ఈ ఏరియాలో దళితులకు రెండో సారి టికెట్ రావడం చాలా కష్టం...
x
కోనేటి ఆదిమూలం

ఈ ఏరియాలో దళితులకు రెండో సారి టికెట్ రావడం చాలా కష్టం...

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో 'పెద్దల' మాటే వినాలి. లేదంటే మళ్లీ ఎన్నికల్లో కనిపించరు. ఒక్క సారితోనే మాజీలయిపోతారు.



(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)



తిరుపతి: పదవులు కావాలంటే.. స్వాభిమానం కాదు.. లౌక్యం ఉండాలి. ఇవి లేకుంటే దళిత, గిరిజన ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్లు దక్కవు. అలా చాలామంది.. మాజీలుగానే మిగిలిపోయారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే.. రాజకీయ పదవులు కావాలంటే, పెద్దల రాజ్యాంగం పాటించాల్సిందే. గ్రామాల్లో వార్డు సభ్యుడు నుంచి మొదలు పెడితే పార్లమెంటు సభ్యుడు వరకు పెద్దల కనుసన్నల్లోనే నడవాలి. లేదంటే రాజకీయ పదవులకు దూరమై, వైరాగ్యం పాటించాల్సిందే.


అలా ఎందుకు ఉండాలి?


వామపక్ష ఉద్యమ భావజాలంతో ఓనమాలు దిద్దుకున్న కోనేటి ఆదిమూలం జీవితమంతా.. దిక్కార స్వరమే.. పోరాటమే. ఏమాత్రం తగ్గని ఆయన పట్టుబట్టి సాధించారు. వైఎస్ఆర్‌సీపీలో టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే.. అగ్రవర్ణాల పెత్తనంపై ధిక్కార స్వరం వినిపించారు. పోరాడి మరీ టీడీపీ టికెట్ సాధించారు. ఇది ఒక రకంగా దళిత, గిరిజన వర్గాలకు ఓ సందేశంగా చెప్పవచ్చు.


రాష్ట్రంలో 175 శాసనసభ నియోజకవర్గాల్లో రాజ్యాంగం నిర్దేశించిన మేరకు.. ఎస్సీలకు 29, ఎస్టీలకు ఏడు స్థానాలు కేటాయించారు. వాటిలో గ్రేటర్ రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో 11 ఎస్సీ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఆ స్థానాల్లో మాల, లేదా మాదిగ సామాజికవర్గ నాయకులు పోటీ చేస్తారు అనడం కంటే పోటీ చేయిస్తూ ఉంటారు అంటే సరిగ్గా ఉంటుంది.


చెప్పింది వినలేదని..


ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో గెలిచే ఎమ్మెల్యేలు ఏ పార్టీ వారైనా సరే. ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు చెప్పిందే వినాలి. చెప్పినచోట సంతకం పెట్టాలి. కాంట్రాక్టు పనులు ఎవరి పేరు చెప్తే వారికి ఇవ్వాలి. కొందరైతే ఏకంగా సంతకాలు చేసిన ఖాళీ లెటర్ హెడ్లు ఇవ్వమని కూడా అడిగిన సందర్భాలు కోకొల్లలు. ఈ మాటలు వినని ఎమ్మెల్యేలకు మరో దఫా టికెట్ ఉండదు. మళ్లీ కొత్త మొఖం తెర మీదకు వస్తుంది. అందుకు ఇదిగో సాక్ష్యం. ప్రతి ఎన్నికకు అభ్యర్థి మారిపోతూ ఉంటారు. ఆ కోవలోనే... నిలిచినవే కడప జిల్లా రైల్వే కోడూరు, బద్వేలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు.1962 నుంచి 2019 వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. రైల్వే కోడూరు నుంచి వారిలో రెండు సార్లు గెలిచింది తూమాటి పెంచలయ్య (టీడీపీ), వైఎస్ఆర్‌సీపీ నుంచి కొరముట్ల శ్రీనివాసులు (సిట్టింగ్) మాత్రమే. ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి వడ్డి చెన్నయ్య, సరస్వతమ్మ, కాంగ్రెస్ నుంచి గుంటి వెంకటేశ్వర ప్రసాద్ మాజీ ఎమ్మెల్యేలు‌గా మిగిలారు.


"దళితులకు స్వాభావికంగా ఆత్మాభిమానం ఎక్కువ" ఆ లైన్లోనే ప్రజా సేవ చేశా’’ అని రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే తూమాటి పెంచలయ్య అన్నారు. ‘‘హత్యరాల నుంచి కమ్మ పల్లెల మీదుగా చిట్వేలి వరకు భారీ తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు చేయించా. పనులన్నీ నాయకులకు ఇవ్వడం అంటే సాధ్యం కాదు కదా. అక్కడే తేడా వచ్చింది, మూడోసారి టికెట్ రాకపోవడానికి ఇదే ప్రధాన కారణం’’ అని తూమాటి పెంచలయ్య కలత చెందారు.



