ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాసరావు మంచి మెజారిటీతో గెలిచారు. అమరావతి ప్రాంత రైతులకు తప్ప ఆయన మిగిలిన వారికి పెద్దగా తెలియదు. జనంతో పెద్దగా పరిచయాలు కూడా లేవు. ఉన్నత చదువు చదువుకున్నారు. దళిత సామాజిక వర్గం నుంచి ఉన్నత చదువులతో పలువురి మన్ననలు పొందిన వ్యక్తి. ఆయన స్వగ్రామం అమరావతి పరిధిలోని తాడికొండ. 8 తరగతి వరకు తాడికొండలోనే చదువుకున్నారు. ఇంటర్ పూర్తయిన తరువా ఉన్నత చదువులకు విశాఖపట్నం వెళ్లి అక్కడి ఆంధ్రా యూనివర్సిటీలో చేరి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పిహెచ్‌డీ చేశారు. జర్నలిజం మాస్ కమ్యునికేషన్ పూర్తి చేశారు.
లెక్చరర్ గా ఉద్యోగంలో...
అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత హైదరాబాద్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ మేనేజింగ్ హెడ్‌గా పనిచేశారు. అనంతరం ఉద్యోగాన్ని వదిలి సొంతంగా డాక్టర్ కెఎస్ రావ్ ఐఏఎస్ అకాడమీని 2001లో స్థాపించారు. అక్కడ సివిల్స్ వారికే కాకుండా గ్రూప్స్ రాసే వారికి కూడా కోచింగ్ ఇచ్చారు. అనేక పుస్తకాలు రాశారు. సమకాలీన అంశాలపై వ్యాసాలు రాశారు. దళిత సమస్యలపై అధ్యయనాలు చేశారు. తాను దళిత కుటుంబంలో పుట్టినందున తనను సమాజం గౌరవించాలంటే చదువు ఒక్కటే ఏకైక మార్గమని నమ్మిన వ్యక్తి కొలికపూడి శ్రీనివాసరావు.
రాజకీయ ప్రవేశం ఆలోచనతో పాదయాత్ర
ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత పరిణామాలను బాగా గమనిస్తూ వచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఆయన మనస్సును కష్టపెట్టాయి. విభజన అనంతరం ఐదేళ్ల కాలం తెలుగుదేశం ప్రభుత్వం, అనంతరం ఐదేళ్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పరిపాలించినా తగిన అభివృద్ధిని సాధించడంలో వెనుబడ్డాయనే ఆవేదన ఆయనలో ఉంది. తాను కూడా రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. అమరాతి ప్రాంతంలో ఉన్న తాడికొండ తన స్వగ్రామం కావడంతో ఆ ప్రాంతం నుంచే రాజకీయాలు నడపాలని, తాడికొండ ఎస్సీ రిజర్వుడు కావడం వల్ల అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అమరావతిని పరిరక్షించుకునేందుకు ప్రజల దృష్టిని ఆకర్షించాలనుకున్న కొలికపూడి ఏకంగా హైదరాబాద్ నుంచి అమరావతిలోని వెంకటపాలెం సమీపంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు పాదయాత్ర చేశారు. సుమారు 300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సంచలనం సృష్టించారు.
అమరావతి రైతు ఉద్యమంలోకి..
అమరావతి రైతులు తమ భూములు రాజధానికోసం ఇచ్చి చాలా బాధలు పడుతున్నారని, వారి బాధల్లో భాగస్వామి అవ్వాలనుకున్న కొలికపూడి నేరుగా వచ్చి అమరావతి రైతు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆయన మాటతీరు, పోరాట పటిమను చూసిన రైతులు అమరావతి ఉద్యమానికి అండగా ఉంటాడని అమరావతి పరిరక్షణ సమితికి అధ్యక్షునిగా ఎన్నకున్నారు. కొంతకాలం అందులో పనిచేసి అందులోనూ ఇమడలేక సొంతగా అమరాతి ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి పేరుతో మరో ఉద్యమానికి తెరలేపారు. దానికి ఆయన కన్వీనర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన దళిత పారిశ్రామిక రంగానికి జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారు.
వివాదాలకు కేంద్ర బిందువు
కొలికపూడి ఎంతగా చదువుకున్నారో, దళిత సమస్యలపై, ఇతర సమస్యలపై ఏ స్థాయిలో స్పందించారో అదే స్థాయిలో దుడుకు స్వభావం కూడా ఉందని నిరూపించారు. 2020లో కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని దర్శకులు రామ్‌గోపాల్ వర్మ ఒక సినిమా తీశారు. దీనిపై అప్పట్లో ఒక టీవీ డిబేట్‌లో మాట్లాడుతూ రామ్‌గోపాల్ వర్మ తల తెచ్చిన వారికి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించి సంచలనాకు తెరతీసారు. ఆ తరువాత 2021లో మరో టీవీ డిబేట్‌లో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రులపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసిన బిజెపి నేత విష్ణువర్థన్ రెడ్డిపై చెప్పు విసిరి మరో వివాదానికి కారకుడయ్యారు. అమరావతి ఉద్యమం సమయంలో అమరావతిలో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ వారు చేసిన ఆరోపణలకు సమాధానం ఇస్తూ అన్నీ లీగల్‌గానే ఉన్నాయని, తాను ఐఏఎస్ అకాడమిని అమరావతిలో స్థాపించేందుకు భూమి కొన్నానని సమాధానం ఇచ్చారు. ఇలా ఎన్నో వివాదాలు ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీలో ఎలా చేరగలిగారు?
