సత్యభామ  మూవీ రివ్యూ
x

'సత్యభామ' మూవీ రివ్యూ

ఫర్వాలేదనిపించే,కాజల్ వన్ ఉమన్ షో. కొత్త తరహా ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ ఎమోషనల్ థ్రిల్లర్. ఇంకా వివరంగా చెబితే...


"సత్యభామ" సినిమా ఈ శుక్రవారం(7.6.24) విడుదలైన రెండు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో ఒకటి. హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమా. ఇంకొకటి పాయల్ సింగ్ రాజ్ పుత్ లేడీ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన "రక్షణ". సస్పెన్స్ థ్రిల్లర్‌గా భావిస్తున్న సత్యభామ సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. “చందమామ” సినిమాలో నటించిన తర్వాత టాలీవుడ్ చందమామగా పిలువబడే కాజల్ అగర్వాల్ దాదాపు తెలుగు హీరోలు అందరితో నటించింది. అయితే ఇంతవరకు ఇలాంటి పాత్రలో నటించలేదు. ఈ కథ వినగానే నచ్చేసి చేసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ బాగానే కసరత్తు(నిజంగానే.. ఫైట్ల కోసం)

చేసిందట. 2017 లో చిరంజీవితో నటించిన " ఖైదీ నెంబర్ 150" , బాలకృష్ణతో తీసిన సక్సెస్ఫుల్ సినిమా "భగవంత్ కేసరి"(2023) తప్ప పెద్దగా హిట్లు లేని నేపథ్యంలో, ఈ సినిమా మీద కాజల్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. అలాగే నిర్మాత, దర్శకులు కూడా

కథాపరంగా చెప్పాలంటే ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. ఇలాంటి సినిమాలు గతంలో ఎన్నో వచ్చాయి. అయితే ఒక లేడీ పోలీస్ అధికారిగా, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌గా నటించిన సినిమాలు తక్కువే. గతంలో విజయశాంతి " కర్తవ్యం", వైజయంతి లాంటి సినిమాల్లో పోలీస్ అధికారిగా నటించినా, అవి సాధారణ పోలీస్ సినిమాలు. ఎన్నో కమర్షియల్ సినిమాల్లో చందమామలా మెరిసిన, విరిసిన కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో, ప్రధానమైన పోలీస్ పాత్రలో ఎలా చేసింది? సినిమా ఎలా ఉంది? అన్న దానిమీద సర్వత్ర కొంచెం ఆసక్తి కలిగింది. ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే చాలా ముఖ్యం. అయితే ఈ సినిమాకు రచన తో పాటు స్క్రీన్ ప్లే రాసింది శశికిరణ్ తిక్క గతంలో " మేజర్" సినిమా తీసిన ఈ దర్శకుడు నిర్మాణంలో కూడా భాగస్వామి అయ్యాడు.

కొత్త తరహా ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ ఎమోషనల్ థ్రిల్లర్

హైదరాబాదులో షీ టీం ఏసిపిగా పనిచేస్తున్న సత్యభామ(కాజల్) దగ్గరికి ఒకరోజు హసీనా (నేహా పఠాన్) అనే ఒక అమ్మాయి వస్తుంది. తన భర్త యదు(అనిరుద్ పవిత్రన్) తనని చిత్రహింసలు పెడుతున్నాడని, అతడు ఒక శాడిస్ట్ అని చెప్తుంది. సత్యభామ బలవంతం మీద కంప్లైంట్ కూడా రాసిస్తుంది. ఒకరోజు ఆమెకి హసీనా నుంచి ఫోన్ వస్తుంది,

యదు తనని చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని హసీనా ఏడుస్తూ చెప్తుంది. అయితే సత్యభామ అక్కడికి వెళ్ళేటప్పటికి, యదు ఆమెని చంపేస్తాడు. సత్యభామ.. యదు ని షూట్ చేస్తుంది. అయితే ఎందుకు తప్పించుకుంటాడు. అంతకుముందు హసీనా తన తమ్ముడు ఇక్బాల్ కి(ప్రజ్వల్ యద్మ) తనంటే ఎంతో ప్రేమ అని, అతని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. ఇక తర్వాత యదు ని వెతికే క్రమంలో సత్యభామ చేసిన ఇన్వెస్టిగేషన్, పడిన కష్టాలు, హసీనా కుటుంబంతో ఆమెకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ వంటివి సినిమాలు ఉంటాయి. . చివరి కి ఆమె యదుని పట్టుకుందా? తర్వాత సినిమాలో ఉన్న కొంత సస్పెన్స్, కొన్ని ట్విస్టులు వంటి వాటితో సినిమా నడుస్తుంది.

మెప్పించిన స్క్రీన్ ప్లే

ఇంతకు ముందే చెప్పినట్లు ఇలాంటి సినిమాలకు సస్పెన్స్, ట్విస్టులతో పాటు స్క్రీన్ ప్లే చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. . ఈ సినిమాలో స్క్రీన్ ప్లే కొంచెం కొత్తరకంగా ఉంటూ, చాలావరకు వేగంగా పరిగెత్తి ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు కనబడినప్పటికీ, సినిమా కూడా వేగంగానే నడుస్తుంది. ఈ సినిమాలో పోలీసుల పాత్రలన్నీ బాగానే డిజైన్ చేసుకున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడిపే పద్ధతి ఇంతవరకు చాలా తక్కువ తెలుగు సినిమాల్లో కనబడింది. దర్శకుడు సుమన్ చిక్కాల, అక్కడక్కడ తడిబడినప్పటికీ, సినిమాను స్క్రీన్ ప్లే కి అనుగుణంగా నడపడంలో దాదాపు సక్సెస్ అయ్యాడు.

