రాజు గారి దారెటు..!

రఘురామకృష్ణంరాజు. ఈపేరు ఐదేళ్లుగా రాష్ట్రంలో వినని వారు లేరు. నర్సాపురం పార్లమెంట్‌ అభ్యర్థిగా గెలిచిన రోజు నుంచి సొంతపార్టీపైనే పోరాటం చేసి అలిసిపోయారు.


రాజు గారి దారెటు..!
x
Raghurama Krishnamraju, MP

జి. విజయ కుమార్

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నర్సాపురం పార్లమెంట్‌ నుంచి గెలుపొంది, ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మాటకు ముందు ఒంటి కాలిపై లేచే సిట్టింగ్‌ ఎంపి రఘురామ కృష్ణమరాజుకు ఈ సారి టికెట్‌ దక్కక పోవడం రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నుంచి కానీ బిజెపీ నుంచి కానీ తనకు సీటు దక్కుతుందని, తిరిగి నర్సాపురం పార్లమెంట్‌ నుంచి పోటీ చేస్తానని చెబుతూ వచ్చిన రఘురామకృష్ణం రాజుకు ఆ పార్టీలు మొండి చేయి చూపడంతో ఆ షాక్‌ నుంచి ఆయన ఇంకా తేరుకో లేదని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు.
బిజెపీ ఆదివారం ప్రకటించిన ఆరు పార్లమెంట్‌ స్థానాల అభ్యర్థుల జాబితాలో కే రఘురామకృష్ణంరాజుకు సీటు దక్క లేదు. నరసాపురం పార్లమెంట్‌ టెకెట్‌ను బిజెపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేటాయించింది. రాజమండ్రి స్థానాన్ని బిజెపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి, రాజంపేట సీటును మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి, అరకు పార్లమెంట్‌ స్థానాన్ని గీతకు, అనకాపల్లి ఎంపీ సీటును సీఎం రమేష్‌కు, తిరుపతి ఎంపి సీటును వరప్రసాద్‌కు కేటాయించినట్లు పేర్లను ప్రకటించింది.
వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌తోనే రఘురామకృష్ణంరాజు రాజకీయ ప్రయాణం
రఘురామకృష్ణంరాజు రాజకీయ ప్రయాణం వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌తోనే ప్రారంభమైంది. 2014లో ఆయనకు సీటు దక్క లేదు. దీంతో బిజెపీలో చేరారు. 2018లో బిజెపీ నుంచి టీడీపీలో చేరారు. మళ్లీ వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌లోకి వచ్చారు. 2019 మార్చిలో ఆయన వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. ఆ ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్‌ సీటు దక్కించుకున్నారు. టీడీపీ అభ్యర్థి వెంకట శివరామరాజుపై దాదాపు 31వేలపైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గెలిచిన తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పుదామనుకున్నారు. కానీ సీఎం జగన్‌ ఆయన ఆటలను సాగనీలేదు. దీంతో సీఎం జగన్‌పైన, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపైన కక్ష కట్టారు. ఒంటి కాలు మీద లేవడం ప్రారంభించారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖలు చేశారనే ఆరోపణలపై 2021లో ఆయనను సీఐడి పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పైనా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపైన కోర్టుల్లో కేసులు వేశారు.
చాలంజ్‌ ఏమైంది..
ఎట్టి పరిస్థితుల్లోను రానున్న ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచి నా సత్తా ఏమిటో చూపిస్తానని పలుమార్లు చాలంజ్‌ విసిరారు. అది కాస్తా ఇప్పుడు తుస్సుమనింది. ఏ పార్టీ కూడా టికెట్‌ ఇవ్వ లేదు. దగ్గరి రానివ్వలేదు. ఒక వేళ దగ్గరకు చేరదీస్తే వైసీపీలో చేసిన పనే తమపైన చేస్తారేమోనని భయం. ఏ పార్టీ సీటిచ్చినా ఇవ్వక పోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దామంటే జనం తిరస్కరిస్తారేమోనన్న అనుమానం. ఎందుకంటే గెలిచింది మొదలు నరసాపురం పార్లమెంట్‌ నియోజక వర్గంలో ప్రజల వద్దకు వెళ్లి కలిసి మాట్లాడిన సందర్బం లేదు. అటువంటప్పుడు స్వంత్ర అతభ్యర్థిగా కోట్లు ఖర్చు పెట్టుకొని రంగంలోకి దిగడం సరైంది కదేమోనని ఆయన సన్నిహితులు సూచించనట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణంరాజు రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందా. లేదా ప్రశ్నించే వారిగా అడుగులు వేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.
Next Story