ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తారు. ఏదైనా మొదట కుప్పంలోనే పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు.
తన నియోజకవర్గమైన కుప్పంను అభివృద్ది కార్యక్రమాలకు ప్రయోగశాలగా ఉపయోగపడే విధంగా కుప్పం నియోజకవర్గాన్ని తయారు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఏ కార్యక్రమమైనా ముందుగా పైలెట్ ప్రాజెక్టు కింద కుప్పంలో అమలు చేసి సక్సెస్ అయిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందనే ఆలోచనలకు వచ్చారు. ఈ ఆలోచన కొత్త ఒరవడికి నాంది పలికినట్లగా ఉందని చెప్పొచ్చు.
మొదటి పర్యటనలో మాటా మంతీ..
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత 2024 జూన్ 25,26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకు, ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసినందుకు అభినందించారు. మొదటి సారిగా కుప్పం నియోజకవర్గంలోనే అన్న క్యాంటిన్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆ తరువాత హంద్రీ నీవా కాలువ పరిస్థితిని అడిగి తెలుసుకుని శాంతిపురం మండలం గుడిశెట్టిపల్లి వద్ద కాలువను పరిశీలించారు. తిరిగి ఆరు నెలల తరువాత మళ్లీ కుప్పం నియోజకవర్గంలో 2025 జనవరి 6,7,8 తేదీల్లో పర్యటించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వరి సాయం..
ఈ ఆరు నెలల కాలంలో ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి రెండు సార్లు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా చిరు వ్యాపారులు బతకడం కోసం, పేదలు వలసలు పోకుండా ఆపడం కోసం కృషి చేశారు. ఇటీవల ఆమె కుప్పం, రామకుప్పం ప్రాంతాల్లో పర్యటించినప్పుడు సుమారు 6వేల మందికి టై సైకిళ్లు, తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ నిధులు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి సమకూర్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నిత్యం నియోజకవర్గంలో మెడికల్ క్యాంపులు కొనసాగుతున్నాయి. ఈ క్యాంపుల్లో కంటి పరీక్షలు, ఇతర వ్యాధులకు సంబంధించిన చెకప్ లు చేసి ప్రధాన వైద్యశాలకు రెఫర్ చేస్తున్నారు. 108 వాహనాలే కాకుండా అవసరమైన వాహనాలు కూడా సమకూరుస్తున్నారు.
రెండో పర్యటనలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
కుప్పంలో పలు నిర్మాణ పనులకు, మదర్ డెయిరీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్, కడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఐఐటీ కాన్పూర్, అలెప్ మహిళాశక్తి భవన్ ఒప్పంద కార్యక్రమాలలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లపై సౌరఫలకాలు ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి సాగు బాగా విస్తరించాలని స్పష్టం చేశారు. ప్రకృతి సాగులో పండిన ఉత్పత్తులకు మంచి ధర వస్తుంది. భూమి పత్రాలు ఫోర్జరీ చేయకుండా చర్యలు చేపట్టాం, 2047 నాటికి దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పం మారుతుందన్నారు.
ఎనిమిది సార్లు గెలుపు
కుప్పం నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలుపొందారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయాలను తట్టుకుని 2019లో వచ్చిన మెజారిటీ కంటే మరో పదివేలు ఎక్కువ మెజారిటీ సాధించారు. ఇందుకు స్పూర్తిగా కుప్పం ఎమ్మెల్యేగా 'జననాయకుడు' పోర్టల్ పెట్టుకున్నామని, ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల్లో పరిష్కారమనేది పూర్తిగా తెలియాలని పార్టీ నాయకులకు సూచించారు. నీతి, నిజాయితీగా రాజకీయాలు చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. డబ్బు సంపాదించేందుకు రాజకీయాల్లోకి రావాలనే భావన పోవాలని అభిప్రాయపడ్డారు.
కరెంట్ బిల్లు కట్టే భారం లేకుండా చేసేందుకు...
కుప్పంలో పీఎం సూర్య ఘర్ సోలార్ పైలెట్ ప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఐఐటీ కాన్పూర్ వారి సహకారంతో ఈ ప్రాజెక్టు నిర్వహణ చేపట్టినట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇల్లూ నెలకు 200 యూనిట్లు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. 60 యూనిట్లు వాడుకోవచ్చు, 140 యూనిట్లు గ్రిడ్‌కు అమ్ముకునే అవకాశం ఉంది. ఏడాదికి రూ. 4 వేల విలువైన కరెంట్ ఉచితంగా వాడుకునే అవకాశం ఉంటుంది. ఏడాదికి రూ.5 వేల వరకు ఆదాయం వస్తుందని సీఎం చెప్పారు.
