DTC | మహిళాధికారి ఇంటికెళ్లి తలుపు కొట్టి తన్నులు తిన్న కడప డీటీసీ!
x
KADAPA DTC OFFICER CHANDRASEKHAR REDDY Grafics

DTC | మహిళాధికారి ఇంటికెళ్లి తలుపు కొట్టి తన్నులు తిన్న కడప డీటీసీ!

కడప ట్రాన్స్ పోర్ట్ అధికారి చంద్రశేఖరరెడ్డిని పిచ్చికుక్కును కొట్టినట్టు కొట్టారు. ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. అరెస్ట్ చేసేందుకు పోలీసులు వేటాడుతున్నారు.


ఆయనో ట్రాన్స్ పోర్ట్ ఉన్నతాధికారి. కడపలో ఉంటాడు. పేరు చంద్రశేఖరరెడ్డి. బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు అన్నట్టుగా ఆయన తన కింద పని చేస్తున్న ఓ మహిళాధికారిపై కన్నేశారు. ఆమెను లోబరుచుకునేందుకు (Sexual Harassment) నానా తంటాలు పడ్డారు. అసభ్య సందేశాలు పంపారు. ఆమె పట్టించుకోలేదు. ఈసారి ఇంకొంచెం మోటుగా ఎస్.ఎం.ఎస్.లు పంపాడు. అయినా ఆమె ఖాతరు చేయలేదు. మౌనం అర్థంగీకారం అనుకున్నాడో ఏమో ఈసారి మరింత బరి తెగించాడు. నేరుగా ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్డాడు. ఈ వ్యవహారం ముదరడంతో ఆమె జరిగిన తంతంతా తన భర్తకు చెప్పింది. అతగాడు చంద్రశేఖరరెడ్డి నేరుగా ఇంటికి వచ్చిన విషయాన్ని ఇంటికి బిగించిన సీసీ కెమేరాల్లో చూసిన ఆమె భర్త.. వెంటనే పోలీసులకు ఫోన్‌ చేయడంతో అక్కడినుంచి ఉడాయించారు.
ఇదండీ కడప డెప్యూటీ ట్రాన్స్ పోర్ట్ అధికారి చంద్రశేఖరరెడ్డి నిర్వాకం. ఇప్పుడీ విషయం కడపలో కలకలం రేపింది. మహిళా ఉద్యోగి పట్ల ఇంత అవమానకరంగా ప్రవర్తించిన ఈ వ్యక్తిని ఏం చేయాలి? అనే దానిపై ట్రాన్స్ పోర్టు అధికారులు తలలు పట్టుకుంటే ఆ అధికారిపై ఇంకా మీనమేషాలు లెక్కించడమేమిటని మీడియా ప్రత్యేకించి సోషల్ మీడియా సైనికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించి వెంటనే క్రిమినల్‌ చర్యలు ప్రారంభించాలన్న డిమాండ్ సమంజసమే అయినా దానికో ప్రొసీజర్ ఉంటుంది కదా అని అధికారులు చెబుతున్నారు.
చంద్రశేఖరరెడ్డికి ఏమి కావాలి?
చంద్రశేఖరరెడ్డి ట్రాన్స్ పోర్టు విభాగంలో ఉద్యోగిగా చేరాక కొంత కాలం గుంటూరు జిల్లాలో పని చేశారు. ఇటీవలే కడప డీటీసీగా బాధ్యతలు చేపట్టారు. చంద్రశేఖరరెడ్డి స్త్రీలోలుడనే వాదు ఉండనే ఉంది. వస్తూనే కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించసాగారు. ఆయన వేధింపులు భరించలేక ఒక మహిళా ఉద్యోగి నెల కిందట బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. మరో మహిళా అధికారి ఫోన్‌కు తరచూ అసభ్య సందేశాలు పంపిస్తున్నారు. ఉన్నతాధికారి కావడంతో ఆమె ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా భరించారు. ప్రవర్తన మార్చుకోవాలని బుద్ధి చెప్పేందుకు ప్రయత్నం చేశారు. ఆమె భర్త ఊళ్లో లేని సమయం చూసుకుని జనవరి 24న నేరుగా ఆమె ఇంటికి వెళ్లారు. తలుపు కొట్టాడు. వచ్చింది ఎవరా అని ఆమె సీసీటీవీ కెమెరాలో చూస్తే ఈ ప్రబుద్ధుడు డీటీసీ కనిపించారు. వెంటనే ఆమె తన భర్తకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. దూర ప్రాంతంలో ఉన్న ఆయన.. తన ఫోన్‌లో సీసీ కెమెరా దృశ్యాలు చూసి వెంటనే డీటీసీకి ఫోన్‌ చేశారు. దీంతో చంద్రశేఖర్‌రెడ్డి అక్కడ నుంచి పరారయ్యారు.