బద్వేల్‌లో వాళ్లదే పెత్తనం


2009 నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో కడప జిల్లాలో బద్వేల్‌ను కూడా మొదటిసారి ఎస్సీ రిజర్వ్‌గా నిర్ణయించారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన పీఎం కమలమ్మకు కాంగ్రెస్ పార్టీలో అవకాశం కల్పించారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి కుమార్తె మాజీ ఎమ్మెల్యే బిజి వేముల విజయలక్ష్మి, వైఎస్సార్సీపీలో ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి ల పట్టే ఎక్కువ. దీంతో ఇక్కడ కూడా టీడీపీ నుంచి కమలమ్మ, నాటి కాంగ్రెస్ పార్టీ నుంచి జయరామయ్య మాజీలుగా మిగిలిపోయారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ జి వెంకటసుబ్బయ్య 2021 మార్చి 28న మరణించారు. దీంతో ఆ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య డాక్టర్ జి సుధాపై పోటీకి నిలవలేదు. బీజేపీ అభ్యర్థి ఈ సురేష్‌పై ఆమె విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన డాక్టర్ రాజశేఖర్ స్థానంలో కొత్త అభ్యర్థి కోసం గాలిస్తున్నారు.


కర్నూలులో వ్యక్తుల ఆధిపత్యం


కర్నూలు జిల్లాలో కోడుమూరు, నందికొట్కూరు శాసనసభ స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ఇక్కడ దళిత నాయకుల ప్రభావం ఉంటుంది. రాష్ట్రానికి రెండో సీఎంగా పనిచేసిన దామోదరం సంజీవయ్య ప్రభావం జిల్లాలో కనిపిస్తుంది. కోడుమూరు శాసనసభ స్థానానికి 1960 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో.. దామోదరం మునుస్వామి 1967 లో ఓటమి చెందినా 1972లో ఏకగ్రీవంగా గెలిచారు 1978, 1983 లో విజయం సాధించి, హ్యాట్రిక్ కొట్టారు. అలాగే.. 1994 నుంచి 2004 వరకు వరుసగా గెలిచిన ఎం శిఖామణి హ్యాట్రిక్ కొట్టారు.

కర్నూలు జిల్లా కోడుమూరు, నందికొట్కూరు కూడా ఇదే పరిస్థితి. నందికొట్కూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ పోలీసు అధికారి ఆర్థర్‌కు, కోడుమూరు నుంచి జే. సుధాకర్‌కు టికెట్ దక్కక మాజీలు అయ్యారు. వీరితో పాటు ఈ రెండు నియోజకవర్గాల్లో ఇజయ్య, లబ్బి వెంకట స్వామి, మణికంఠ, మురళీ కృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నందికొట్కూరులో సిద్ధార్థ రెడ్డి పెత్తనం వల్లే ఆర్ధర్‌కు టికెట్ రాలేదని సమాచారం.


చిత్తూరులో పెద్దన్నదే పెత్తనం..!


చిత్తూరు జిల్లాలో సత్యవేడు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభావఈమే ఎక్కువగా ఉంటుంది. సత్యవేడు నియోజకవర్గాన్ని పరిశీలిస్తే.. 1962 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో ప్రారంభంలో ఒక స్వతంత్ర అభ్యర్థి ఆ తర్వాత టీడీపీ అభ్యర్థులు ఐదు సార్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఐదుసార్లు గెలిచారు. ఇక్కడ హెచ్ హేమలత, స్వరాజ్, తలారి మనోహర్, ఆయన కుమారుడు తలారి ఆదిత్య మాజీలుగా మిగిలిపోయారు. పూతలపట్టులో లలితా థామస్, ఎమ్మెస్ బాబు మాజీలు అయ్యారు.

నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్‌కు టికెట్ ఇవ్వలేదు. మరో రిజర్వ్ నియోజకవర్గం సూళ్లూరుపేటలో 30 ఏళ్లుగా టీడీపీలోనే కొనసాగుతున్న పరస వెంకటరత్నానికి టికెట్ ఇవ్వలేదు. ఈయనతోపాటు నెలవల సుబ్రహ్మణ్యం కూడా మాజీగానే మిగిలిపోయారు.

తిరగబడి.. నిలబడి..


ఇలాంటి నేపథ్యంలో "ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలపై మీ పెత్తనం ఏంది?" అని వైఎస్‌ఆర్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం దిక్కరించారు. తిరుగుబాటు చేసి టిడిపిలోకి వెళ్లారు. ఇక్కడ టికెట్ ఆశిస్తున్న వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, టీడీపీ అధినేత చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.



అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో టికెట్ లభించక ఇక్కడ ఇద్దరు టీడీపీ ఒకరు కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేలుగా మిగిలారు. అలాగే మడకశిర నియోజకవర్గంలో ఒకరు టీడీపీ, మరొకరు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామి కూడా ఈసారి టికెట్టు లభించకపోతే మాజీల జాబితాలో చేరే అవకాశం ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో కూడా ఇద్దరు రెడ్ల సపోర్టు ఉంటేనే టికెట్.

అభ్యర్థులను మార్చడం దారుణం...


" కేవలం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థులను మార్చడం దారుణం" అని మాజీ ఐఏఎస్ అధికారి, నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ తనకు టికెట్ నిరాకరించడంపై ఇటీవల కేవీబీ పురం మండలంలో పర్యటన సందర్భంగా ఆ వ్యాఖ్యలు చేశారు.



Read More
Next Story