ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ పై కాపులు అసహనంతో ఉన్నారా? కక్కలేక మింగలేక సతమతం అవుతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్నంత ఊపు ఇప్పుడు కాపుల్లో కనిపించడం లేదని కాపు సంఘాల నేతలే చెబుతున్నారు. పవన్ కల్యాణ్ చెప్పే మాటలకు చేసే చేతలకు అసలు పొంతన ఉండడం లేదని, గ్రామీణ ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలు పడుతున్న ఇబ్బందుల్ని పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన అండతో టీడీపీ అధికారంలోకి వచ్చినా కిందిస్థాయిలో జనసేన కార్యకర్తల్ని గానీ నాయకుల్ని గానీ ఎవరూ ఖాతరు చేయడం లేదని, ఈ విషయాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కి చెబుదామన్న వినేపరిస్థితిలో ఆయన లేడని వాపోతున్నారు.
2014 మార్చి 14న పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి పవన్ కల్యాణ్ అంటే ప్రాణం ఇచ్చింది, పార్టీ జెండాను మోసింది కాపులే అయినా తమకు అసలు గుర్తింపు లేకుండా పోయిందని గుంటూరు జిల్లాకు చెందిన ఆ పార్టీ కార్యకర్త వి.రామయ్య ఆరోపించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండో అతిపెద్ద పార్టీగా మారి, పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి అయినా తమకు ఇంటా బయటా గుర్తింపు లేదన్నది కాపుల ఆవేదనగా ఉంది. మానవతావాదం, సనాతనవాదంపై దృష్టి కేంద్రీకరించడంలో తమకేమీ అభ్యంతరం లేదని, దానికి ముందు తమ వాదం, ఆవేదన వింటే బాగుంటుందని జనసేన కార్యకర్తలు కోరుతున్నారు.
2024 ఎన్నికలలో జేఎస్పీ పోటీ చేసిన మొత్తం 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లను గెలుచుకుంది. అధికార కూటమిలో భాగమైంది. ఈ గెలుపు జనసేన శ్రేణులకు ప్రత్యేకించి కాపులకు ఎంతో భరోసాను ఇచ్చింది. ప్రభుత్వ పథకాలలో తమకూ ఎంతో కొంత వాటా దక్కుతుందన్న నమ్మకం కలిగింది. ఇప్పుడా నమ్మకం సడలుతోందని పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు గుసగుసలు పోతున్నారు.
జనసైనికుల ఆవేదన ఇదీ!
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధోరణిని తప్పుబడుతున్నారు. కొందరైతే బాహాటంగానే విమర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితిని పవన్ కల్యాణ్ అసలు పట్టించుకోవడం లేదంటున్నారు. వాళ్లు చెబుతున్న విషయాలేమిటంటే..
1. పవన్ కల్యాణ్ అంగీకరించినా అంగీకరించకపోయినా జనసేన బలం, బలహీనత రెండూ కాపులే. పదవిలో ఉన్నప్పుడైనా కిందిస్థాయి కార్యకర్తలను కాపాడుకోవాలి. గ్రౌండ్ లెవెల్ లో వీళ్లని తాకితలుచుకుంటున్న వారు లేరు.
2. పవన్ కల్యాణ్ జిల్లా కార్యదర్శులను కలవడానికి కూడా ఇష్టపడడం లేదు. అధికారిక కార్యక్రమాలను మాత్రమే పట్టించుకుంటున్నారు. తెలంగాణలోగానీ ఆంధ్రలో గాని ఎవ్వరికీ అపాయింట్ మెంట్లు లేవు. సమీక్షలు లేవు.
3. పవన్ కల్యాణ్ కలవకపోయినా సామాన్య కార్యకర్తల గోడు పట్టించుకోవడానికి, వినడానికి, కిందిస్థాయిలో ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించేందుకు పార్టీలో యంత్రాంగం లేదు.
4. పవన్ కల్యాణ్ తర్వాత అంతటి స్థాయి ఉన్న నాయకుడు నాదెండ్ల మనోహర్. ఇప్పుడాయన కూడా ప్రభుత్వంలో భాగం అయ్యారు. ఆ తర్వాత నాగబాబును అనుసంధాన కర్తగా నియమించినా ఆయన్ని కలవడం అంతసులువు కాకుండా ఉంది. పట్టుమని నలుగురు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా లేరు.
5. ఎవరైనా ఏదైనా సమస్య చెబితే "జనసేన పార్టీ స్ట్రక్చర్ ఇలాగే ఉంటుంది. ఇష్టమైన వాళ్లు ఉండవచ్చు, బయటికి వెళ్లేవారు వెళ్లవచ్చు" అన్నది పార్టీ అధినాయకుని మాటగా ఉంటోంది. నాకు నచ్చిన వాళ్లే ఉంటారు, పోయే వాళ్లు పోతారు అనే ధోరణి సమంజసమా?.
6."సమస్యలు చెప్పవద్దు, మేము చెప్పిందే చేయండి" అనే ధోరణితో కార్యకర్తలు విసిగిపోతున్నారు. ఎవరైనా గట్టిగా అడిగితే "మీరు పార్టీకి ఏమి చేశారు?" అని పార్టీ పెద్దలు ఎదురుదాడి చేస్తుంటారన్నది ద్వితీయశ్రేణి నాయకుల ఆరోపణ.
