కొల్లేరు సరస్సును బడాబాబులు ఆక్వా చెరువులతో నింపేశారు. బుడమేరు డ్రైన్ నుంచి కొల్లేరు మీదుగా సముద్రానికి పోవాల్సిన నీరు ఎక్కడికక్కడ విజయవాడను ముంచేసింది.
విజయవాడను ముంచెత్తిన వరద నీరు బుడమేరు నుంచి ఎక్కువగా వచ్చింది. నగరానికి ఉత్తరం వైపున బుడమేరు, దక్షిణం వైపున క్రిష్ణా నది పొంగి పొర్లి 50శాతం నగరం మునిగిపోయేందుకు కారణమైంది. ఇందుకు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలే కారకులని పలువురు నీటి పారుదల రంగ నిఫుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాగులు, నదులు, డ్రైన్ కాలువలు పూడ్చి ఇళ్లు కడుతున్నారు. సాధారణంగా వరదల సమయంలో ప్రవహించే కాలువలు, నదులు ఊర్లమీద ప్రవహిస్తున్నాయి. వ్యాపారలు తమ స్వార్థం కోసం కొల్లేరును పూర్తి స్థాయిలో ఆక్రమించారు. సరస్సును ఆక్రమిస్తుంటే అధికారులు పట్టించుకోవడం లేదు. బడా బాబులు ఆక్రమించడమే ఇందుకు కారణం.
కొల్లేరుకు, విజయవాడకు ఏమిటి సంబంధం?
బుడమేరు డ్రైనేజీ కాలువ నుంచి వచ్చే నీరు కొల్లేరుకు చేరాల్సి ఉంది. అక్కడి నుంచి వరద నీరు సముద్రంలోకి వెళుతుంది. పూర్వపు క్రిష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని సుమారు 12 మండలాల్లో కొల్లేరు విస్తరించి ఉంది. పూర్వపు క్రిష్ణా జిల్లా కైకలూరు ప్రాంతంలోని కొల్లేరును పూర్తిస్థాయిలో ఆక్రమించారు. విదేశీ పక్షులు నివాసం ఉండేందుకు కూడా అనుకూలత లేకుండా చేశారు. బుడమేరు కాలువ విజయవాడ ఉత్తరం భాగం నుంచి పలు కాలనీల గుండా కొల్లేరుకు చేరుతుంది. ప్రధానంగా అంబాపురం, సత్యనారాయణపురం, జక్కంపూడి, లోటస్ సర్కిల్, అజిత్ సింగ్ నగర్, తోటావారి వీధి, ఆంధ్రప్రభ కాలనీ, డిస్నీల్యాండ్ ఏరియా, నున్న ప్రాంతం, పాయకాపురం, రామవరప్పాడు, ప్రసాదంపాడు మీదుగా ఏలూరు కాలువ నుంచి నీరు కొల్లేరుకు చేరుతుంది.
కొల్లేరులో పెరుగుతున్న ఆక్రమణలు
కొల్లేరు మొత్తం విస్తీర్ణం 2,22,300 ఎకరాలు. ఇందులో 12 మండలాలు, 122 గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం ఐదో నెంబరు కాంటూరు కొనసాగుతోంది. ఆక్రమణను తొలగించే కార్యక్రమంలో భాగంగా 2006లో ఐదో కాంటూరును అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్లాస్టింగ్ ల ద్వారా ధ్వంసం చేసి సరస్సులో కలిపేశారు. అయితే ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు పట్టించుకోకపోవడంతో కొల్లేరులో ఆక్రమణలు పెరుగుతూనే ఉన్నాయి. 25,142 ఎకరాల సరస్సును ఇప్పటికే ఆక్రమించారు. బ్లాస్టింగ్ ల తరువాత పదేళ్ల కాలంలో సుమారు 15వేల ఎకరాలపైనే ఆక్రమించారు. కొల్లేరు సరస్సులో పైభాగాన ఉండే మొత్తం డ్రైనేజీ కాలువల నుంచి నీరు చేరుతుంది.
రామిలేరు, తమ్మిలేరు, గుండేరు, ఎర్రకాలువ ద్వరా మండవల్లి మండలం పెద్ద వడ్డపూడి బ్రిడ్జి నుంచి కొల్లేరు నీరు సముద్రంలో కలుస్తుంది. కొల్లేరు నుంచి సముద్రానికి సుమారు 50 కిలో మీటర్ల దూరం ఉంటుంది. బుడమేరు నుంచి కొల్లేరుకు సుమారు 170 కిలో మీటర్ల దూరం ఉంది. ఇంతదూరం ప్రయాణించాల్సిన ఎటువైపు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో విజయవాడను ముంచెత్తింది. పామర్రు నుంచి లింగాల, కొల్లేరు వరకు ఎటువైపు చూసినా సరస్సును ఆక్రమించి చేపలు, రొయ్యల చెరువులతో నింపేశారు.
