కమ్మ కోటలో కాపు!
x
పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎడం బాలాజీ

కమ్మ కోటలో కాపు!

ఆంధ్రప్రదేశ్లోని పర్చూరు నియోజకవర్గం వార్తల్లోకెక్కింది. ఇక్కడ కేవలం సామాజిక వర్గానికే బలం ఎక్కువ.


అక్కడ కమ్మ సామాజిక వర్గం చెప్పిందే వేదం. వారికే అక్కడి ఓటర్లు ఎప్పుడూ పట్టం కడుతున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ప్రాధాన్యతకు చెక్కు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎందుకో ముందడుగు వేయలేకపోతున్నారు.

ఒక్కసారి మినహా ప్రతిసారి అక్కడ అభ్యర్థి కమ్మ సామాజిక వర్గం వారే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యత కులం. ప్రాధాన్యత ఇదేమిటి అనుకుంటున్నారా? అవును.. అక్కడ వారిదే బలం. వారు అనుకున్నదే జరుగుతుంది. 1952 నుంచి ఇప్పటివరకు కమ్మ సామాజిక వర్గం వారే ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నారు. అటు కాంగ్రెస్ లో కానీ, ఇటు తెలుగుదేశంలో కానీ వారే గెలిచారు. అయితే మధ్యలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన గాదె వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మినహాయించి ఇక ఏ ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు కూడా అక్కడ ప్రజా ప్రతినిధులుగా గెలవలేదు.

కమ్మేతర ఓట్లపై ఇరువురు అభ్యర్థుల ఆశలు

కమ్మవారు అభ్యర్థిగా ఉంటే వారికి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. అన్ని పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు కమ్మ వారే అయితే ఎవరి బలం వాళ్లకు ఎలాగూ ఉంటుంది. పార్టీలకు అతుక్కుపోయిన వారు ఆయా పార్టీలకు ఓట్లు వేయడం సాధారణం. అయితే ఈసారి అలా కాదు కమ్మ సామాజిక వర్గం అంతా చంద్రబాబు నాయుడు వైపే ఉన్నట్టు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పర్చూరు నియోజకవర్గంలో 90 వేల వరకు కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. 70 వేల వరకు ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు ఉన్నాయి. ఇక కేవలం కాపుల ఓట్లు సుమారు 25000 పైన ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు 6వేలకు మించి లేవు. ఇతర అన్ని రకాల బీసీ కులాల ఓట్లు మిగిలినవి ఉన్నాయి. ఈ నియోజకవర్గ ఓటర్లలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు మినహా మిగిలిన సామాజిక వర్గాల వారు పూర్తిస్థాయిలో ఒకే అభ్యర్థికి మెజారిటీ ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్ల కమ్మేతర ఓట్లను ఎక్కువ ఎవరు రాబట్టుకుంటే వారు గెలుపుకు చేరువవుతారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ప్రచారంలో ఎవరికి వారే సాటి

ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గానికి చీరాలకు చెందిన కాపు సామాజిక వర్గ నాయకుడు ఎడం బాలాజీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఏలూరు సాంబశివరావు ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా మూడోసారి రంగంలోకి దిగుతున్నారు. వైఎస్ఆర్సిపి సమన్వయకర్తకు మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇదే మొదటి అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని గెలవాలనే ఆలోచనలో ఎడం బాలాజీ ఉన్నారు. ఇద్దరు కూడా ఆర్థికంగా స్థితిమంతులు ఒకరు ఎరువులు, పురుగుమందుల వ్యాపారంలో దిట్ట. మరొకరు సినిమా నిర్మాతలకు పెట్టుబడులు పెట్టడం, సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడటం వల్ల బాగా డబ్బు సమకూరింది. వీరివద్ద భారీ స్థాయిలో ఖర్చు పెట్టేందుకు డబ్బులు ఉన్నాయి. అందువల్ల ఏ ఒక్కరు కూడా ఖర్చుకు వెనుకాడే పరిస్థితిలు లేవు.

ఆమంచి తిట్లు కమ్మోరిని ఏకం చేశాయి

ఇప్పటివరకు పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జిగా ఉన్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇటీవల కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ ను దూషించారు. కులం పేరుతో కరణం వెంకటేశ్ ను తిట్టిన కారణంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారంతా ఏకమయ్యారనే విమర్శలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాకుండా వేరే సామాజిక వర్గం వారు అయితే ఓడించాలనే పట్టుదలతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు అడుగులు వేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గతంలో కమ్మ సామాజిక వర్గంలోనే పార్టీల వారీగా వర్గాలు ఉండేవి. ఇప్పుడు పార్టీలను వదిలి కులపరంగా అందరూ ఏకం కావడం విశేషం. ఆమంచి కృష్ణమోహన్ కు ముందు రామనాథం బాబు పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. ఆయనను కూడా పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. 2019లో టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు.

గొట్టిపాటి భరత్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎందుకు ఓడారు

2014లో గొట్టిపాటి భరత్, 2019లో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావులు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఏలూరు సాంబశివరావు పై ఓడిపోయారు. 2014లో భరత్ ఓడిపోవడానికి కమ్మ సామాజిక వర్గంలో వర్గ పోరే కారణం. కొంత మంది తెలుగుదేశం, మరి కొంతమంది వైయస్సార్ కాంగ్రెస్ అంటూ వర్గాలుగా విడిపోవడంతో మిగిలిన కులాలకు సంబంధించిన ఓట్లను రాబట్టుకోవడంలో భరత్ విఫలమయ్యారు. 2019లో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరిస్థితి కూడా ఇదే. అయితే ఆయన అందరితో కలగోలుపుగా ముందుకు సాగలేదనే విమర్శలు ఉన్నాయి. అలాగే ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడంలో కూడా వెనుకంజ వేసినందున ఈ పరిస్థితి ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఏలూరు సాంబశివరావు డబ్బు ఖర్చు చేయడంలో వెనుకంజ వేయలేదు. సామాజిక వర్గంలో వర్గ పోరుకు ఎదురొడ్డి నిలవడం వల్ల విజయం సాధించారని పరిశీలకులు అంటున్నారు.

వైఎస్ఆర్సిపి ప్రయోగం ఫలిస్తుందా?

ఈసారి గొట్టిపాటి భరత్ కు టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నా వైఎస్సార్సీపీ టికెట్ ఇవ్వలేదు. కమ్మేతర వర్గానికి చెందిన కాపు సామాజిక వర్గ నాయకుడు యడం బాలాజీని రంగంలోకి దించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు ఒక ప్రయోగాన్ని చేపట్టారు. కమ్మ సామాజిక వర్గంలో చీలిక తీసుకువస్తే మిగిలిన సామాజిక వర్గాల ఓట్లు సునాయాసంగా వైఎస్ఆర్సిపికి పడే అవకాశం ఉందని, ఆ మార్గంలో వైఎస్ఆర్సిపి విజయం సాధిస్తుందనే ఆశ వైఎస్ఆర్సిపి నాయకుల్లో ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో కులం ప్రాబల్యం పనిచేస్తుందా? సామాజిక అంశాలు పనిచేస్తాయా? అనేది వచ్చే ఎన్నికల్లో ఓటర్లు నిర్ణయిస్తారు.

Read More
Next Story