7. పార్టీ అధినాయకుడు నీతి నిజాయితీతో పని చేస్తున్నారని, అందరూ ఆయన్ను ఫాలో కావాల్సిందేనని చెబుతున్న తీరును కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. "ప్రపంచంలో వీళ్లొక్కళ్లే నిజాయితీ పరులా మిగతా వాళ్లు కాదా" అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
8. అధికారంలో చేరిన తర్వాత చిన్నా చితక కాంట్రాక్టు పనులు దక్కుతాయనుకుంటే అవి కూడా టీడీపీ వాళ్లకే తప్ప జనసేన వాళ్లకి రావడం లేదు. పార్టీ కోసం కొన్నేళ్లుగా సొంతడబ్బులు ఖర్చు చేసుకున్నామని, ఇప్పుడైనా ఏవైనా ఆదాయం వచ్చే మార్గాలు ఉంటాయనుకుంటే వాటిని కూడా టీడీపీ వాళ్లే దక్కించుకుంటున్నారని కార్యకర్తలు వాపోతున్నారు.
10. పార్టీ నిర్మాణంపై దృష్టి సారించే పరిస్థితి లేదు. ఫలితంగా పీఆర్పీ నుంచి జనసేనలోకి వచ్చిన వాళ్లందరూ ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. పాత వాళ్లను కాపాడుకోవడం లేదు. కొత్త వాళ్లను రిక్రూట్ చేయడం లేదు. సాలిడ్ స్ట్రక్చర్ లేదు.
11. జగన్ మీద వ్యతిరేకతతో ఓట్లేసిన వాళ్లు ప్రతిసారీ వేస్తారని ఆశించకూడదని, పార్టీని బలోపేతం చేసుకోకుండా ఎలాగన్నది మరికొందరి ఆవేదన.
12. సనాతన ధర్మాలు, ఆదర్శవాదాలు చెప్పడం వరకు బాగానే ఉంటాయని, కిందిస్థాయి నిజాలు వేరుగా ఉంటాయని, పవన్ కల్యాణ్ కి అంత బలమే ఉంటే గతంలో మాదిరే ఎక్కడో పోటీ చేయకుండా కాపులు ఎక్కువగా ఉన్న పిఠాపురంలో ఎందుకు పోటీ చేయాల్సివచ్చింది? అనే వాళ్లూ లేకపోలేదు.
13. అధికారంలోకి వచ్చాక పదవులపై మోజు పెంచుకున్న జనసైనికులు నిరుత్సాహానికి గురవుతున్నారు. తాము కూడా జనసేనకి పని చేశామనే పేరిట కాపులకు దక్కాల్సిన పనులను కూడా టీడీపీ వాళ్లే తీసుకుంటున్నారు.
14. నామినేటెడ్ పదవుల్లోనైనా సమన్యాయం జరుగుతుందన్న నమ్మకం కలగడం లేదని, "నన్ను నమ్మండి" అని పదేపదే పవన్ చెబుతున్నా... ఎంతకాలం నమ్మాలి అంటున్నారు.
15. ఇసుక, మద్యం కాంట్రాక్టుల్లోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ న్యాయం జరగడం లేదన్నది కాపు ప్రముఖుల వాదన.
16. పవన్ కల్యాణ్ భుజం మీద తుపాకి పెట్టి టీడీపీ తన పనులు కానిచ్చుకుంటున్నా పట్టింపు లేకపోవడాన్ని ఆక్షేపిస్తున్నారు.
మొత్తం మీద కాపుల ఆక్రోశం తారాస్థాయిలో ఉంది. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా తమను పట్టించుకోవడం లేదన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. "కాపుల రిజర్వేషన్ల విషయం తెరవెనక్కి పోయింది. పదవులు లేవు, ఆదాయం వచ్చే పనులు లేవు, కింది స్థాయి కార్యకర్తలకు గుర్తింపు లేదు. అర్హత కలిగిన వారికి తగిన పనులు దక్కడం లేదు. ఇసుక కాంట్రాక్టులు వాళ్లకే. మద్యం కాంట్రాక్టులూ వాళ్లకే. చివరకు ఏదైనా ఎన్నికల్లో పోటీ చేయాలని ఊబలాటపడే కార్యకర్తల్ని నిరుత్సాహపరుస్తారు. మీటింగులకు పోవడం, జై కొట్టడం తప్ప కార్యకర్తకర్తలకు ప్రత్యేకించి కాపులకు మిగిలిందేముందీ. త్యాగం చేయడమే అలవాటుగా మారింది కాపులకు" అన్నారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాపు ప్రముఖుడు రామకృష్ణ.
కాపుల ఆర్ధిక పరిస్థితి దిగజారుతోందని, విద్య, ఉపాధి రంగాలలో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. సంపద పెంచడమే లక్ష్యమన్న ప్రభుత్వంలో భాగమైన పవన్ కల్యాణ్ తమ సొంత వర్గానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పడిపోయారన్నది కాపు సంఘాల వాదనగా ఉంది. గత ప్రభుత్వంలో వచ్చిన అమ్మఒడి లేదు, కాపు నేస్తం వంటి పథకాలు కూడా దక్కని స్థితిలో కాపులున్నారనేది వాస్తవం. మొత్తం మీద కాపుల పరిస్థితి... "కొడదామంటే కొడుకు పెళ్లాం, తిడదామంటే అక్క కూతురన్న" సామెతగా తయారైంది.