"ప్రజా ప్రతినిధులు. నాయకులు. కాకుండా అధికారుల పెత్తనం ఎక్కువ అయింది" అని టిడిపి (TDP) నాయకులు బహిరంగంగానే అసంతృప్తి చెందారు. రామకుప్పం మండలంలోని సీనియర్ నేతలు, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు బుధవారం కూడా నిరసన గళం వినిపించారు.
కుప్పం ప్రాంత ప్రజలు సీఎం చంద్రబాబును అంతగా అభిమానించడానికి ప్రధాన కారణం ఒకటే. నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులతో చంద్రబాబుకు నేరుగా సంబంధాలు ఉండడం. కీలకమైన నాయకులు కూడా చంద్రబాబు విజయానికి, పార్టీ పటిష్టత కోసం సుక్షిత సైనికుల మాదిరి పనిచేయడమే. దీంతో గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైసిపి అభ్యర్థి భరత్ పై 48,184 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం గమనించదగిన విషయం. ఇదిలా ఉంటే,
కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు చెప్పిందే వేదం. చేసిందే చట్టం. అనే విధంగానే ఈ 35 సంవత్సరాల నుంచి టిడిపిని నడిపిస్తున్నారు. ఏ సందర్భంలో కూడా టిడిపి లో ఉన్న ప్రధాన నాయకులే కాదు. మండల స్థాయి నాయకులు కూడా సీఎం చంద్రబాబు లేదా టిడిపికి వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు లేవు. అలాంటిది తాజాగా జరిగిన సంఘటన టిడిపిలో నాయకులు తీవ్ర కలవరానికి గురిచేసింది.
అధికారుల పాత్ర
కుప్పం నుంచి సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి కడ (kuppam urban development authority- KADA) ఏర్పాటు చేయడంతో పాటు ఐఏఎస్ అధికారిని పర్యవేక్షణ కోసం నియమించారు. 30 ఏళ్ల పాటు పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా కుప్పంలో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, మాజీ ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు, చంద్రబాబు మిత్రుడు కంగుంది మునిరత్నం తో పాటు మిగతా కీలక నాయకులు పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేవారు.
2024 ఎన్నికలకు ముందు వీరికి తోడుగా ఎమ్మెల్సీ (MLC) కంచర్ల శ్రీకాంత్ కుప్పం తెరపైకి వచ్చారు. ఆయన కూడా నాయకులను సమన్వయం చేస్తూనే పార్టీ వ్యవహారాలను చక్కదించడంతోపాటు సమస్యల పరిష్కారానికి కూడా చొరవ తీసుకుంటున్నారు. ఈయన రాక అంతర్గతంగా సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు పై ఉన్న గౌరవం, అభిమానంతోనే గతంలో మాదిరే పనిచేస్తున్నట్లు టిడిపిలోని ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.
2019 ఎన్నికల్లో టిడిపి అధికారం కోల్పోయిన తర్వాత ఐదేళ్లపాటు అనేక కష్టాలు పడ్డాం. ఇబ్బందులను ఎదుర్కొన్నాం. మా పనులు చక్కదిద్దే అవకాశం లేకుండా పోయింది. అని పాత రోజులను టిడిపి సీనియర్ నాయకులు గుర్తుచేసుకుంటూ తీవ్రంగా కలత చెందారు.
2024 ఎన్నికల్లో పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఇక కష్టాలు తీరుతాయని భావిస్తే, పట్టించుకునే వారు లేకుండా పోతున్నారని టిడిపి సీనియర్ నాయకులు బహిరంగంగానే స్వరం వినిపించారు.
కుప్పం నియోజకవర్గంలో సీనియర్ల వల్ల సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందనేది నాయకుల మనసులోని మాట. దీనిపై రామకుప్పం పార్టీ అధ్యక్షుడు ఆనందరెడ్డి బహిరంగంగానే స్వరం వినిపించారు. సీనియర్ నేతలపై కూడా ఆయన మండిపడ్డారు.
రామకుప్పం మండలంలో మంగళవారం జరిగిన టిడిపి సర్వసభ్య సమావేశం, బుధవారం జరిగిన మరో కార్యక్రమంలో కూడా పార్టీలోని ఎస్సీ, బీసీ విభాగాల జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు గట్టిగానే స్వరం వినిపించారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు ఆనందరెడ్డితో పాటు ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునస్వామి, బీసీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి పట్రా నారాయణ, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి జయశంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కష్టాలు తీరుతాయనుకుంటే...
"వైసిపి పాలనలో ఎన్నో అవమానాలు కష్టాలు పడ్డాం. చంద్రబాబు సీఎం కాగానే కష్టాలు తీరుతాయని భావించాం. కుప్పంలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది" అని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో అధికారుల పాలనే సాగుతోంది. సమస్యలపై విన్నవిస్తే ఆ కాగితాలు పక్కనపెట్టి ప్రజలు నాయకులను పదేపదే తిప్పుకుంటున్నారని కూడా వారు ఆవేదన చెందారు. దీంతో సమావేశంలో ఉన్న టిడిపి రామకుప్పం మండల అధ్యక్షుడు ఆనంద రెడ్డి వెంటనే స్పందించారు. టిడిపి సీనియర్ నాయకుడు ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి సురేష్ సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి దుర్గాప్రసాద్ దృష్టికి తీసుకురావడంతో వారు పరిస్థితి చక్కదిద్దడానికి విపలయత్నం చేశారు.
కుప్పంలో గతం లో ఎప్పుడూ ఈ తరహా సమస్యలు ఎదురు కాలేదు. తాజా పరిణామాలతో కుప్పంలోని సీనియర్ టిడిపి నాయకులు కూడా కలవరానికి గురయ్యారు. అసంతృప్తితో ఉన్న నాయకులను బుజ్జగించడం ద్వారా పరిస్థితిని చెక్క దించడానికి సీనియర్లు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారాలపై నామినేటెడ్ పదవుల్లో ఉన్న టిడిపి నాయకులు నియోజకవర్గంలోని ప్రత్యేక అధికారులు, మండలం నాయకులతో సమన్వయం చేసి, నష్ట నివారణ చర్యలకు రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు.
బాబు దృష్టికి అసంతృప్తి ?
కుప్పంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు సీఎం చంద్రబాబు దృష్టికి కూడా ఏ పార్టీకే వెళ్లాయని తెలిసింది. తన నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలపై సీఎం కూడా సీరియస్ గానే పరిగణించినట్లు సమాచారం. పార్టీ కోసం పనిచేసే నాయకులు, అధికారుల మధ్య సమన్వయం తీసుకురావడం ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ జరిగిన విధంగా చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం చంద్రబాబు రానున్న రోజుల్లో ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే.