శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులకు ఇకపై కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఉన్న వారంతా కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండక తప్పదు. కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉన్న వారికి ఇబ్బంది లేదు. లేదంటే తన పీఎస్‌లపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆధార పడాల్సిందే. ఎందుకు ఇలా అనుకుంటున్నారా... అదేంటో ఒకసారి చూద్దాం.
ఈ–విధాన్ అప్లికేషన్‌లోకి శాసన సభ, మండలి..
కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఈ– విధాన్ అప్లికేషన్‌ను రూపొందించింది. దేశంలోని ఈ అప్లికేషన్‌ను ఏ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి అయినా ఉపయోగగించుకోవచ్చు. అయితే ఇందుకు ఒక విధానం ఉంది. ఈ విధానాన్ని అనుసరించాలి. కేంద్రం నుంచి ఈ–విధాన్ అప్లికేషన్‌ను ఉపయోగించుకోవాలని కోరితే ఇష్టం ఉంటే ఉపయోగించుకోవచ్చు. లేదంటే వద్దని చెప్పొచ్చు. బలవంతమేమీ లేదు. అయితే ప్రస్తుత యుగం కంప్యూటర్ యుగాంగా చెప్పొచ్చు. అందుకని కంప్యూటర్ ద్వారా జరిగే ప్రతి పనినీ ఉపయోగించుకోవడమే మంచిదని ప్రభుత్వం భావించింది. ఆన్‌లైన్ ద్వారా ప్రతి సమాచారం తెప్పించుకోవడం, పంపించడం ఇకపై ఎమ్మెల్యేలు చేయాల్సి ఉంటుంది. ఈ విధానం మంచిదనే ప్రశంసలు కొందరి నుంచి వస్తుంటే ఇటువంటి విధానం ద్వారా కంప్యూటర్ నాలెడ్జ్ లేని వారికి ఉపయోగం ఏమిటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.
సభ్యులకు ట్యాబ్‌లు
శాసన సభ, మండలి సభ్యులకు ప్రభుత్వం ట్యాబ్‌లు అందజేస్తుంది. డిజిటల్ యుగంలోకి అడుగు పెట్టిన తరుణంలో ప్రతి ఎమ్మెల్యే వద్ద చేతిలో ల్యాప్‌టాప్ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ట్యాబ్‌లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ట్యాబ్‌ల ద్వారా ఏదైనా అసెంబ్లీ, శాసన మండలికి సంబంధించిన అంశాలు తెలుసుకునే వీలు కలుగుతుంది. ప్రశ్నోత్తరాల సమయానికి నోటీసులు ఇవ్వడం, రకరకాల పత్రాలు సమర్పించడం, సభ్యుల నుంచి నోటీసులు స్వీకరించడం, బిల్లులు ప్రవేశపెట్టడం, కమిటీల నివేదికలు సమర్పించడం, బులిటెన్‌లు జారీ చేయడం వంటివన్నీ ఇకపై డిజిటల్ రూపంలోనే జరుగుతాయి. సెక్రటరీ జనరల్ తోనూ, మంత్రులైతే తమ శాఖల కార్యదర్శులతోనూ చాటింగ్ ద్వారా ఆదేశాలు ఇవ్వవచ్చు. ఈ అప్లికేషన్‌ను ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల్లో వాడుకోవచ్చు. సభ్యులు ఎప్పుడైనా తమ నోటీసులు సెక్రటరీ జనరల్‌కు పంపొచ్చు. వాటిని శాసన సభ స్పీకర్, శాసన మండలి చైర్మన్‌కు సెక్రటరీ జనరల్ పంపొచ్చు. ఒకే రకమైన ప్రశ్నను చట్ట సభల్లో ఒకరికంటే ఎక్కువ మంది అడిగితే అందరి పేర్లను ఒకే ప్రశ్న వద్ద చేర్చి సమాధానం ఒకటిగా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.
కంప్యూటర్ శిక్షణ అవసరం
ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులకు కంప్యూటర్ శిక్షణ తప్పనిసరిగా అవసరం ఉంటుంది. ప్రస్తుత ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యుల్లో చాలా మంది బిటెక్ పూర్తి చేసిన వారు ఉన్నారు. ఇటీవల కాలంలో బిటెక్ చదివిన వారైతే పరవాలేదు. పదేళ్లకు ముందు చదువు పూర్తి చేసిన వారైతే మారిన పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారు ఈ అప్లికేషన్‌ను ఈజీగా హ్యాండిల్ చేసేందుకు వీలుంటుంది. అప్లికేషన్ ఎలా పనిచేస్తుందో కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారికి శిక్షణ ఇస్తే సరిపోతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ లేని వారికి కంప్యూటర్‌పై అవగాహన కల్పించడంతో పాటు యాప్‌పై శిక్షణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. త్వరలోనే శిక్షణపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉంది.
ఏపీతో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌తో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శి ఉమంగ్ నరులా సమక్షంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సత్యప్రకాశ్‌లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పంద సమయంలో వారితో పాటు శాసన మండలి చైర్మన్ మోసేనురాజు, శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజులు ఉన్నారు.
Next Story