రాజ‌కీయం అంతా కాకినాడ‌లోనే... ఎందుకో తెలుసా!
x

రాజ‌కీయం అంతా కాకినాడ‌లోనే... ఎందుకో తెలుసా!

మూడు రోజులుగా కాకినాడ‌లోనే ప‌వ‌న్ కల్యాణ్, మూడో తేదీన కాకినాడ రానున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్, ప‌దో తేదీన కాకినాడ చేరుకోనున్న టిడిపి అధినేత చంద్ర‌బాబు. ఎంది కత?


మహ్మద్ రెహ్మాన్


అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండటంతో రాష్ట్ర రాజ‌కీయాలు బాాగా వేడెక్కుతున్నాయి. గెలుపు బావుటా ఎగ‌ర వేసేందుకు పార్టీలు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నాయి. కొత్త సంవ‌త్స‌రంలో స‌రికొత్త ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు వేస్తున్నారు. ఇందులోబాగంగానే మూడు పార్టీలు కూడా తూర్పు సెంటు మెంటు సొమ్ముచేసుకునేందుకు పోటీపడుతున్నాయి. ఎలాగైనాతూర్పులో అదిక సీట్లు సాదిస్తే సియం పీఠం ద‌క్కుతుంద‌నే ప్ర‌గాడ విశ్వాసంతో ఉన్నాయి పార్టీలు. ఈ నేప‌థ్యంలో తాజాగా తూర్పులో నెల‌కొన్న రాజ‌కీయాల‌పై ఒక ప్ర‌త్యేక క‌థ‌నం..


తెలుగు దేశం , జ‌న‌సేన మిత్ర పక్షంగా ఏర్ప‌డ్డాక రెండు పార్టీలు ఉమ్మ‌డిగా అభ్య‌ర్దుల వేట‌లో ప‌డ్డాయి. రెండు పార్టీల నేతలు ఒక అవ‌గాహ‌న ప్రకారం గెలుపు గుర్రాల‌కు సీట్లు ఇచ్చే ప‌నిలో పడ్డారు. ఇందులో భాగంగా టికెట్లు రాని ఏ నాయకులను నొప్పించకుండా ఉండేందుకు రెండు పార్టీల నాయ‌కులు సీట్ల కోసం త్యాగాలు చేయ‌డానికి సిద్దంగా ఉండాల‌నే పిలుపును ఇచ్చారు. జిల్లా మీద పట్టుకోసం జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ ళ్యాణ్ కాస్త ముందున్నారనే చెప్పాలి.

ఆయ‌న గ‌త రెండు రోజుల నుంచి కాకినాడ‌లో మ‌కాం పెట్టారు. కాకినాడ పార్ల‌మెంటు ప‌రిధిలో 7 నియోజ‌క‌వ‌ర్గాల ఇన్చార్జిల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిదిలో అధిక సీట్లు జ‌న‌సేన పార్టీ పోటీ చేస్తుంద‌నే ప్ర‌చారం కూడా సాగుతుంది. పార్ల‌మెంటు ప‌రిధిలో మొత్తం 7 స్థానాల్లో నూ నాలుగు స్థానాల్లో జ‌న‌సేన అభ్య‌ర్దులు బ‌రిలో ఉంటార‌నే ప్ర‌చారం కూడా సాగుతుంది. ఇందులో పిఠాపురం, ప్ర‌త్తిపాడు, కాకినాడ సిటీ, కాకినాడ రూర‌ల్నుంచి పోటీ చేస్తార‌ని విశ్వ‌నీయ స‌మాచారం. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాకినాడ పార్ల‌మెంటు స్థానంపై గ‌ట్టి ప‌ట్టు ప‌ట్టారు.

ఇన్చార్జి ల నుంచి వార్డు స‌భ్యుల‌తో సైతం ఆయ‌న విడివిడిగా మాట్లాడారు. ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ప‌రిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకొ న్నారు. ఎన్నిక‌ల్లో సీట్లు వారికి ప‌రోక్షంగా బుజ్జగింపు సంకేతాలు అందించారు. భ‌విష్య‌త్తులో వారి నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా మాన‌సికంగా సిద్దం చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత‌రంగిక మాట‌ల ద్వారా పెద్దాపురం. జ‌గ్గంపేట,. తుని నియోజ‌క‌వ‌ర్గా ల్లో టిడిపి అభ్య‌ర్దులు పోటీ చేసే ప‌రిస్థితి క‌న‌ప‌డుతుంది. అక్క‌డి ఇన్చార్జిలు సీటు విష‌య‌మై త్యాగం చేయాల్సి వ‌స్తుంద‌నే ప్ర‌చారం సాగుతుంది. అంతేగాక ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న స‌మీక్ష స‌మావేశాల‌ను మ‌రో రెండు రోజులు పొడిగించారు. మ‌రింత మందితో సుదీర్గంగా చ‌ర్చించే అవ‌కాశం క‌న‌ప‌డుతుంది.

జ‌న‌సేన‌లోకి ఇద్ద‌రు అధికార పార్టీ శాస‌న స‌భ్యులు?

ఇదిలాఉండ‌గా జ‌న‌సేన‌లోకి ఇద్ద‌రు అధికార పార్టీకి చెందిన నాయ‌కులు చేరనున్నారు. జ‌గ్గంపేట‌కు చెందిన జ్యోతుల చంటిబాబు, పిఠాపురం శాస‌న స‌భ్యులు పెండెం దొర‌బాబులు పార్టీలో చేర‌నున్నారు. ఈ మేర‌కు వారు కూడా కొత్త సంవ‌త్స‌రం లోనే ఏర్పాట్లు చేసుకోనున్నారని చెబుతున్నారు.


