జగనన్న 'రాయదుర్గం తమ్ముడు' కాంగ్రెస్ లోకి జంప్ ?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరబోతున్నారు.


జగనన్న రాయదుర్గం తమ్ముడు  కాంగ్రెస్ లోకి జంప్ ?
x
రఘువీరారెడ్డికి పుష్పగుచ్చం అందజేస్తున్న రామచంద్రారెడ్డి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వీడుతున్నారు. అనంతపురం జిల్లాలో వైఎస్సార్‌సీపీకి కోలుకోలేని దెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. అనంతపురం, హిందూపురం ఎంపీల స్థానాలు మార్చారు. అక్కడ ఉన్న ఇద్దరు ఎంపీల్లో గోరంట్ల మాధవ్‌ను పీకేయగా తలారి రంగయ్యను కళ్యాణదుర్గం అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా నియమించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీచరణ్‌ను పెనుగొండ ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈ నియామకాలపై నేతలు సీఎం జగన్‌పై గుర్రుగా ఉన్నారు. కేవలం సీఎం జగన్‌ కేంద్రంగానే రాజకీయాలు చోటు చేసుకోవడంతో ఎమ్మెల్యేలకు దిక్కుతోచడం లేదు.

రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఎన్నో ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చినట్లు కొత్తల్లో చెప్పుకున్నారు. వైఎస్‌ జగన్‌ నాకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతగా ఉంటానన్నారు. ఊహించని విధంగా కాపు రామచంద్రారెడ్డికి వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ టిక్కెట్‌ లేదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసేందుకు తాడేపల్లిలోని సీఎం ఇంటికి రాగా సీఎం జగన్‌ రామచంద్రారెడ్డికి కలిసే అవకాశం ఇవ్వలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ్‌రెడ్డిలు మాట్లాడి మీకు టిక్కెట్‌ ఇవ్వడం లేదని చెప్పి పంపించారు. సీఎం క్యాంపు కార్యాలయం బయట మీడియాతో మాట్లాడుతూ తాను వైఎస్సార్‌సీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. నా భార్య, నేను వచ్చే ఎన్నికల్లో రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
జగన్‌ చెల్లెలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో తాను కూడా కాంగ్రెస్‌లో చేరితే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారు. దీంతో పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్‌ రఘువీరారెడ్డిని ఆయన నివాసంలో మంగళవారం రామచంద్రారెడ్డి కలిసారు. కాంగ్రెస్‌లో చేరేందుకు లైన్‌ క్లియర్‌ చేసుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే విధంగా చూడాలని రఘువీరాను కోరినట్లు సమాచారం.
కాపు రామచంద్రారెడ్డి రాజకీయ ప్రవేశం ఎలా జరిగిందంటే..
మొదట ఈయన గాలిజనార్థన్‌రెడ్డి మైనింగ్‌ కంపెనీలో ఉద్యోగిగా చేరి వారి ద్వారా అందులో ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగారు. బాగా డబ్బు సంపాదించిన తరువాత రాజకీయాల్లోకి వచ్చి సేవా కార్యక్రమాలు చేయాలనే భావనకు వచ్చారు. రామచంద్రారెడ్డి స్వగ్రామం కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లె. కళ్యాణదుర్గం నియోజకవర్గం ద్వారా రాజకీయ ప్రవేశం చేయాలనుకున్న కాపు రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో పేదరికంతో ఉన్న కుటుంబాల్లో వివాహాలు జరిగితే వారికి పెళ్లి ఖర్చులతో పాటు తాలిబొట్లు కూడా ఇచ్చి వివాహాలు తానే దగ్గరుండి జరిపించారు. దీంతో రామచంద్రారెడ్డికి మంచి పేరు వచ్చింది. 2010వ సంవత్సరం నుంచి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వచ్చారు. రామచంద్రారెడ్డి సేవలకు మెచ్చిన జగన్‌ తన పార్టీలో చేర్చుకున్నారు. 2019లో రాయదుర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ నేత, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులుపై గెలుపొందారు. తన భార్య భారతి స్వగ్రామం కూడా కళ్యాణదుర్గం మండలం రాతిబావివంక కావడంతో ఇరురికి స్థానికంగా మంచి పేరు వచ్చింది.
ఉన్నట్లుండి వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ జగన్‌ తిరస్కరించడంతో 2024 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. త్వరలోనే అధికారికంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు.
రాజకీయాలు చర్చించాం
రామచంద్రారెడ్డి కలిసారు. రాజకీయాలు, ఇతర విషయాలు కూడా చర్చించుకున్నాం. కాంగ్రెస్‌ పార్టీలో కాపు రామచంద్రారెడ్డి చేరుతాడా లేదా అనేది ఆయననే మీరు అడిగితే బాగుంటుంది. రామచంద్రారెడ్డి మంచి దాతృత్వం ఉన్న వ్యక్తి.
– ఎన్‌ రఘువీరారెడ్డి, పీసీసీ మాజీ చీఫ్‌.


Next Story