చంద్రశేఖరరెడ్డిని చితకబాదిన వైనం...
ఈ విషయాన్ని ఆ మహిళా అధికారి తన పై అధికారి, జాయింట్ ట్రాన్స్ పోర్ట్ అధికారి (జేటీసీ)కి ఫిర్యాదు చేశారు. ఈలోగా ఇంటికి తిరిగొచ్చిన ఆమె భర్త కత్తి తీసుకుని నేరుగా డీటీసీ కార్యాలయానికి వెళ్లి వీరంగం వేశారు. చంపుతా, పొడుస్తా అంటూ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ కత్తి చేతపట్టుకుని వచ్చిన ఆయన్ను చూసి అక్కడి అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. మహిళా అధికారితో ఆయన ప్రవర్తన విషయం తెలిసి వారు కూడా.. చంద్రశేఖర్‌రెడ్డికి తగిన శాస్తి చేయాలని సూచించారు. దీంతో ఆమె భర్త లోపలకు వెళ్లి డీటీసీని చితకబాదారు. తప్పు చేశానంటూ మహిళా అధికారి కాళ్లపైన పడి క్షమాపణ చెప్పారు. ఈ విషయం బయటకు పొక్కింది. ఇక అంతే ఆ చంద్రశేఖరరెడ్డి పరుగులంకించుకున్నారు. ఎక్కడికి పారిపోయాడో ఇంకా తేలియలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చంద్రశేఖర్‌రెడ్డి బదిలీ.. జేటీసీతో విచారణ
మహిళా అధికారితో డీటీసీ ప్రవర్తనపై కథనాలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. కడప నుంచి చంద్రశేఖర్‌రెడ్డిని బదిలీ చేసి కమిషనర్‌ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో రాయలసీమ జోన్‌ జేటీసీ కృష్ణవేణి కడప చేరుకుని విచారణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజి పరిశీలించారు. బాధిత మహిళతోనూ మాట్లాడారు. డీటీసీని ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి.
బాధితురాలికి మంత్రి పరామర్శ..
చంద్రశేఖర్‌రెడ్డి గతంలో బాపట్ల, శ్రీకాకుళం, గుంటూరు, నెల్లూరు కేంద్రాల్లో పనిచేశారు. ఆ సమయంలోనూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. మరోపక్క ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టాయి. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళా అధికారికి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భరోసా ఇచ్చారు. జనవరి 24వ తేదీ శుక్రవారం ఆమెకు ఫోన్‌ చేసి పరామర్శించారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఇప్పటికే నిందితుడిపై చర్యలు తీసుకున్నామని, సమగ్ర విచారణకు ఆదేశించామన్నారు. తగిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక...
కడప డీటీసీ చంద్రశేఖర్‌రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జేటీసీ కృష్ణవేణి తెలిపారు. బాధిత మహిళ, ఆమె భర్త నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశామన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటనను కూడా రికార్డ్ చేశారు. డీటీసీ చంద్రశేఖర్‌రెడ్డి వేధింపులను వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ తీవ్రంగా పరిగణించారు. డీటీసీపై విచారణకు ఐదుగురు మహిళా అధికారులతో కమిటీ వేసి.. మూడురోజుల్లో నివేదిక ఇవ్వాలని జనవరి 25న ఆదేశించారు. పరారైన నిందితుడు చంద్రశేఖర్‌రెడ్డి కోసం పోలీసులు వేటాడుతున్నారు.
Read More
Next Story