విరిసిన చందమామ

ఈ సినిమా గురించి విశ్లేషించాలంటే ఇది ఉమెన్ ఓరియంటెడ్ సినిమా. ఇది అవుట్ అండ్ అవుట్ కాజల్ సినిమా. ఇంతవరకు కమర్షియల్ సినిమాల్లో, హీరోలతో పాటలు పాడడం, ఎమోషనల్ సన్నివేశాలలో ఏడవడం, వంటి పనులు చేసిన కాజల్ మొదటిసారి ఒక సీరియస్ పోలీస్ పాత్రలో బాగానే చేసింది. ఇంతకు ముందే చెప్పినట్లు ఈ పాత్ర కోసం చాలా కృషి చేసినట్లు తెలుస్తుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా మెచ్చుకోదగ్గ నటననే ప్రదర్శించింది. ఈమెతోపాటు వేసిన మహిళా పోలీసులు కూడా చక్కని నటన కనపరిచారు. మొత్తంగా టీం వర్క్ బాగానే కుదిరింది. ప్రకాష్ రాజు పోలీస్ అధికారి పాత్రలో తనదైన శైలిలో నటించాడు. అతను అనుభవం ఉన్న నటుడు కాబట్టి తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు. ఇందులో సర్ప్రైజ్ ప్యాకేజీ రచయితగా, కాజల్ భర్త అమరేందర్ గా నటించిన నవీన్ చంద్ర. అతని కి కూడా ఇలాంటి పాత్ర కొత్తదే. కానీ పర్వాలేదనిపించాడు. ఇక మిగతా పాత్రధారులు పరవాలేదు.

మూడ్ ని ఎలివేట్ చేసిన సంగీతం, ఫోటోగ్రఫి

ఈ సినిమాకి శ్రీ చరణ్ పాకాల సంగీతం కూడా తోడైంది. ఇలాంటి సినిమాలకి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం కొత్తరకంగా ఉండాలి. ఈ విషయంలో సంగీత దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ కూడా, సినిమా మూడ్ ని ఎలివేట్ చేసే స్థాయిలోనే ఉంది. సినిమా నిడివి( రెండు గంటల 14 నిమిషాలు) కూడా రీజనబుల్ గానే ఉంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు తీసేయచ్చేమో అనిపించినప్పటికీ, ఎడిటింగ్ కూడా సినిమాకు సహకరించినట్లే.

ఇలాంటి సినిమాకి ఒక బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ కావాలి. . ఆ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో హర్షవర్ధన్ బాగానే చేశాడు. అతను ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఇరుక్కున్నప్పుడు, అతను నటించిన టీవీ సీరియల్ " అమృతం" టైటిల్ సాంగ్ " ఒరేయ్ ఆంజనేయులు" వినిపించడం డైరెక్టర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు నిదర్శనం.

అవును.. ఈ సినిమా చూడొచ్చు

చివరకు చెప్పాలంటే, అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్ లు, సినిమా ను, ప్రేక్షకులను కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ, కాజల్ పర్ఫామెన్స్, చాలావరకు వేగవంతమైన స్క్రీన్ ప్లే, ఈ సినిమాలు చూడదగ్గదిగా మార్చాయి. ఇది వరకు అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన ఎన్నో తెలుగు సినిమాల కంటే, ఈ సినిమా బెటరే. కుటుంబంతో సహా చూడదగ్గ సినిమాగా దీన్ని మలచడానికి డైరెక్టర్ తీసుకున్న జాగ్రత్తలు పనికి వచ్చాయి. బోల్డ్ సన్నివేశాలు, ఐటెం సాంగ్స్ లేకుండా ఈ సినిమాను నడపడం కొంచెం ఇబ్బంది అయినప్పటికీ, దర్శకుడు సుమన్ చిక్కాల, కాజల్ అగర్వాల్, శశికిరణ్ తిక్క సినిమాను చూడదగ్గదిగా చేయడంలో సక్సెస్ అయినట్లే.

నటీనటులు: కాజల్ అగర్వాల్,నవీన్ చంద్ర,ప్రకాష్ రాజ్,నాగినీడు,

హర్ష వర్ధన్,రవివర్మ, ప్రజ్వల్ యద్మ, అంకిత్ కొయ్య

దర్శకత్వం: సుమన్ చిక్కాల

స్క్రీన్ ప్లే,: సుమన్ చిక్కాల, శశి కిరణ్ తిక్క

కథ: రమేష్ యద్మ, ప్రశాంత్ రెడ్డి మోటాడూ

సంగీతం: శ్రీచరణ్ పాకాల

సినిమాటోగ్రఫీ: విష్ణు బేసి

ఎడిటర్: పీకే (కోదాటి పవన్ కళ్యాణ్)

నిర్మాతలు: శశి కిరణ్ తిక్క, బాబీ తిక్క ,శ్రీనివాస్ రావు తక్కలపెల్లి

నిర్మాణ సంస్థ: ఆరం ఆర్ట్స్

విడుదల: జూన్ 07, 2024

Read More
Next Story