రాంబాల రమేష్

తూర్పు గోదావరి జిల్లా లో అత్యధిక సీట్లు వస్తే కచ్చితంగా రాష్ట్రం లో గవర్నమెంట్ ఫామ్ చేస్తామనే నమ్మకం చాలా కాలం నుంచి ఉంది.. ఈ నమ్మకాన్ని అన్ని పార్టీలు నమ్ముతాయి. అందుకే మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే బాట లో పయనిస్తున్నారు, పార్టీని బలోపేతం చేసేందుకే జిల్లా నేతలతో మాట్లాడుతున్నారు అని జనసేన నేత రాంబాల రమేష్ (సర్పంచ్) తెలిపారు.

తెలుగుదేశం హడావిడి

తెలుగు దేశం విష‌యానికి వ‌స్తే వారు కూడా తూర్పు సెంటు మెంటును బ‌లంగా న‌మ్ముతున్నారు. 19 నియోజ‌వక‌వర్గాల్లో అధిక స్థానాలు సాధించిన పార్టీ రాష్రంలో అదికారంలో కి వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం కూడా ఉంది. ఇందులో భాగంగా ఇటీవ‌లే తూర్పు లో యువ‌గ‌ళం పూర్తి చేసుకొని వెళ్లిన నారాలోకేష్‌, ఈ నెల ప‌దిన మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జిల్లాకు రానున్నారు. ఆయ‌న కూడా కాకినాడ‌లో మ‌కాం పెట్టి, స‌ర్పంచ్, యంపీటీసీల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం కానున్నారు. జిల్లాలో మూడు రోజులు ఉండి నియోజ‌క‌వ‌ర్గాల వారీగా పార్టీ కేడ‌ర్ తో ఆయ‌న స‌మావశం కానున్నారు. 2019 ఎన్నిక‌ల్లో జిల్లాలో రెండు సీట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుతో క‌లుపుకొని అధిక స్థానాల్లో విజ‌య ఎగ‌ర వేసేందుకు సిద్దం అవుతున్నారు.


రెడ్డి సుబ్రహ్మణ్యం, టీడీపీ ఇంచార్జ్ రామచంద్ర పురం


తూర్పు సెంటిమెంట్ అనేది ఈ నాటిది కాదు.. పూర్వం నుంచి ఉంది.. తూర్పు గోదావరి జిల్లా తో బాటు రాష్ట్రము లో ఈశాన్య దిక్కులో జిల్లా ఉంది.. అందుకే సెంటిమెంట్ బలంగా పనిచేస్తుందని జిల్లా టిడిపి నేత రెడ్డి సుబ్రహ్మణ్య అన్నారు.

వైసిపిలో ఆందోళన

ఇక అధికార పార్టీ వైఎస్సార్ విష‌యానికి వ‌స్తే వారు కూడా తూర్పు సెంటుమెంటులో ప‌డ్డారు. ఈ నెల 3 వ‌తారీఖున ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ జిల్లాకు రానున్నారు. ఆయ‌న కూడా పార్టీ నాయ‌కుల‌కు దిశా నిర్దేశం చేయ‌నున్నారు. పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం సాగుతున్న పిఠాపురం శాస‌న స‌భ్యులు పెండెం దొర‌బాబు, ప్ర‌త్తిపాడు శాస‌న స‌భ్యులు ప‌ర్వ‌త ప్ర‌సాద్ ల‌తో ప్రత్యేకంగా మాట్లాడ‌త‌ర‌నే ప్ర‌చారం సాగుతుంది. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో 16 స్థానాల్లో వైసిపి విజ‌యం సాదించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రిన్ని స్థానాల్లో విజ‌యం సాదించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అంతేగాక రామ‌చంద్ర‌పురం నుంచి రాజ‌మండ్రి రూర‌ల్ స్థానానికి సీటు బ‌దిలీ అవ్వ‌డంతో మ‌న‌స్థాపంతో ఉన్న మంత్రి వేణు గోపాలకృష్ణను కూడా బుజ్జగిస్తారని అనుకుంటున్నారు.


హోం మంత్రి తానేటి వనిత

అయితే, తూర్పు సెంటిమెంట్ ను మా వైస్సార్సీపీ పార్టీ బలంగా నమ్ముతుందని హోం మంత్రి తానేటి వనిత వ్యాఖ్యానించారు.. ‘గత ఎన్నికల్లో మాకు అత్యధికంగా ౧౬ సీట్లు వచ్చాయి.. ఒక సీటు జనసేన, రెండు సీట్లు టీడీపీ కి వచ్చాయి.. అందుకే మేము రాష్ట్రము లో అధికారం దక్కించుకొన్నాము.. ఈ సారి కూడా అదే పంధా లో పోతున్నాము. మా అధినేత జగన్ కాకినాడ నుంచే ఎన్నికల శంఖారావమ్ పూరించునున్నారు,’ అని వనిత అన్నారు.

ఇలా తూర్పు గోదావ‌రి జిల్లాలో తాజాగా రాజకీయం రసవత్తరంగా మారింది. కొత్త సంవత్సరంలో నేతల రాకపోకలతో జిల్లా హడావిడిగా మారబోతున్నది. జిల్లాలో ప‌ట్టు సాధిస్తే రాష్ట్రమంతా గెలుపు సాధించినట్లేనని విశ్వాసం మూడు పార్టీల్లో ఉంది. అందువల్ల నేతలను తమ వైపు తిప్పుకునేందుకు మూడు పార్టీలు నానా అవ‌స్త‌లు ప‌డుతున్నాయి. భ‌విష్య‌త్తు ప‌రిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

Read More
Next Story