Chevireddy Bhaskar Reddy, Magunta Raghavareddy

ఆ రెండు కుటుంబాలు రాజకీయాల్లోనూ, వ్యాపారాల్లోనూ పోటాపోటీగా ఉన్నాయి. అయితే ఒక సీనియర్‌పై ఒక జూనియర్‌ పోటీకి దిగుతున్నాడు. ఏ నియోజకవర్గం నుంచి.. ఎవరు వారు.


ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కీలకు దశకు చేరుకుంది. శనివారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఫైనల్‌గా విడుదల చేస్తున్నారు. చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేయాల్సి ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగుతున్నందున ఎవరికి ఎన్ని సీట్లు, ఎవరు ఏ పార్టీ తరపున ఎక్కడ పోటీ చేయాలనే అంశాలు కూడా ఫైనల్‌ అయ్యాయి. ఒకటీ రెండు స్థానాల్లో కొద్దిగా పొరపొచ్చాలు ఉన్నా అవి కూడా ఒకటీ రెండు రోజుల్లో సర్థుకుంటాయని ఆయా పార్టీల వారు తెలిపారు.

ఇరువురూ రాజకీయ, వ్యాపార అనుభవజ్ఞులే..
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ స్థానానికి ఒక జూనియర్, ఒక సీనియర్‌ పోటీ పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోటీలోకి దిగుతుండగా తెలుగుదేశం పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట రాఘవరెడ్డి పోటీ కి దిగుతున్నారు. ఒకరిది రాజకీయ అనుభవం, మరొకరిది యువరక్తం. రాజకీయానుభవం తండ్రి, పెద్దనాన్నల నుంచి వారసత్వంగా తెచ్చుకున్నా వ్యాపారాల్లో దిట్ట. వీరిద్దరూ పోటీ పడుతున్నారు. ఈ పార్లమెంట్‌ నియోజకవర్గంలో డబ్బు ఏరులై పారుతుందని ఓటర్లు ఆశతో ఉన్నారు. ఎందుకంటే ఇరువురు అభ్యర్థులు ఆర్థికంగా బాగా స్థితిమంతులు కావడం.
ఖరారు కాని అభ్యర్థిత్వాలు
వైఎస్సార్‌సీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినా అధికారికంగా ముఖ్యమంత్రి ప్రకటించలేదు. శనివారం చెవిరెడ్డి పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే శనివారం సీఎం అభ్యర్థుల ఫైనల్‌ జాబితాను విడుదల చేయనున్నందున చెవిరెడ్డి పేరు కూడా ఒంగోలు పార్లమెంట్‌కు ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఒంగోలు పార్లమెంట్‌ నుంచి పోటీ చేస్తే అనుకూలంగా ఉంటుందా? వ్యతిరేకత ఉంటుందా? అనే విషయంపై సర్వే చేయించారు. తన ప్రైవేట్‌ సైన్యం చేత సర్వే చేయించి సర్వే ఫలితాలు పరిశీలించిన చెవిరెడ్డి పోటీలోకి దిగాల్సిందేననే ఆలోచనకు వచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి రెండో సారి ఎమ్మెల్యేగా ప్రాతినిద్యం వహిస్తున్న చెవిరెడ్డి ఈ సారి తన కుమారుడిని ఎన్నికల బరిలోకి దిగారు. ఏడాది క్రితమే తన కుమారుడికి టిక్కెట్‌ ఇవ్వాలని సీఎంను కోరడంతో ఆయన హామీ ఇచ్చారు. దీంతో కుమారుడిని రాజకీయంగా అనుభవం వచ్చేలా పార్టీ పదవులు, ప్రజా ప్రతినిధిగానూ రంగంలోకి దించారు.
మాగుంట రాఘవరెడ్డికి కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇంకా టిక్కెట్‌ ఖరారు చేయలేదు. ఒకటీ రెండు రోజుల్లో టిక్కెట్‌ కన్‌ఫాం చేసే అవకాశం ఉంది. మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబం రాజకీయంగా ఎదిగింది ఒంగోలులోనే. ఆయన సోదరుడు స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి ఎంపీగా మొదటిసారి ఒంగోలు నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలిచారు. ఆయన మరణంతో ఆయన భార్య మాగుంట పార్వతమ్మను ఎన్నికల బరిలోకి దించారు. ఆమె రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచారు. ఆ తరువాత రాజకీయ ప్రవేశం చేసిన మాగుంట శ్రీనివాసులురెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి మూడు సార్లు కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచారు. ఒకసారి వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందారు. వైవీ సుబ్బారెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైఎస్సార్‌సీపీలో చేరి గెలుపొందారు. అయితే రానున్న ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు స్థానం నుంచి పోటీకి అవకాశం వైఎస్సార్‌సీపీ ఇవ్వలేదు. దీంతో ఆ పార్టీకి ఇటీవల రాజీనామా చేశారు. త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తన కుమారుడు ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేస్తారని వెల్లడించారు.
తండ్రి వారసత్వం..
మాగుంట రాఘవరెడ్డికి రాజకీయాలు కొత్త. అయితే తండ్రి నుంచి రాజకీయాలు నేర్చుకున్న రాఘవరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా ఒంగోలు నుంచి పోటీపడుతున్నారు. ఈయన ఢిల్లీ మద్యం స్కాంలో నిందితుడిగా ఉన్నారు. అప్రువర్‌గా మారుతున్నట్లు కోర్టులో రాఘవరెడ్డి అంగీకరించడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా కోర్టులో సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు భార్య ఆరోగ్యం దృష్ట్యా రాఘవరెడ్డికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సుమారు 70 సంవత్సరాలుగా మద్యం వ్యాపారంలో ఈ కుంటుంబం ముందుకు సాగుతోంది. పది రాష్ట్రాల్లో వీరికి వ్యాపారాలు ఉన్నాయి.
పోటాపోటీ
అనుభవం ముందు ఏదీ పనికి రాదంటారు. అయితే ఒక్కోసారి అనుభవజ్ఞుడు కూడా బోల్తా పడుతుంటాడు. ఒంగోలు పార్లమెంట్‌ స్థానానం మొదటి నుంచీ కాంగ్రెస్‌కు కాస్త అనుకూలమైన నియోజకవర్గం. వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నాన్‌లోకల్‌గాను, రాఘవరెడ్డిని లోకల్‌గాను ఓటర్లు భావిస్తున్నారు. రాఘవరెడ్డి తన తండ్రి ఎంపీగా ఉన్నందున ఐదేళ్లలో పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలతో సంబంధాలు పెంచుకున్నారు. పేర్లు పెట్టి పిలిచే చనువు కూడా రాఘవరెడ్డికి ఉంది. ఇక డబ్బులో వెనుకంజ వేసే అవకాశమే లేదు.
చెవిరెడ్డి కూడా రాజకీయంగా అనుభవశాలి. నియోజకవర్గాల్లో ఎలా ముందుకు సాగాలో తెలుసు. వ్యూహాలు రచించడంలో దిట్ట. పోల్‌ మేనేజ్‌మెంట్‌లోనూ తనకు తానే సాటి. ఇరువురు హేమాహేమీలు ఒంగోలు పార్లమెంట్‌ నుంచి రంగంలోకి దిగుతున్నారు. పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.
Next Story