జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న జరుపుకుంటారు. వినియోగదారుల హక్కుల చట్టం 1986లో ఇదే రోజున ఆమోదం పొందింది.
వినియోగదారుల రక్షణ చట్టాన్ని 1986 డిసెంబర్ 24న భారత పార్లమెంటు ఆమోదించింది. ఈ చట్టం వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, వారికి న్యాయమైన మార్కెట్ ను అందించడం లక్ష్యంగా రూపొందించారు. ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత, వినియోగదారుల హక్కుల గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదిక ఏర్పడింది. అందుకే, డిసెంబర్ 24ను జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకోవడం మొదలైంది.
వినియోగ దారుల చట్టం ప్రాముఖ్యత
వినియోగదారులకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించడానికి ఒక ముఖ్యమైన వేదిక. వ్యాపారస్తులు, ఉత్పత్తిదారులు వినియోగదారుల హక్కులను గౌరవించాలని గుర్తు చేయడం. వినియోగదారులు మోసపోకుండా న్యాయమైన ధరలకు వస్తువులు, సేవలను పొందేలా చూడటం. వినియోగదారుల సమస్యలను పరిష్కరించడానికి, వారికి న్యాయం చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం.
వినియోగదారుల హక్కులు:
భద్రతా హక్కు (Right to Safety): హానికరమైన వస్తువులు, సేవలనుంచి రక్షణ పొందే హక్కు.
సమాచార హక్కు (Right to be Informed): వస్తువులు, సేవల గురించి సరైన సమాచారం పొందే హక్కు, తద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు.
ఎంపిక హక్కు (Right to Choose): పోటీ ధరలలో వివిధ రకాల వస్తువులు, సేవలను ఎంచుకునే హక్కు.
వినిపించే హక్కు (Right to be Heard): వినియోగదారుల సమస్యలను వినే, పరిష్కరించే హక్కు.
పరిహార హక్కు (Right to Seek Redressal): మోసం లేదా నష్టం జరిగినప్పుడు పరిహారం పొందే హక్కు.
వినియోగదారుల విద్య హక్కు (Right to Consumer Education): వినియోగదారుల హక్కులు, బాధ్యతల గురించి తెలుసుకునే హక్కు.
ఎక్కడ కొన్నా.. కంప్లయింట్ మీ జిల్లాలోనే..
సాంకేతికత పెరగడంతో డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు, టెలి మార్కెటింగ్ వంటివి కొనుగోలు రంగంలో అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం పాత చట్టం స్థానంలో 2019లో కొత్త రక్షణ చట్టం రూపొందించింది. 2020 జులై 20 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
ఈ కొత్త చట్టంలో ఈ కామర్స్ నిబంధనలు తీసుకురావడంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది. వినియోగదారుల హక్కులు, ఆ హక్కులకు భంగం కలిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలి? నష్టపోతే పరిహారం ఎలా పొందాలి వంటి విషయాలను నిపుణులు ఇలా వివరించారు.
లాయర్ అవసరం లేకుండా నేరుగా వినియోగదారుడే ఫిర్యాదు చేయొచ్చు. జిల్లా స్థాయిలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కమిషన్ ఉంటుంది. వస్తు సేవల్లో లోపాలు జరిగితే ఈ కమిషన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. న్యాయవాది సాయం లేకుండా నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. రూ.5 లక్షలు విలువైన వస్తుసేవల వరకు సంబంధించిన కేసులలో కోర్టుకు ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదు. చట్ట ప్రకారం కేసు నమోదైన 120 రోజుల్లోపు తీర్పులు వెలువడుతాయి. జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పుపై అసంతప్తి ఉంటే రాష్ట్ర కమిషన్‌లో ఫిర్యాదు చేయొచ్చు.
