కొత్తపల్లి గీత ఓ రాజకీయ సంచలనం!

మాజీ ఎంపీ కొత్తపల్లి గీత రాజకీయాల్లో రాణిస్తారా? పొత్తుల్లో ఆమెకు బీజేపీ అవకాశం కల్పిస్తుందా? ప్రత్యేకంగా రాజకీయ పార్టీ స్థాపించిన మహిళగా మిగిలిపోతుందా?


కొత్తపల్లి గీత ఓ రాజకీయ సంచలనం!
x
Kottapalli Geeta

కొత్తపల్లి గీత ఒక రాజకీయ సంచలనం. గిరిజన మహిళ. విద్యావంతురాలు. మూడు రకాల డిగ్రీలు చేసింది. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ గిరిజన కుటుంబాల నుంచి డిగ్రీ చదువుకున్న మొదటి మహిళ. బ్యాంకు ఆఫీసర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి, మేనేజర్‌గా పనిచేశారు. ఆ తరువాత గ్రూప్‌–1 రాసి డిప్యూటీ కలెక్టర్‌ పోస్టు సాధించారు. రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్, సబ్‌ కలెక్టర్‌గా పలు విభాగాల్లో పనిచేశారు. మంచి అధికారిగా పేరు సంపాదించారు.

ఉద్యోగానికి రాజీనామా
ఎందుకో ఆమెకు ఉద్యోగం నచ్చలేదు. వ్యాపారం చేయాలనుకుంది. కేవలం డబ్బే ప్రధానమనుకుందో లేక పారిశ్రామిక వేత్తగా రాణించాలనుకుందో కాని వ్యాపారంలో మాత్రం రాణించారు. ఉద్యోగానికి 2010లో రాజీనామా చేసి చెన్నైలోని మహేశ్వర గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో డైరెక్టర్‌గా చేరి ఎండీ స్థాయికి ఎదిగారు. అప్పట్లో బ్యాంకు నుంచి రూ. 42.79 కోట్లు అప్పుగా తీసుకుని బ్యాంకుకు చెల్లించలేదు. దీంతో బ్యాంకు వారు పోలీస్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును అందుకున్న పోలీస్‌ సీబీఐని రంగంలోకి దించింది. 2015 జూన్‌ 30న ఆమె, ఆమె భర్తపై కేసు నమోదైంది. ఆ కేసులో శిక్షకూడా కోర్టు విధించింది. తర్వాత పై కోర్టులకు Ðð ళ్లి పోరాడింది.
రాజకీయాల్లోకి..
వ్యాపారాల్లో ఉన్న గీత రాజకీయాలవైపు దృష్టి మరల్చింది. మొదటి సారిగా 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా అరకు పార్లమెంట్‌కు పోటీ చేసి గెలుపొందింది. గెలిచిన తరువాత వైఎస్సార్‌సీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసినా అప్పటి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పట్టించుకోలేదు. ఒక దశలో నేనేమీ చేయలేను, ఇది పార్టీ నిర్ణయమంటూ సమాధానాలు దాట వేశారు. అలా టీడీపీలో చేరిన గీత అక్కడి నుంచి బయటకు వచ్చి 2019 ఎన్నికలకు ముందు సొంతంగా పార్టీని స్థాపించింది. జన జాగృతి పేరుతో ఏర్పడిన పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూసింది. గిరిజనులే కాదు సాధారణ ప్రజలు కూడా ఆమెను పట్టించుకోలేదు. పార్టీ ఏర్పాటు వెనుక కొంతమంది ఐఏఎస్‌లు, డిప్యూటీ కలెక్టర్‌లు ఆమెకు సహకరించారు. ఓటమి చవిచూసిన తరువాత ఇలాగే తాను ఏర్పాటు చేసిన పార్టీలో ఉంటే ఎవ్వరూ పట్టించుకోరని గమనించిన గీత పార్టీని భారతీయ జనతాపార్టీలో విలీనం చేసి అమిత్‌షా సమక్షంలో బీజేపీలో 2019లో చేరారు.
బీజేపీ టిక్కెట్‌ ఇస్తుందా?
కొత్తపల్లి గీతకు బీజేపీ టిక్కెట్‌ ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చగా మారింది. గిరిజనుల్లో ఒక వెలుగు వెలిగిన గీత ప్రస్తుతం ఎందుకూ పనికిరాని రాజకీయ నాయకురాలుగా మిగిలిపోయారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తులతో ఏపీలో ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో ఆమెలో ఆశలు చిగురించాయి. ఎలాగైనా బీజేపీ అభ్యర్థిగా అరకు పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసి గెలిచి సత్తా చాటాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటి వరకు ఒక పార్టీ తరపున గెలిచి పార్టీ మారిన వారిని ఎవ్వరినీ గిరిజనులు గెలిపించలేదు. కొత్తపల్లి గీత ఎక్కువ కాలం హైదరాబాద్, ఢిల్లీల్లోనే గడిపారు. పార్టీ నాయకుల వద్ద పలుకుబడి ఉందేమో కాని స్థానిక ఓటర్ల మనసుల్లో మాత్రం లేరని చెప్పొచ్చు.
సీటు దక్కితే ఆదరిస్తారని...
బీజేపీ తరుపున అరకు పార్లమెంట్‌ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తే జనసేన, తెలుగుదేశం పార్టీ ఓట్లతో గెలిచే అవకాశాలు ఉంటాయని గీత భావిస్తున్నారు. జనసేనకు కూడా గిరిజనుల్లో కొంత పట్టు ఉంది. అరకు అసెంబ్లీ స్థానానికి గత ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థికి సుమారు 20వేలకు పైన ఓట్లు వచ్చాయి. అంటే గిరిజనులు జనసేనను కూడా ఎంతో కొంత ఆదరిస్తున్నారని భావించాల్సిందే. గీత ఆశలు ఫలిస్తాయా? బీజేపీ వాళ్లు సీటు ఇస్తారా? వేచి చూడాల్సిందే.
Next Story