తెలియాలి..!
x
సుగుణమ్మను కలిసి ఆరణి శ్రీనివాసులు

తిరుపతిలో ఏం జరిగిందో.. ఆ పెరుమాళ్లకే తెలియాలి..!

బాబన్న వచ్చాడు. అందర్నీ రమ్మన్నారు. కూర్చోబెట్టి మాట్లాడారు. తిరుపతి సీన్ మారడం వెనుక గుట్టు ఆ పెరుమళ్ళకే ఎరుక..!


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

"సైకిల్ గుర్తు పుట్టిన ఊరు తిరుపతి.. ఎలక్షన్లకు ఆ గుర్తు లేకుండా పోవడం భరించలేను. అవసరమైతే జనసేనలోకి వెళతా.. టికెట్ నాకే ఇవ్వాలి. నేనే పొటీ చేయాలి. ఐదేళ్లు పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. నాకు అన్యాయం జరిగింది. నువ్వు ఓడిపోతావ్ అంతే... " అని కళ్ళ నుంచి నీరు ఉబికి వస్తున్నా బిగబట్టుకుని గత 20 రోజులుగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మీడియా ముందు అనేక సందర్భాల్లో వెళ్లగక్కిన ఆవేదన అది. ఎందుకంటే..

2024 ఎన్నికల కోసం కూటమిలో పొత్తుల వల్ల పట్టుబట్టి తిరుపతి సీటును జనసేన దక్కించుకుంది. దీనివల్ల టీడీపీకి పోటీ చేసే అభ్యర్థులు ఉన్న, లేకుండా పోయింది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు ప్రతిబంధకంగా మారింది. సీట్ల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి తిరుపతి శాసనసభ స్థానంపై ఉత్కంఠ కొనసాగింది. ఆ తర్వాత కూడా సుగుణమ్మ మెట్టు దిగలేదు. కలిసి రావడానికి ససేమిరా అని భీష్మించారు. అంతకుముందు ఏమైందంటే..


సీట్ల సర్దుబాటు తర్వాత జనసేన పార్టీకి అభ్యర్థి కొరత ఏర్పడింది. జనసేన పార్టీకి తిరుపతిలో కొందరు నాయకులు ఉన్నారు. కులం, పార్టీ, అభిమానులు జనసేన పార్టీకి తక్కువేమీ లేరు. ఇద్దరికీ పరపతి కూడా ఉంది. వచ్చిన చిక్కంతా గట్టి పోటీ ఇవ్వగలిగిన వారే తక్కువ. ఇది కాస్త చిత్తూరు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు వరంగా.. వెతుకుతున్న తీగ కాలికి తగినట్లు అయింది.

సర్వే నివేదికలు బాగా లేవంటూ చిత్తూరులో ఏ శ్రీనివాసులకు టికెట్ ఇవ్వడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి నిరాకరించారు. ఇస్తానని చెప్పిన రాజ్యసభ సభ్యత్వ అవకాశం కూడా దక్కలేదు. ఇదే సందుగా.. జనసేన పార్టీలో చేరిపోయారు. ఇప్పటివరకు తచ్చాడుతున్న జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఆరణి శ్రీనివాసులకు పోటీ చేసే అవకాశం కల్పించారు. జనసేనలో కొందరు కలిసి రాలేదు. మాజీ ఎమ్మెల్యే కన్నీరుమున్నీరయ్యారు. శాపనార్ధాలు పెట్టారు. అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు పరిస్థితి సంరక్షించారు. తిరుపతి నాయకులు కూడా జనసేనతో కలవలేదు. కలసి వచ్చిన ఒకరిద్దరు టీడీపీ, జనసేన ప్రధాన నాయకులతో కలిసి, తన వంతు తాను ప్రయత్నాలు చేస్తూనే జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారం కూడా ప్రారంభించారు. ఇదే సమయంలో ప్రజాగళం బస్సు యాత్ర ప్రారంభించిన టీడీపీ చీఫ్ అండ్ చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తికి వచ్చారు. తిరుపతి నాయకులందరినీ అక్కడికి రమ్మన్నారు. కూర్చుండబెట్టి అందరితో మాట్లాడారు. సీన్ మారిపోయింది.


అంతా ఏడుకొండలవాడికే తెలుసు..

బస్సు యాత్రకు వచ్చిన చంద్రబాబన్న శ్రీకాళహస్తి నుంచి విజయవాడ వైపు వెళ్ళిపోయారు. తిరుపతి నాయకులంతా ఇంటికి వచ్చారు. సీన్ కట్ చేస్తే.. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ ఇంటికి సోమవారం ఉదయం వెళ్లారు. కూటమి నాయకులంతా కలిసి మాట్లాడుకున్నారు. కాసేపటికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. "టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి అభ్యర్థుల విజయం తథ్యం" అని నిన్నటి వరకు కూర్చున్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ జోస్యం చెప్పేశారు. టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అందరం కలిసి పనిచేస్తామని ఆమె ప్రకటించారు.

"సీఎం అయ్యేవరకు అసెంబ్లీలోకి రాను" అనే చంద్రబాబు నాయుడు శపథం తిరుపతి అసెంబ్లీ స్థానంలో బహుమతిగా అందిస్తామని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ స్పష్టం చేశారు. ఇందుకోసం జనసేన బీజేపీతో కలిసి పనిచేయడం ద్వారా జనసేన అభ్యర్థి ఆయన శ్రీనివాసులు విజయానికి తోడ్పాటు అందిస్తామనే ధీమా వ్యక్తం చేశారు. టీడీపీలో మిగతా నాయకులు, పార్టీ శ్రేణులు కలిసి వస్తారా? లేదా? వచ్చిన వారి సహకారం, మద్దతు.. ఎలా ఉండబోతుందనేది తిరుమల వెంకటేశ్వర స్వామికి తెలియాలి.

Read More
Next Story