Imtiaz ahmad Retired ias

కర్నూలు నుంచి మాజీ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ అహ్మద్‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఈమేరకు ఆయన ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.


కర్నూలు నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల రంగంలోకి మాజీ ఐఏఎస్‌ అధికారి దిగనున్నారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా హఫీజ్‌ఖాన్‌ ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నిర్వహించిన సరేల్లో ఆయనకు అంత అనుకూలంగా లేనట్లు రిపోర్టులు రావడంతో ఒక మంచి అభ్యర్థిని రంగంలోకి దించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆలోచించారు. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన ఇంతియాజ్‌ అహ్మద్‌ మంచి ఐఏఎస్‌ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేసి పలువురి మన్ననలు పొందారు.

సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన అధికారి
సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ అహ్మద్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనియాంశమైంది. పైగా పార్టీలు దూకుడు పెంచుతూ పోటాపోటీగా అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ప్రజాక్షేత్రంలోకి రావడం ఖాయమైంది. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితమైన అధికారిగా ఉన్న ఇంతియాజ్‌కు మైనార్టీ వర్గాల్లో మంచి పేరుంది. ప్రస్తుతం ఆయన సెర్ప్‌ సీఈవోగా, సీసీఎల్‌ఏ అదనపు కమిషనర్‌ గా, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


మైనార్టీ కోటాలో సీటు
వచ్చే ఎన్నికల్లో ఆయనకు మైనారిటీల కోటా కింద సీటు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. ఇంతియాజ్‌ సతీమణి కర్నూలు వాసి. ఇంతియాజ్‌ మామ ఐదు రూపాయల డాక్టర్‌గా కర్నూలు నగరంలో అందరికీ సుపరిచితులు. ఇంతియాజ్‌ కు ఐఏఎస్‌ అధికారిగా చేసిన అనుభవం, మైనార్టీ వర్గాల్లో ఉన్న విశేష ఆదరణ, ఆయన మామకు కర్నూలు నగరంలో మంచి పేరు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని సీఎం భావించారు. ఇంతియాజ్‌ అహ్మద్‌ ఏక్షణమైనా వైఎస్సార్‌సీపీలో చేరినట్లు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్‌ ఇంతియాజ్‌ను పిలిచి కర్నూల్‌ సిటీ నుంచి పోటీకి సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు తెలిసింది.
వాలంటరీ రిటైర్డ్‌ మెంట్‌కు ప్రభుత్వం ఆమోదం
వాలంటరీ రిటైర్డ్‌మెంట్‌కు మంగళవారం ఇంతియాజ్‌ దరఖాస్తు చేశారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఇంతియాజ్‌ దరఖాస్తును పరిశీలించి వాలంటరీ రిటైర్డ్‌మెంట్‌కు అనుమతిస్తూ జీవో ఆర్టీ నెంబరు 477ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. దీంతో ఎన్నికల రంగంలోకి దూకుతున్నట్లు స్పష్టమైంది. ముఖ్యమంత్రి ఎప్పుడు పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించాలంటే ఆరోజు ప్రకటించేందుకు నిర్ణయించారు.
Next Story