కుప్పంలో విద్యుత్ వాహనాలు
రానున్న రోజుల్లో కుప్పంలో పూర్తిస్థాయిలో విద్యుత్ వాహనాలు వాడే విధంగా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పెట్రోల్ బంకులకు బదులు చార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
కుప్పంలో పి 4 విధానం అమలు
ప్రజలను పేదరికం నుంచి బయట పడేసే పీ4 విధానం అమలుకు కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడ వర్సిటీ ఆడిటోరియంలో 'స్వర్ణ కుప్పం విజన్- 2029' డాక్యుమెంట్ ఆవిష్కరించారు. వచ్చే జూన్‌లోగా హంద్రీనీవా పూర్తి చేసి కుప్పంకు సాగునీరు తెస్తామని వెల్లడించారు. గతంలో జన్మభూమి, శ్రమదానం కుప్పం నుంచే ప్రారంభించామని గుర్తు చేశారు.
ప్రకృతి వ్యవసాయ కేంద్రంగా కుప్పం
కుప్పం నియోజకవర్గాన్ని ప్రకృతి వ్యవసాయ కేంద్రంగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అన్ని రకాల పంటలకు అనుకూలమైన భూములు ఉన్నందున ప్రకృతి వ్యవసాయం చేస్తే మంచి ఆదాయం వస్తుందనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ విషయాన్ని కుప్పంలోని స్థానికులకు చెప్పారు. కుప్పం మండలం శీగలపల్లి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి సందర్శించి రైతు కృష్ణమూర్తితో మాట్లాడారు. రైతు పలు రకాల పంటలు మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కూరగాయల నుంచి ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలు కూడా పండిస్తున్నారు.
కుప్పంలో ప్రకృతి వ్యవసాయం విజన్ 2029ను ప్రారంభించారు. ఏపీ రైతు సాధికార సంస్థ, నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. కుప్పంలో పండించే ప్రకృతి వ్యవసాయ పంటలను కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వీరు మార్క్ ఫెడ్ తో కూడా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు వారికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
రూట్ కార్డ్ సబ్జీ కూలర్స్
కుప్పం నియోజకవర్గంలో పండించిన కూరగాయలు, పండు, పూల రకాల పంటలను నిల్వ చేసుకునేందుకు రూట్ కార్డ్ సబ్జీ కూలర్స్ ను ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ప్రస్తుతానికి 100 కూలర్స్ తెప్పించేందుకు నిర్ణయించారు. ఇందులో ఉంచే వస్తువులు ఐదు రోజుల పాటు ఎటువంటి వాడు లేకుండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) వారు రైతులు పండించే కూరగాయలు, పండ్లు నిల్వ ఉంచేందుకు రెండు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధుల ద్వారా కుప్పం మునిసిపాలిటీని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. రూ. 10 కోట్లు అర్బన్ ప్రాజెక్టుల నిర్వహణకు ఖర్చు చేస్తారు. 60.20 కోట్లతో కుప్పంలో ఏర్పాటు చేసిన డీకేపల్లి పార్కుల అభివృద్ధి, సుందరీకరణ పనులతో పాటు రోడ్డు జంక్షన్లు, వీధి దీపాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. రూ. 110.21 కోట్లతో కుప్పం నియోజకవర్గంలో 451 డ్రైనేజీ వర్క్స్ ను జిఎస్ హెచ్- 11 ఎన్డీపీ నిధుల ద్వారా చేయించేందుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మదర్ డెయిరీ ఫ్రూట్ విజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో శాంతిపురం మండలం తంబిగానిపల్లె వద్ద 41.22 ఎకరాల విస్తీర్ణంలో ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా శ్రీజ ప్రొడ్యూసర్ కంపెనీ చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఐపీ తంబిగానిపల్లె వద్ద 40 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ భూములను ఏపీ ఐఐసీ ద్వారా ముఖ్యమంత్రి వారికి కేటాయించారు.
మొత్తం కుప్పం నియోజకవర్గంలో రూ. 90 కోట్లతో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.