తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ప్రాంతంలోని భూములకు గిరాకీ పెరిగింది.


ఆంధ్రప్రదేశ్‌లో క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌ మెంట్‌ అధారిటీ (సీఆర్‌డీఏ) పరిధిలోని అమరావతి ప్రాంత భూములకు గిరాకీ పెరిగింది. రియల్‌ ఎస్టేట్‌ రంగం ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నిద్రావస్తలో ఉంది. నూతన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజదానిగా ఉంటుందని ప్రకటించినందున తిరిగి రియల్‌ ఎస్టేట్‌ రంగం ఊపందుకుంది. ఐదేళ్ల నుంచి విజయవాడ–గుంటూరు మధ్య పలు అపార్ట్‌మెంట్స్‌ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఆగిపోయి దర్శనమిస్తున్నాయి. అంటే దాదాపు 60 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టులన్నీ 2019లో ప్రభుత్వం మారటంతో అలాగే ఉండిపోయాయి. 15 నుంచి 20 అంతస్తుల ఎత్తులో నిర్మించిన అపార్ట్‌మెంట్స్‌ ఐదేళ్లుగా జాతీయ రహదారికి ఇరువైపుల దర్శన మిస్తూ కనిపిస్తున్నాయి.

మంగళగిరి పరిధిలోని రాష్ట్ర పోలీసు కార్యాలయాన్ని ఆనుకుని నిర్మించిన మిడ్‌వ్యాలీ సిటీ (ఎల్‌ఈపీఎల్‌ వారు నిర్మించిన) ప్లాట్లు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అమ్ముడు పోయాయి. ఇక్కడ 20 అంతస్తుల వరకు పాట్లు నిర్మించారు. త్రిబుల్‌ బెడ్‌రూమ్స్, డబల్‌ బెడ్‌ రూమ్స్‌ నిర్మించారు. ఒక్కో ప్లాట్‌ అప్పట్లో కోటి రూపాయల వరకు చెల్లించి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ ప్లాట్లు కోటిన్నర వరకు పలుకుతున్నాయి. ఆ తరువాత నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా లింగమనేని ఎస్టేట్స్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ (ఎల్‌ఈపీఎల్‌) వారు గతంలో నిర్మించిన రెయిన్‌ ట్రీ పార్కులో మరికొన్ని టవర్స్‌ నిర్మించారు. వెనుక వైపున విల్లాలు కూడా నిర్మించారు. ఈ ప్లాట్లలో ఎక్కువ మంది ఉద్యోగులు, మంత్రులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ సలహా దారులు అద్దెలకు కొందరు ఉండగా, కొనుగోలు చేసిన వారు కొందరు ఉన్నారు. ఇవి కాకుండా నాగార్జున యూనివర్శిటీని ఆనుకుని ఉన్న టోల్‌గేట్‌ (కాజా టోల్‌ ప్లాజా) వద్ద 2014లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పలు అపార్టుమెంట్స్‌ నిర్మాణాలు చేపట్టారు. అందులో రామకృష్ణ వెంచర్‌ ఒకటి. సుమారు వెయ్యి వరకు ప్లాట్లు నిర్మించారు. 70 శాతం పనులు పూర్తయినా కొనుగోలు చేసే వారు ముందుకు రాకపోవడంతో ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి. టోల్‌ ప్లాజాకు ఇరువైపుల వేల సంఖ్యలో అపార్ట్‌మెంట్స్‌ ప్లాట్లు నిర్మించి ఖాళీగా ఉన్నాయి. తిరిగి రెండు రోజుల క్రితం నుంచి పనులు మొదలు పెట్టారు.

