‘నాకు ఆ ఉద్దేశ్యమే లేదు’.. వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్
x

‘నాకు ఆ ఉద్దేశ్యమే లేదు’.. వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్

మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ చెప్పారు.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రికార్డ్ డ్యాన్సుల వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉచిత ఆర్టీసీ పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఆడొళ్లు బ్రేక్‌ డ్యాన్సులు, రికార్డ్ డ్యాన్సులు వేసుకోవచ్చంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతా సంచలనంగా మారాయి. రాష్ట్రమంతా ఆయన వ్యాఖ్యలను తప్పు బడుతున్నారు. తెలంగాణ భవన్‌లో స్టేషన్ ఘన్‌పూర్ నాయకులతో నిర్వహించిన సమావేశం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు స్టేట్ హాట్ టాపిక్‌గా మారింది. దీంతో తాజాగా తన వ్యాఖ్యలను క్లారిటీ ఇచ్చారు కేటీఆర్. తన వ్యాఖ్యలకు తప్పుడు అర్థాలు తీస్తున్నారని, తన ఉద్దేశం వక్రీకరించబడిందంటూ చెప్పుకొచ్చారు.

‘నేను అలా అనలేదు’

‘‘నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’’ అంటూ తన వ్యాఖ్యలకు జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ పెట్టారు. కేటీఆర్ ఉద్దేశ పూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు సరిపడా లేవన్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే తాను అలా వ్యాఖ్యానించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గత కొన్ని రోజులుగా బస్సుల్లో మహిళలు వెల్లుల్లి పొట్టు తీసుకోవడం, జెడలు వేసుకోవడం వంటి వీడియోలు వైరల్ అవుతున్న క్రమంలో వాటిని బీఆర్ఎస్ చేయిస్తుందన్న ఆరోపణలు వస్తున్న క్రమంలో తమకు వాటితో ఎటువంటి ఇబ్బంది లేదన్న విషయం చెప్పాలని కేటీఆర్ అలా మాట్లాడారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.

అసలేం జరిగిందంటే..

"బస్సుల్లో అల్లం, వెల్లిపాయాలు గిల్లుకుంటే తప్పేముందని మంత్రి సీతక్క అంటున్నారు. అందుకే బస్సులు పెట్టరేమో మాకు తెలియదక్కా. బస్సుల్లో మహిళలు కొట్టుకుంటుంటే సీతక్కకి కనబడడం లేదా. ఒక్కో మనిషికి ఒక్కో బస్సు పెట్టండి. బస్సులు పెంచిన తర్వాత అవసరమైతే బ్రేక్ డాన్స్, రికార్డ్ డాన్స్ లు వేసుకోమనండి... మాకేంటి? అదనంగా బస్సులు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. వాటిపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు.

"ఆడవాళ్ళను కించపరిచే విధంగా బ్రేక్ డాన్సులు చేసుకోండి అనడం మీ బుర్రలో వున్న బురదకు నిదర్శనం. గత పది సంవత్సరాలు హైదరాబాద్లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నాము. అందులో భాగంగా పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నాం. శ్రమజీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృధా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటి? ఇంటి వద్ద చేసుకునే చిన్నా చితక పనులు బస్సుల్లో చేసుకుంటే... వారిని బ్రేక్ డాన్స్ లు వేసుకోమనడం దుర్మార్గం. మహిళలు బ్రేక్ డాన్స్ లు చేసుకోండి అనే మాటలు నీ నోటికి ఎలా వచ్చాయి కేటీఆర్’’ అంటూ మండిపడ్డారు సీతక్క.

Read More
Next Story