కొలికపూడి శ్రీనివాసరావు చేసిన ఉద్యమాలు, మాట తీరు, పోరాట పటిమను గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. 2024 జనవరి 27న తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ తాడికొండ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అప్పటికే అక్కడ శ్రావణ్‌కుమార్ ఎంతో సీనియర్ నాయకుడు కావడం, పలు మార్లు అక్కడి నుంచి గెలవడంతో తిరిగి ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించిన బాబు తిరువూరు టిక్కెట్ కొలికపూడికి ఇచ్చేందుకు నిర్ణయించారు. అప్పటి వరకు తిరువూరులో టీడీపీలో ఉన్న స్వామిదాస్ వైఎస్సార్‌సీపీలో చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరువూరు టిక్కెట్ ‘బి’ఫారం అందుకున్న కొలికపూడి మొదటిసారిగా తిరువూరు రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఒకరు చెప్పేది వినేకంటే తనకు తాను అనుకున్నది చేయడంలో ముందుంటారు. ఆ రాజకీయాలు స్థానికులకు నచ్చలేదు. అయితే చంద్రబాబు సీటు ఇచ్చారు కాబట్టి కొలికపూడిని ఆహ్వానించక తప్పలేదు. నియోజకవర్గంలో కమ్మ సామిజిక వర్గంతో పాటు బీసీ వర్గాల వారు కూడా ఎక్కువగానే ఉంటారు. కొలికపూడి పోకడ స్థానికులకు నచ్చలేదు. అయితే జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కొలికపూడికి కలిసొచ్చింది. ఎమ్మెల్యే అయ్యారు.
ఎమ్మెల్యేగా వివాదాల్లో...
తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన జూన్ నెలలో ఎ కొండూరు వైఎస్సార్‌సీపీ ఎంపీపీ నాగలక్ష్మికి చెందిన ఒక షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రొక్లయిన్‌తో కొంత భాగం కూల్చి వేయించారు. రోడ్డును ఆక్రమించి కట్టారనే ఆరోపణతో ప్రొక్లైన్‌ను తెచ్చి కూల్చడంతో ఎంపీపీ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చెప్పినా వినలేదు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఎ కొండూరు మండలంలోని రెవెన్యూ, ఫారెస్ట్ భూముల్లో ఇసుక, గ్రావెల్ తవ్వించి అనుచరులతో అమ్ముకుంటున్నాడని ఓ విలేకరి వార్త రాశాడు. దీంతో ఆ విలేకరిని రోడ్డుపైకి పిలిపించి రేయ్.. నేంటే నీకు ఇంకా తెలియదు. ఇసుక, మట్టి తవ్వుకుంటే నీకేంట్రా బాధ... అంటూ గుడ్డలు ఊడదీసి కొడతానని బెదిరించారు. గ్రామస్తులందరి సమక్షంలో ఈ విధంగా మాట్లాడటం కాస్త భయాన్ని సృష్టించింది.
అక్కడే మాట్లాడుతూ నియోజకవర్గంలోని చిట్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుపై ఎమ్మెల్యే కొలికపూడి ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుడ్డలు ఊడదీసి కొడితే ఆనాకొడుక్కు అడ్డం వచ్చేవాడెవరు.. అంటూ వ్యాఖ్యానించారు. ఆ గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని ఎమ్మెల్యే ఆరోపణ. ఆయన సలహా మేరకే పేకాట ఆడిస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి సర్పంచ్ శ్రీనివాసరావు చెప్పడటం విశేషం. అందులో వాటా ఇవ్వలేదని చంపేస్తానని బెదిరించినట్లు సర్పంచ్ తెలిపారు. భర్తను బెదిరించడం చూసిన తుమ్మలపల్లి శ్రీనివాసరావు భార్య నిద్రమాత్రలు మింగి ఆత్మహ్యకు యత్నించింది. ఆమె రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే అనుకుంటే అనుకున్నంతా చేసి తన భర్తను చంపుతాడని భయపడి ఈ విధంగా చేసినట్లు ఆమె తెలిపారు. దీంతో చాలా మంది గ్రామంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయవాడలోని బాధితురాలు చికిత్స పొందుతున్న ఆయుష్ ఆస్పత్రి వద్ద ధర్నా చేసి కొలికపూడికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం కొంత మంది మహిళలు రోడ్డపై నిరసన వ్యక్తం చేశారు. కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని, మా నియోజకవర్గం నుంచి ఆయనను తప్పించాలని డిమాండ్ చేశారు.
దీంతో చంద్రబాబు నాయుడు విచారణ నిర్వహించి కొలికపూడికి వార్నింగ్ ఇచ్చారు. తాను మంచి చేస్తున్నా తనపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయని, నేను ఏ తప్పూ చేయలేదని గ్రామస్తులు చేస్తున్నదే తప్పని తన క్యాంపు కార్యాలయంలో కొలికపూడి రెండు రోజుల క్రితం నిరాహార దీక్ష చేపట్టారు. తనపై చర్యలు తీసుకోవాలంటూ నియోజకవర్గంలోని కొందరు సొంత పార్టీవారు చేస్తున్న ఆందోళన విరమించుకోవాలని కొలికపూడి దీక్ష చేపట్టారు. వెంటనే టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేశారు. అయినా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేను వ్యతిరేకించే వర్గం, ఎమ్మెల్యే వర్గం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తిరువూరుకు మరో వ్యక్తిని ఇన్‌చార్జ్‌గా నియమించే వరకు కొలికపూడి శ్రీనివాసరావు అరాచకాలపై ఆంధోళన కొనసాగిస్తామని తిరువూరు టీడీపీ వారు చెబుతున్నారు.