అమరావతి ప్రాంతంలో ఆకాశంలో భూముల ధరలు
సీఆర్‌డిఏ ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్లాట్లకు ఆనుకుని ఉన్న భూముల ధరలకు రెక్కలోచ్చాయి. ఎకరా భూమి రెండు కోట్ల వరకు పలుకుతోంది. ప్రస్తుత ధర ఇలా ఉంటే రానురాను ఈ ధర ఐదు కోట్ల వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం 33 వేల ఎకరాల ప్రైవేట్‌ భూములను ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతి కింద ఇప్పటికే సేకరించింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయిన తరువాత అమరావతి ప్రాంతం చెదలు పట్టింది. అప్పట్లో హైవేను కలుపుతూ నాలుగు లైన్లు, రెండు లైన్ల రహదారులు నిర్మించడం మొదలు పెట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటికే పలు ప్రాజెక్టులకు తెలుగుదేశం ప్రభుత్వం శంకుస్థాపనలు, పౌండేషన్‌లు వేయడంతో పాలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు క్వార్టర్లు అప్పటి ప్రభుత్వం నిర్మించింది. భవనాలు దాదాపు 80 శాతం పూర్తయినప్పటికీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా వదిలి వేసింది. దీంతో ఈ ప్రాంతాలన్నీ పిచ్చి చెట్లు మొలిచాయి. రహదారులు కూడా పనికిరాకుండా పోయాయి. రహదారులు, ఇతర నిర్మాణాల కోసం తీసుకొచ్చిన మెటీరియల్‌ చెదలు పట్టింది. ఈ తరుణంలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో సీఆర్‌డిఏ పరిధిలోని పూర్వపు పనులు వేగం పుంజుకున్నాయి. 2014 నుంచి 2019లోపు తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన ప్రాంతాల్లో పెరిగిన పిచ్చిచెట్లు, తొలగించే కార్యక్రమాన్ని సీఆర్‌డీఏ రెండు రోజులుగా చేపట్టింది. సుమారు 70 ప్రొక్లయిన్లతో చెత్తను తొలగించే పనులు వేగంగా అమరావతితో మొదలయ్యాయి.
అమరావతికి జీవం
సీఆర్‌డీఏ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో పనులు సీఆర్‌డీఏ చేపట్టడం, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతికి మళ్లీ జీవం పోసినట్లైంది. రహదారులు శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఎప్పుడైతే చేపట్టారో సీఆర్‌డీఏకు అవతలివైపు ఉన్న రోడ్డుకు దగ్గరలోని భూములు కోట్లలో పలుకు తున్నాయి. ప్రస్తుతం గజం స్థలం రూ. 35 వేల నుంచి 40వేలకు ధర పలుకుతోంది. అయినా భూ యజమానులు రియల్‌ వ్యాపారులకు అమ్మేందుకు ముందుకు రావడం లేదు. రాజధాని ప్రాంతంలో డబ్బులు చేతపట్టుకుని తిరుగుతున్నా అమ్మే వారు ముందుకు రావడం లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సెక్రటేరియట్‌కు రావడం మొదలు పెట్టిన తరువాత భూములు అమ్మాలనే ఆలోచనలో భూ యజమానులు ఉన్నారు. అప్పుడు గజం లక్ష రూపాయల వరకు విక్రయించే అవకాశం ఉందని రియల్‌ వ్యాపారులు చెబుతున్నారు. ఈలోపు బేరాలు జరుగుతున్నయే కాని కొనుగోళ్లు జరగటం లేదు.
అమరాతి ప్రాంతంలో భూముల కొనుగోళ్లకు సంబంధించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి గుంటక నరేష్‌ రెడ్డి మాట్లాడుతూ రైతులు అమ్మేందుకు ముందుకు వస్తున్నారని, అయితే ధర మరింత పెరిగే అవకాశం ఉందని భావించి ఆలస్యం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం గజం రూ. 40 వేలు చెల్లించి కొనుగోలు చేసేందుకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సిద్ధంగా ఉన్నారన్నారు. అయినా రైతులు ముందుకు రావడం లేదని చెప్పారు. విజయవాడ నుంచి గుంటూరు మధ్య నిర్మించిన అపార్టుమెంట్లు ఈ ఐదేళ్ల నుంచి కొనుగోలు చేసే వారు లేక అలాగే ఉండిపోయాయని, ఈ అపార్టుమెంట్లకు ఇప్పుడు గిరాకీ పెరిగిందన్నారు. చదరపు అడుగు ఆరున్నర నుంచి ఏడున్నర వేల వరకు కొనుగోలు చేసేందుకు పలువురు కొనుగోలు దారులు ముందుకు వస్తున్నారన్నారు. అంటే 2000 చదరపు అడుగుల ప్లాట్లు కోటిన్నర నుంచి కోటి 70 లక్షల వరకు పలుకుతున్నట్లు చెప్పారు. తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో ఎక్కువ అపార్టుమెంట్ల నిర్మాణం జరిగింది. విజయవాడ నగరంలోనూ పలు చోట్ల పాట్ల నిర్మాణాలు జరిగాయి. అవి కూడా ఒక్కో ప్లాటు కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు పలుకుతున్నయి.
స్క్రూబ్రిడ్జి వద్ద నుంచి రామలింగేశ్వర నగర్‌ వెళ్లే ఎంట్రన్స్‌లో 150 ప్లాట్లతో నిర్మించిన త్రి బెడ్‌రూమ్స్‌ అపార్ట్‌మెంట్‌ (2,000 చదరపు అడుగులు) కోటిన్నర వరకు పలుకుతోంది. ఈ అపార్ట్‌మెంట్‌ నిర్మాణం 2019లో కరోనా సందర్బంగా పునాదులు వేసి ఆ తరువాత ఆపివేశారు. తిరిగి రెండేళ్ల క్రితం మొదలు పెట్టి నేటికి పూర్తి చేశారు. అయితే ఫినిషింగ్‌ ఇవ్వకుండానే ప్లాట్లు విక్రయిస్తున్నారు.
Next Story