వస్తువు ఎక్కడ కొన్నా సొంత జిల్లాలో ఫిర్యాదు చేయొచ్చు. దేశంలో ఎక్కడ వస్తువు కొన్నా, ఎక్కడ సేవా లోపం ఉన్నా ఆ వినియోగదారుడు నివసించే చోట అయినా, లేదా ఉద్యోగం చేసే జిల్లా అయినా కమిషన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. రూ.50 లక్షల విలువైన వస్తు సేవలకు సంబంధించిన కేసుల వరకు జిల్లా స్థాయిలో విచారిస్తారు. రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకూ విలువ చేసే కేసులను రాష్ట్ర కమిషన్‌లో విచారిస్తారు. రూ. 2 కోట్ల విలువ కన్నా పైన ఉంటే జాతీయ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాలి. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడానికి యాప్ సౌకర్యం ఉంది. వెబ్‌సైట్ బాధితులు ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేసుకునేందుకు ఈ-దాఖిల్ ((https://edaakhil.nic.in) అనే వెబ్‌సైట్/యాప్ అందుబాటులో ఉంది. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ ( ఎన్‌సీహెచ్) మొబైల్ యాప్‌లో కూడా బాధితులు ఫిర్యాదు చేయొచ్చని సంబంధిత నిపుణులు చెప్తున్నారు.
ఫోన్ ద్వరా ఫిర్యాదు..
ఫోన్‌లో కూడా ఫిర్యాదు చేయొచ్చు. అదెలా అంటే.. 1915, 1800114000 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి, సమస్య చెబితే వారు జిల్లా స్థాయి కమిషన్‌కు తెలియజేస్తారు. వస్తువు కొనేటప్పుడు బిల్లు, ఆన్‌లైన్ పేమెంట్ చేసిన తర్వాత ఇన్‌వాయిస్‌లను, ఐడీలను భద్రపరుచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫిర్యాదు సమయంలో వాటిని సమర్పించాల్సి ఉంటుంది. వినియోగదారుల కమిషన్ పరిధిలోకి ప్రభుత్వ శాఖలు కూడా వస్తాయి. ఉదాహరణకు రైలు టిక్కెట్లు రద్దు చేసుకుంటే సంబంధిత డబ్బులు అకౌంట్‌లో పడకపోయినా ఫిర్యాదు చేయొచ్చని నిపుణులు చెప్తున్న మాట.
వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు
ఎమ్మార్పీ(MRP) కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవా లోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందు కోసం ‘వాట్సప్ చాట్‌బాట్’ సేవలను తీసుకొచ్చింది.
వాట్సప్ నంబర్ 88000 01915 లో మొదట హాయ్ అని టైప్ చేయాలి. అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు నమోదవుతుంది. అనంతరం కేసు పరిష్కారం కోసం ఈ వివరాలు ఆయా జిల్లా వినియోగదారుల కమిషన్‌కు పంపుతారు.
కేసు పరిష్కారం అయ్యే వరకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. దీంతో పాటు 1800114000 లేదా 1915 నంబర్‌కు కాల్ చేసి (ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు) ఫిర్యాదు చేయొచ్చు. ప్రతి రోజూ వేల ఫిర్యాదులు నమోదవుతుండగా, అందులో పరిష్కారమైన కేసులకు సంబంధించిన వివరాలను కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ https:/consumerhelpline.gov.in/ వెబ్‌సైట్‌లో ఎన్‌సీహెచ్ సక్సెస్ స్టోరీస్ పేరుతో పొందుపరుస్తోంది.
మన ముందున్న లక్ష్యాలు
వినియోగదారుల హక్కుల గురించి విస్తృత ప్రచారం చేయడం. వినియోగదారుల సమస్యలను త్వరగా, సమర్థవంతంగా పరిష్కరించడానికి వ్యవస్థలను మెరుగుపరచడం. వ్యాపారులు న్యాయమైన వ్యాపార పద్ధతులను అవలంబించేలా ప్రోత్సహించడం. వినియోగదారుల ఉద్యమాన్ని బలోపేతం చేయడం.
జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం అనేది వినియోగదారులకు తమ హక్కుల గురించి తెలుసుకోవడానికి, వాటిని వినియోగించుకోవడానికి ఒక ముఖ్యమైన రోజు. ప్రతి ఒక్కరూ తమ హక్కుల గురించి తెలుసుకోవాలి. మోసపూరిత వ్యాపార పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడాలి. అప్పుడే ఒక న్యాయమైన, ఆరోగ్యకరమైన మార్కెట్ వ్యవస్థను నిర్మించగలం.