కిల్లీ‌ కృపారాణి రాజీనామా బాట, జగన్ కి శాపనార్ధాల పాట
x
Source: Twitter

కిల్లీ‌ కృపారాణి రాజీనామా బాట, జగన్ కి శాపనార్ధాల పాట

వైసీపీ పార్టీకి కేంద్ర మాజీ మంత్రి కిల్లీ కృపారాణి రాజీనామా చేశారు. తనకు పార్టీలో జరిగిన అవమానం తట్టుకోలేకే పార్టీ వీడుతున్నానని కన్నీరు పెట్టుకున్నారు.


ఎన్నికల ముంగిట వైసీపీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కిల్లీ కృపారాణి.. పార్టీకి రాజీనామా చేశారు. కొంతకాలంగా ప్రాధాన్యం తగ్గిపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె లేఖలో రాశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి పంపారు. కిల్లీ కృపారాణి.. వైసీపీపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

జగన్‌ను అందుకే నమ్మా
తన రాజీనామాపై కిల్లీ కృపారాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలా జరుగుతుందని తాను ఎన్నడూ ఊహించలేదన్నారు. ‘‘ఇలాంటి రోజు అనేది ఒకటి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కేంద్రమంత్రి స్థాయికి ఎదిగాను. కానీ వైసీపీలో చేరిన తర్వాత అంతా మారిపోయింది. పార్టీ తరపున టికెట్ ఇస్తామని 2019లో విజయసాయి రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఇవ్వలేదు. అప్పుడు కూడా బాధపడలేదు. సీఎం జగన్.. నాతో చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. జగన్‌ను సొంత తమ్ముడిలా భావించాను. తమ్ముడు సీఎంగా ఉన్నాడు.. ఈ అక్కను ఆదుకుంటాడని అనుకున్నాను. కానీ రాజకీయాల్లో పదవులు, గౌరవాలే మాట్లాడతాయి తప్ప అప్యాయతలు మాట్లాడవని అర్థమైంది. నా పెద్దన్న కొడుకు కాబట్టి సీఎం జగన్‌ను నమ్మాను. పార్టీ అధ్యక్షురాలి పదవి నాకు ఎందుకు ఇచ్చారో? ఎందుకు తీసేశారో? కారణలేంటో తెలియదు. కొంతకాలంగా పార్టీలో ప్రాధాన్యత భారీగా తగ్గింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానను’’అని తన రాజీనమాపై మాట్లాడుతూ ఆమె వెల్లడించారు.
నన్ను అవమానించారు
వైసీపీ పార్టీ కోసం ఐదున్నరేళ్లుగా ఒక కార్యకర్తలా పని చేశానని చెప్పారు కిల్లీ కృపారాణి. సీఎం జగన్‌ను నమ్మి పార్టీలో చేరితే తనను పార్టీలో తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ‘‘పార్టీలో స్థానం, పదవి లేవన్న విషయాన్ని భరించలేకపోయా. నా వెనకున్న వారికి ఏం చేయలేకపోతున్నానన్న బాధతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తమ్ముడు జగన్ పార్టీలో చేరాను. కానీ ఇక్కడ నాకే ఏం చేసుకోలేక పోయాను. వైసీపీలో ఉండాలి అంటే తిట్టడం, దుమ్మెత్తి పోయడం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం రావాలా? ఈ నయవంచనకు ఏం పేరు పెట్టాలి.. నాకు పదవి దక్కలేదని కాదు. దీనిని ఏపీలోని ప్రజలు, విద్యావంతులైన మహిళలు గుర్తించాలి. వైసీపీలో జరిగిన అవమానాలను తట్టుకోలేక పోయాను. అందుకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నా. రానున్న ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తా. అన్ని పార్టీలు నన్ను ఆహ్వానిస్తున్నాయి’’’’అని చెప్పారు కృపారాణి.
కాంగ్రెస్‌వైపు కృపారాణి చూపు
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసిన కిల్లీ కృపారాణి.. మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ అంశంపై కాంగ్రెస్‌తో చర్చలు జరిగాయని, ఆమె చేరికను పార్టీ ఆహ్వానిస్తుందని కాంగ్రెస్ వర్గాలు తెలపడంతో కండువా మార్చడానికి కృపారాణి సిద్దమయ్యారని తెలుస్తోంది. అయితే అతి త్వరలోనే ఆమె తన భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటన చేస్తారని ఆమె అనుచర వర్గం తెలిపింది. ‘‘రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సమీకరణాలు తారుమారయ్యాయి. కృపారాణికి రాజకీయ పరంగా తగిన ప్రాధాన్యం దక్కలేదు. రాజ్యసభ ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఆమె టికెట్ ఆశించినా.. వైసీపీ అధిష్టానం మాత్రం ఆమెకు అవకాశం కల్పించలేదు. ఆఖరికి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కావాలనే ఆమెను పక్కన బెట్టారు. పార్టీలో జరుగుతున్న అవమానాన్ని తట్టుకోలేకే ఆమె పార్టీ మారుతున్నారు’’అని కృపారాణి అనుచర వర్గం తెలిపింది.
జగన్‌కు ఎదురుదెబ్బే
కిల్లీ కృపారాణి.. కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందన్న అంశంపై రాజకీయ విశ్లేషకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె నిజంగానే కాంగ్రెస్ కండువా కప్పుకుంటే అది సీఎం జగన్‌కు భారీ ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జగన్‌కు వ్యతిరేకంగా షర్మిల, సునీత రెడ్డి తీవ్రంగా విమర్శలు సంధిస్తున్నారు. వారితో కృపారాణి కూడా చేరితే ప్రజల్లో కూడా జగన్‌పై తీవ్ర వ్యతిరేకత వస్తుందని, అది ఎన్నికల్లో జగన్‌కు ఎదురుదెబ్బగా మారొచ్చని వారు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం జగన్‌కు ఇంటిపోరు పంటికింద రాయిగా మారిందని, కాబట్టి ఇకనైనా కుటుంబీకుల విషయంలో జగన్ ఆచితూచి అడుగు వేయాలంటూ విశ్లేషకులు హితవు పలుకుతున్నారు.


Read More
Next Story