అక్కడ ఎవరికి వారే రాజు
ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ఎవరికి వారు కొల్లేరు తమ సొంత ఆస్తిగా భావిస్తుంటారు. కొందరు చెరువులు నిర్మించడమే కాకుండా చెరువుల వద్దకు సొంత నిధులతో రోడ్లు కూడా నిర్మించారు. చింతమనేని ప్రభాకర్ వంటి వారు నేరుగా రోడ్డు నిర్మించి తరువాత పంచాయతీరాజ్ శాఖకు బిల్లులు పంపించి శాంక్షన్ చేయాల్సిందిగా హుకుం జారీ చేశారు. ఈ పరిస్థితి 2014 జరిగింది. ఈయన లాంటి వారు ఎంతో మంది కొల్లేరు సరస్సులో ఉన్నారు.
క్రిష్ణా నది బుడమేరును వెనక్కి నెట్టింది..
బుడమేరు నది క్రిష్ణా బ్యారేజ్ కు పైభాగాన వుంది. బుడమేరు పూర్తిగా నిండటంతో కొల్లేరు వైపు పోలేక క్రిష్ణా బ్యారేజ్ వైపుకు మళ్లింది. అయితే అప్పటికే నాగార్జున సాగర్ నుంచి వరదనీరు క్రిష్ణా బ్యారేజ్ కు పూర్తి స్థాయిలో చేరుతుండటంతో బుడమేరు నీటిని వెనక్కి నెట్టింది. దీంతో ఆ నీరు ఎటువైపు పోవాలో తెలియక సిటీపైకి ఎగబాకింది.
బుడమేరంతా ఆక్రమణ
బుడమేరు డ్రైనేజీ కాలువను ఆనుకుని కొన్ని చోట్ల బాగా గుంటలు లేని ప్రాంతాలు చూసి కాలువలోనే కొన్ని చోట్ల కొందరు రియల్ వ్యాపారులు వెంచర్లు వేసి 2014లో అమ్మారు. కొందరు బుడమేరు కాలువ ప్రవహించే ప్రాంతంలోనే కొనుగోలు చేసి ఇళ్లు కట్టారు. అవన్నీ ఇప్పుడు మునిగి పోయాయి.
అటు కొల్లేరు సరస్సు నీటిని తీసుకోలేక పోవడం, బుడమేరు కాలువ కుంచించుకు పోవడం, క్రిష్ణా నది భారీగా వరదనీటితో నిండటంతో బుడమేరుకు విజయవాడ నగరం ఒక్కటే మార్గంగా కనిపించి ముంచేసింది. కొల్లేరు ఆక్రమణలు తొలగించి బుడమేరును పూర్తి స్థాయిలో బాగుచేసి కాలువను కొల్లేరులో కలిసే విధంగా చర్యలు తీసుకోకుంటే ఎప్పటికైనా విజయవాడకు ముప్పేనని పలువురు నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇంజనీర్లు చెబుతున్నారు.
బుడమేరు కాలువ విజయవాడ నగరాన్ని ముంచెత్తటానికి కారణం కొల్లేరుతో పాటు బుడమేరు ఆక్రమణలేనని చెప్పేందుకు రిటైర్డ్ ఇంజనీర్లు కానీ, ప్రస్తుతం డ్యూటీలో ఉన్న ఇంజనీర్లు కానీ నిరాకరిస్తున్నారు. బుడమేరు మునక విషయమై సామాజిక అధ్యయన వేదిక అధ్యక్షులు టి లక్ష్మినారాయణ మాట్లాడుతూ కొల్లేరు ఆక్రమణలతో పాటు బుడమేరు ఆక్రమణలే ఇంత విపత్తుకు కారణమయ్యాయని, విజయవాడలో సుమారు ఐదు లక్షల మంచి వరద భారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పొప్పులు చర్చించుకునేకంటే వెంటనే బుడమేరు కాలువను బాగు చేయాలన్నారు. తెలంగాణలో పుట్టిన బుడమేరు నీటి కాలువలు విజయవాడకు వచ్చే సరికి నది స్వరూపాన్ని ఇస్తోందన్నారు. కేవలం డ్రైనేజీ కాలువ కొన్ని లక్షల కుటుంబాలను ముంచిందంటే ఇందులో కేవలం ప్రభుత్వ తప్పే కాకుండా బడాబాబుల తప్పులు కూడా ఉన్నాయన్నారు.