కర్ణాటకలో పెట్టుబడులపైనే రాజకీయం.. సాక్ష్యాలు చూపుతామన్న కాంగ్రెస్
x

కర్ణాటకలో పెట్టుబడులపైనే రాజకీయం.. సాక్ష్యాలు చూపుతామన్న కాంగ్రెస్

కర్ణాటక రాజకీయాలు ప్రస్తుతం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల చుట్టూనే ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ కీలక నేత, డిప్యూటీ సీఎం, బీజేపీ కర్ణాటక చీఫ్..


కర్ణాటక రాజకీయాలు ప్రస్తుతం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల చుట్టూనే ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఇదే అంశంపై కాంగ్రెస్ కీలక నేత, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బీజేపీ కర్ణాటక చీఫ్ బీవై విజయేంద్ర మధ్య భారీగా మాటల యుద్ధం కూడా జరుగుతోంది. రాష్ట్రంలోని పెట్టుబడుల స్థితిగతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేరస్తున్నాయంటూ డీకే శివకుమార్ మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే తమ ప్రభుత్వం బీజేపీ లేనిపోని అభాండాలు వేస్తోందని, ప్రజలు ఆ అబద్దాలను పట్టించుకోవద్దని శివకుమార్ కోరారు.

పొరుగు రాష్ట్రం తమిళనాడులో గూగుల్ కంపెనీ మొబైల్ ఫోన్లు, డ్రోన్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించనుందన్న వార్తపై విజయేంద్ర స్పందిస్తూ.. కర్ణాటక రాష్ట్రం సత్తువలేని, నిద్రిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకోవడం వల్ల ఎదురయ్యే పరిణామాలను తీవ్రంగా ఎదుర్కొంటుందన్న వ్యాఖ్యలకు బదులుగా డీకే శివకుమార్ ఘాటుగా బదులిచ్చారు.

‘‘కర్ణాటకలో జరుగుతున్న పెట్టుబడులపై బీజేపీ తప్పుడు సమాచారాన్ని ప్రచారాం చేస్తోంది. అసత్యాలను ప్రచారం చేస్తున్నందుకు వాళ్లు సిగ్గు పడాలి. ఒక్కసారి ఎన్నికలు పూర్తయితే వాళ్ల వ్యాఖ్యలన్నింటికీ సాక్ష్యాధారాలతో నిరూపిస్తాం. అపవాదులు మోపే ముందు బీజేపీ ఒకసారి నిజానిజాలు తెలుసుకుంటే మంచిది’’ అని డీకే హితవు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయని, బీజేపీ చెత్త పాలన వల్ల దేశం నుంచి లక్షల మంది వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు విదేశాలకు తరలివెళ్లిపోయారని ఆయన ఎద్దేవా చేశారు.

‘‘మా పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ మంత్రి ఎంబీ పాటిల్ పనితీరు అద్భుతంగా ఉంది. కర్ణాటక రాష్ట్రం అనేది అభివృద్ధి, పారదర్శకత, శాంతికి మారుపేరు లాంటిదని దేశమంతా ఒప్పుకుంటుంది. ప్రపంచమంతా ప్రస్తుతం కర్ణాటక, బెంగళూరువైపే చూస్తున్నాయి. కర్ణాటక, బెంగలూరును స్ఫూర్తిగా కూడా ప్రపంచం భావిస్తోంది’’అని డిప్యూటీ సీఎం వివరించారు.

అసలు విజయేంద్ర ఏమన్నారు

తమిళనాడులో గూగుల్ ఓ ప్రత్యేక మొబైల్స్, డ్రోన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందన్న అంశంపై బీజేపీ కర్ణాటక చీఫ్ విజయేంద్ర ఘాటుగా స్పందించారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నందుకు కర్ణాటక తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దిశానిర్దేశం లేకుండా ఎటో వెళ్తోంది. కాంగ్రెస్.. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం వైపు నడిపిస్తోంది. అందుకు వారి చేతకాని పాలన, తప్పుడు ప్రాధాన్యతలే కారణం’’అని ఎక్స్(ట్వీట్) చేశారు.

‘‘దేశానికి అనేక పెట్టబడులు తీసుకురావడంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయింది. కానీ కర్ణాటకను పెట్టుబడులు పెట్టడానికి ఒక అద్భుతమైన ప్రాంతంగా చూపించడంలో రాష్ట్రంలోని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పెట్టుబడిదారుల కాన్ఫిడెన్స్‌ను వీరి తప్పుడు ప్రాధాన్యతలు దెబ్బతీశాయి’’ అని అన్నారు.

‘‘తమిళనాడులో డీఎంకేతో ఉన్న ఒప్పందం కోసం రాష్ట్రానికి రావాల్సిన కావేరీ నదీ జలాల వాటాను వదులుకుని కర్నాటక రైతులను దుర్బర పరిస్థితుల్లోకి నెట్టిన ప్రభుత్వం కూడా కాంగ్రెస్‌దే. ఇప్పుడు మిలియన్ డాలర్ల పెట్టుబడుల విషయంలో కూడా కాంగ్రెస్ అదే ట్రెండ్‌ను కొనసాగించడం చూస్తే పెద్దగా ఆశ్చర్యం లేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులన్నీ కూడా వేరే ఏ రాష్ట్రానికి కాకుండా తమిళనాడుకే తరలుతున్నాయని విమర్శలు గుప్పించారు.

Read More
Next Story