పరవళ్లు తొక్కుతున్న శ్రీశైలం: ప్రకాశం బ్యారేజీ వద్ద 70 గేట్లు ఎత్తివేత
x

పరవళ్లు తొక్కుతున్న శ్రీశైలం: ప్రకాశం బ్యారేజీ వద్ద 70 గేట్లు ఎత్తివేత

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. కృష్ణానదికి వరద పోటెత్తుతోంది.


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఆరు గేట్లు ఎత్తి 2.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పైనుంచి నీరు ఉధృతంగా వస్తుండడంతో దిగువనున్న ప్రకాశం బ్యారేజీ వద్దకు భారీగా నీరు చేరుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద 70 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి మొత్తం 1.18 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. భారీ మొత్తంలో నీటి ప్రవాహం ఉండటంతో నదీ పరివాహకప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

తుంగభద్ర నుంచి సుంకేశులకు నీరు..
ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర నుంచి సుంకేశులకు భారీ వరద వస్తోంది. శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఇప్పటికే 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం స్పిల్‌వే ద్వారా 1.67 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఎగువ నుంచి శ్రీశైలానికి 2.17 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి 60 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

సుంకేశుల కు నీరు పోటెత్తుతోంది. తుంగభద్ర నుంచి భారీగా వరద నీరు వస్తోంది. 4.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులు. ప్రస్తుతం 882 అడుగుల మేరకు నీరు చేరుకుంది. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో దాన్ని చూసేందుకు జనం పోటత్తుతున్నారు.
శ్రీశైలం డ్యామ్‌కు భారీ వరద వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో అప్‌స్ట్రీమ్ ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల వద్ద భారీ వరద ఉద్ధృతి ఇప్పటికే జూరాల మీదుగా శనివారం తెల్లవారుజాముకి శ్రీశైలానికి చేరుకుంది. నారాయణపూర్‌కు 1.09 లక్షల క్యూసెక్కులు, జూరాల వద్ద 83 వేల క్యూసెక్కుల వరద వస్తోంది.
శ్రీశైలానికి వరదను సప్లిమెంట్ చేసే తుంగభద్ర డ్యామ్‌కు వరద వస్తోంది. కర్ణాటకలోని తుంగ, భద్ర నదుల ప్రధాన పరివాహక ప్రాంతమైన అగుంబే వరకు వెళ్లే అవకాశం ఉంది. తుంగభద్ర డ్యాంలో ప్రస్తుత వరద కొనసాగితే రానున్న నాలుగు రోజుల్లో మిగులు నీటిని కిందికి వదులుతారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి బేసిన్‌లలోని మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకుల్లోకి మంచినీరు చేరనుంది.
Read More
Next Story