వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా నేతల అరెస్టుల విషయం ఒక జిల్లా పోలీస్ బాస్ బదిలీకి కారణంగా మారింది.
వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జిల అరెస్టుల వ్యవహారం చినికి చినికి గాలి వానలా మారుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియాపై దృష్టి సారించడంతో ఇప్పుడది రాష్ట్ర వ్యాపితంగా చర్చనీయాంశంగా మారింది. కడప జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ నేత, ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జి నర్రా రవీంద్రరెడ్డిపై చర్యలు తీసుకోలేదని కూటమి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం కడప జిల్లా ఎస్పీ హర్షవర్థన్‌రాజుపై బదిలీ వేటు వేసింది. రవీంద్రరెడ్డి సోషల్ మీడియాలో చేసిన అసభ్యకర పోస్టులపై ఫిర్యాదులు వచ్చినా, చర్యలు తీసుకోలేదని ఆయనను బదిలీ చేశారు. ఆమేరకు ఉత్తర్వులను వెంటనే విడుదల చేశారు. ఎస్సీతో పాటు కడప జిల్లాలో సీఐని సస్పెండ్ చేసింది. రవీంద్రరెడ్డిని అరెస్టు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని కడప జిల్లా టీడీపీ నేతలు ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు చేయడంతో ఎస్పీపై బదిలీ వేటు తప్ప లేదు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లాకు మంచి ఎస్పీ కావాలని సీఎం చంద్రబాబు నాయుడే హర్షవర్థన్‌రాజు ఐపీఎస్‌ను ఏరి కోరి కడప జిల్లాకు ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. రెడ్ బుక్‌లో మూడో చాప్టర్ ఓపెన్ చేశానంటూ కొద్ది రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో ఉండగా ప్రకటించారు. అలా ప్రకటించారో లేదో అంతే వేగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జిల అరెస్టుల ప్రక్రియ మొదలైంది. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో దాదాపు 100 మందికి పైగా పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో వార్నింగ్‌లు ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులపై చట్టపరంగా చర్యలు తీసుకునే విషయంలో సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ, అందుకు భిన్నంగా ఏపీలో అరెస్టుల పర్వం సాగుతోందని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ నేతల అరెస్టులపై న్యాయ పోరాటం చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తని ఐపీఎస్‌ల మీద కూటమి నేతలు గుర్రుగా ఉన్నారు. వైఎస్‌ఆర్ కడప జిల్లాలో పెట్రేగిపోయి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని అరెస్టు చేయాలని ఎస్పీ హర్షవర్థన్‌రాజుకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని పలువురు కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులకు ఫిర్యాదులు చేశారు. ఇదే విషయాన్ని బుధవారం జరిగిన మంత్రి వర్గం సమావేశంలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వెనువెంటనే ఎస్పీ హర్షవర్థన్‌రాజు బదిలీకి సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది.