ఆంధ్రలో ఆఖరి రోజు ప్రచారాల షెడ్యూల్ ఇలా..
x

ఆంధ్రలో ఆఖరి రోజు ప్రచారాల షెడ్యూల్ ఇలా..

ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజుతో ఎన్నికల ప్రచార ఘట్టానికి తెరపడనుంది. సోమవారం పోలింగ్ జరగనున్న సందర్భంగా ప్రతి పార్టీ నేటితో తమ ప్రచారాన్ని ముగించనుంది.


ఆంధ్రలో ఈరోజులో ఎన్నికల ప్రచారాలు ముగియనున్నాయి. సోమవారం అంటే మే 13న పోలింగ్ జరగనున్న సందర్బంగా ప్రతి పార్టీ నేటితో ప్రచారాలను పరిసామప్తం చేయనున్నాయి. దీంతో ఈరోజు సభలు, రోడ్‌లో అన్నీ కూడా ప్రజలపై అధిక ప్రభావం చూపేలా ఆయా పార్టీలు ప్లాన్ చేసుకుంటున్నాయి. అందుకోసమే నేతలు కూడా బలమైన ప్రసంగాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆఖరి రోజున ప్రజలతో మరింత మమేకమయ్యేలా రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పార్టీల ప్రచారాల షెడ్యూల్ ఈరోజు ఎలా ఉందంటే..

సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు నరసరావు పేట పార్లమెంటు పరిధిలోని చిలకలూరిపేట కళామందిర్ సెంటర్‌లో తొలి సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని తాలూకా కార్యాలయం సెంటర్‌లో రెండో సభ, మధ్యాహ్నం 3 గంటలకు పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ బస్‌స్టాండ్ సెంటర్‌లో మూడవ, ఈఎన్నికల ప్రచారాల్లో ఆఖరి సభను నిర్వహించనున్నారు వైఎస్ జగన్.

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రెండు నియోజకవర్గాల్లో ప్రచార సభలు నిర్వహించనున్నారు. చిత్తూరు, నంద్యాలలో పర్యటించి అక్కడి ప్రజలకు టీడీపీ భరోసా కల్పించనున్నారు. చిత్తూరు, నంద్యాల నియోజకవర్గాల్లో ‘ప్రజాగళం’ సభలను నిర్వహించి.. ప్రచారం అనంతరం ఆయన రాత్రి 7 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటివరకు చంద్రబాబు 88 నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈరోజు పర్యటిస్తున్న రెండు నియోజకవర్గాలతో కలుపుకుని ఆయన 90 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం పూర్తి చేయనున్నారు. ప్రచారం ప్రారంభం నుంచి ఆయన రోజుకు మూడు నుంచి ఐదు సభలు నిర్వహించారు.

ఎన్నికల ప్రచార ఆఖరి రోజున ప్రచారంలో బీజేపీ తరపున పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు. ఎన్‌డీఏ కూటమి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేయనున్నారు. ఉదయం 9 గంటలకు ఆయన తిరుపతిలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం నుంచి నాలుక్కాళ్ల మండపం వరకు రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈ రోడ్‌షోలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుతో కూటమి పార్టీల కీలక నేతలు పాల్గొననున్నారు.

అదే విధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈరోజు ఆంధ్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయన ఉదయం 11:30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి 12:00 గంటలకు రాహుల్ గాంధీ, షర్మిల కలిసి హెలికాప్టర్‌లో ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాటుకు చేరుకోనున్నారు. అక్కడ దివంగత సీఎం వైఎస్ఆర్‌కు వారు నివాళులు అర్పించి మధ్యాహ్నం 12:25 గంటలకు తిరిగి కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటల నుంచి 1:45 వరకు వారు కడపలో నిర్వహించి భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. సభ పూర్తయి తర్వాత మధ్యాహ్నం 2:15 గంటలకు రాహుల్ గాంధీ తిరిగి బయలుదేరనున్నారు.

జనసేనాని పవన్ కల్యాణ్ ఈరోజు కాకినాడ అర్బల్ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. అక్కడే రోడ్‌షో నిర్వహించి అనంతరం ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగిస్తారు. ఈ సమావేశంతో తన ఎన్నికల ప్రచారానికి పవన్ స్వస్థి పలకనున్నారు.

Read More
Next Story