రాజకీయాలకి కేశినేని నాని గుడ్ బై... అధికారిక ప్రకటన
x

రాజకీయాలకి కేశినేని నాని గుడ్ బై... అధికారిక ప్రకటన

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు కేశినేని నాని ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ఒక పోస్ట్ పెట్టారు.


సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు కేశినేని నాని ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ఒక పోస్ట్ పెట్టారు. "జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నా రాజకీయ ప్రయాణానికి స్వస్తి పలుకుతున్నాను. రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపంగా భావిస్తున్నాను. విజయవాడ ప్రజల స్థైర్యం, దృఢసంకల్పం నాకు స్ఫూర్తినిచ్చాయి. వారి తిరుగులేని మద్దతుకు నేను ప్రగాఢ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.

"నేను రాజకీయ రంగానికి దూరంగా ఉన్నా, విజయవాడపై నా నిబద్ధత బలంగానే ఉంది. విజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగిన విధంగా మద్దతు ఇస్తూనే ఉంటాను. నా రాజకీయ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నో జ్ఞాపకాలు, వెలకట్టలేని అనుభవాలతో నా తదుపరి జర్నీ మొదలుపెడుతున్నాను. విజయవాడ అభివృద్ధి, శ్రేయస్సు కోసం పాటుపడనున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు. విజయవాడ ప్రజలకు పదేళ్లపాటు సేవ చేసే అవకాశాన్ని కల్పించినందుకు మరోసారి వారికి కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ చేశారు.

కాగా, కేశినేని నాని మొదటగా 2008 అక్టోబరు 26న ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. అందులో మూడు నెలలు మాత్రమే పని చేశాడు. 2009 లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. 2014 సాధారణ ఎన్నికలలో విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరుపున పార్లమెంటు సభ్యునిగా పోటీచేసి గెలుపొందాడు. 2019 సాధారణ ఎన్నికలలో తిరిగి అదే నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. తన తమ్ముడు కేశినేని చిన్ని విజయవాడ పార్లమెంటు పరిధిలో టీడీపీలో కీలకంగా వ్యవహరించడం నచ్చకపోవడంతో 2024 జనవరి 10న టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. అనంతరం వైసీపీ లో చేరి విజయవాడ ఎంపీగా పోటీ చేసి టీడీపీ తరపున పోటీ చేసిన తమ్ముడి చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని డిసైడ్ చేసుకున్నట్టు ప్రకటించారు.

Read More
Next Story