జగన్ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఐడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.


గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జరిగిన చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసుతో పాటు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసుపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు కేసులను సీఐడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులు స్థానిక పోలీసుల పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి పోలీస్టేషన్‌ల పరిధిలో ఈ కేసులు విచారణ జరుగుతోంది. అయితే తాజాగా ఈ కేసులను సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక పోలీసులను పక్కన పెట్టి సీఐడీకి ఈ కేసులను బదిలీ చేయడంపై ఆంతర్యం ఏంటనే దానిపై పలువురు చర్చించుకుంటున్నారు. సీఐడీ అయితే ప్రభుత్వం చెప్పినట్లు చేస్తుందనే ఉద్దేశంతోనే ఈ కేసులను సీఐడీకి బదిలీ చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసుల ఫైళ్లను సీఐడీకి అప్పగించాల్సి ఉంటుంది. దీంతో కేసులకు సంబంధించిన ఫైళ్లను మంగళగిరి డీఎస్పీ సోమవారం సీఐడీకి అందజేయనున్నారు.

జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి జరిగింది. వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్, తన అనుచరులతో కలిసి దాడి చేశారు. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. జోగి రమేష్‌కు నోటీసులు ఇవ్వడంతో పాటు విచారణకు కూడా పిలిపించారు. అలాగే మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై కూడా దాడి జరిగింది. 2021 అక్టోబరు 19న వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన శ్రేణులు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘటనలో టీడీపీ నేత దొరబాబుతో పాటు మరో ముగ్గురు కారాలయ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.వైఎస్‌ఆర్‌సీపీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అనుచరులు దాడికి పాల్పడ్డారిని, ఈ దాడి వెనుక వీరి హస్తముందనే ఆరోపణలు ఉన్నాయి. తలశిల రఘురాం, సజ్జల రామకృష్ణారెడ్డి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ మేరకు వీరిపై కేసులు కూడా నమోదు చేశారు. నందిగం సురేష్‌కు 14 రోజుల పాటు రిమాండ్‌ కూడా విధించారు. అయితే విచారణ వేగవంతం చేయడానికే ఈ కేసులను ప్రభుత్వం సీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో వీటిపైన కేసులు నమోదు చేసినా అడుగులు ముందుకు పడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీటిని తెరపైకి తెచ్చింది.
Next Story