కోట్ల..కేఇ కంచుకోటలో బుగ్గన హ్యట్రిట్‌ కొట్టేనా?
x

కోట్ల..కేఇ కంచుకోటలో బుగ్గన హ్యట్రిట్‌ కొట్టేనా?

ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్‌ కోట్ల.. కేఇ కుటుంబాల కంచుకోట. దీనిని బద్దలు కొట్టిన బుగ్గన..2024లో హ్యాట్రిక్‌ సాధిస్తారా?


జి విజయ కుమార్

ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్‌ అసెంబ్లీ నియోజక వర్గంలో మూడో సారి గెలిచి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హ్యాట్రిక్‌ సాధిస్తారా అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఒక వైపు మూడో సారి గెలిచేందుకు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తోండగా మరో వైపు బుగ్గనను ఎలాగైనా ఓడించి టీడీపీ జెండా ఎగుర వేసి తన కోటను పదిలం చేసుకోవాలని మాజీ ఎంపి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కసరత్తు ముమ్మరం చేశారు. తన వర్గాన్నంతా రంగంలోకి దింపారు.
రెండు సార్లు గెలిచిన బుగ్గన
ఉమ్మడి కర్నూలు జిల్లాలో డోన్‌ అసెంబ్లీ నియోజక వర్గం అత్యంత ప్రతిష్టాత్మకమై నియోజ వర్గం. జిల్లాల పునర్విభజన అనంతరం నంద్యాల జిల్లా పరిధిలోకి వెళ్లింది. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రంగంలోకి వచ్చేంత వరకు డోన్‌ నియోజక వర్గం కేఇ, కోట్ల కుటుంబాలకు కంచుకోటగా మారింది. ఆ రెండు కుటుంబాలు గెలుస్తూ వచ్చారు. ఏళ్ల తరబడి ఇరు కుటుంబాల ఆదిపత్యాన్ని డోన్‌లో చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వచ్చారు. అయితే 2014లో దీనికి చెక్‌ పడింది. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ రికార్డును బ్రేక్‌ చేశారు. నాడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేఇ ప్రతాప్‌పై 11వేలకు పైచిలుకు ఓట్ల మెజారిటీతో బుగ్గన గెలుపొందారు. 2019లో కూడా బుగ్గన ఇదే ఊపును కొనసాగించారు. గత ఎన్నికల్లో తలపడిన అభ్యర్థులనే 2019 ఎన్నికల్లో కూడా ఇరు పార్టీలు బరిలోకి దింపాయి. వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ అభ్యర్థిగా బుగ్గన బరిలోకి దిగగా.. టీడీపీ నుంచి కేఇ ప్రతాప్‌ పోటీలోకి దిగారు. 2014 ఎన్నికల్లో ఓటమి చవి చూసిన కేఇ కుటుంబం 2019లో ఎలాగైన గెలవాలనే రెట్టింపు పట్టుదలతో బరిలోకి దిగింది. అయితే ఈ దఫా కూడా బుగ్గన చేతిలో ఓడి పోయింది. కేఇ ప్రతాప్‌పై 35,516 ఓట్ల మెజారిటీతో బుగ్గన గెలుపొందారు.
2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని మార్చిన బాబు
గత రెండు ఎన్నికల్లో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీని ఈ సారి గెలిచి ఈ స్థానాన్ని దక్కించుకోవాలని చంద్రబాబు ప్లాన్‌ చేశారు. దీని కోసం అభ్యర్థిని మార్చాలని నిర్ణయించారు. కేఇ కుటుంబానికి కాకుండా కోట్ల కుటుంబానికి సీటు కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కుమారుడు మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిని టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు. మరో వైపు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిని కూడా మారుస్తారని ప్రచారం జరిగింది. వాటిని తల్లకిందులు చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికే ఈ సారి కూడా డోన్‌ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా ఖరారు చేశారు.
హోరా హోరీగా పోటీ
టీడీపీ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిన చంద్రబాబు బరిలోకి దంపడం, వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే బుగ్గనను సీఎం వైఎస్‌ జగన్‌ రంగంలోకి దింపడంతో పోరు రసవత్తరంగా ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోట్ల వర్గం అంతా ఒక తాటిపైకి తెచ్చేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 2004లో కోట్ల కుటుంబం నుంచి కోట్ల సుజాత బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దిగిన ఆమె గెలుపొందారు. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేఇ ప్రభాకర్‌పై సుజాత గెలుపొందారు. నాడు హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో 2,609 ఓట్లతో సుజాత బయట పడ్డారు. కేఇ కుటుంబం కూడా గట్టీ పోటీ ఇచ్చింది. ఆ తర్వాత కోట్ల కుటుంబం డోన్‌కు దూరంగా ఉంటున్నా వారికంటూ ప్రత్యేక వర్గం ఇక్కడ ఉంది. దీనికి జవసత్వాలు అందించే పనిలో కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రంగంలోకి దిగారు. మరో వైపు రెండు సార్లు ఇక్క నుంచి గెలిచి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి వర్గంలో ఆర్థిక శాఖ వంటి కీలక శాఖను వశం చేసుకున్న బుగ్గన.. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడనే పేరు కూడా ఉంది. ఈ పరపతితో అక్కడక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా.. ఓవరాల్‌గా డెవలప్‌మెంట్‌ ఏమీ జరగలేదనే విమర్శలు ఉన్నాయి. అయినా వీటిని అధికమించి మూడో సారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని వ్యూహాలు రచిస్తున్నారు.
గతంలో ఏలిన రెండు కుటుంబాలు
2014 వరకు కేఇ.. కోట్ల కుటంబాలు డోన్‌ రాజకీయాలను శాసించాయి. కోట్ల కుటుంబం కంటే కేఇ కుటుంబమే తిరుగు లేని ఆదిపత్యాన్ని ప్రదర్శించింది. 1994లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2004 కోట్ల సుజాత గెలుపొందారు. ఇక కేఇ కుటుంబమైతే ఏకంగా ఎనిమి సార్లు గెలిచి తమకు ఎదురు లేదని నిరూపించారు. 1978లో పోటీ చేసిన కేఇ కృష్ణమూర్తి గెలుపొందారు. అక్కడ నుంచి వరుసగా 1989 వరకు గెలుస్తూ వచ్చారు. 1994లో కేఇ కుటంబం పరంపరకు కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి అడ్డుకట్ట వేశారు. అయితే అది తాత్కాలికంగానే ఉండి పోయింది. 1996 నుంచి తిరిగి కేఇ కుటుంబం ఆదిపత్యాన్ని కనబరుస్తూ వచ్చారు. 1996లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేఇ ప్రభాకర్‌ వరుసగా రెండు సార్లు గెలిచారు. అయితే 2004లో కేఇ ప్రభాకర్‌ కోట్ల సుజాత చేతిలో ఓడిపోయారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన కేఇ కృష్ణమూర్తి కోట్ల సుజాతపై గెలిచి ప్రతీకారం తీర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రిగా పని చేసిన నీలం సంజీవరెడ్డి కూడా డోన్‌ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు.
Read More
Next Story