రాజశేఖర్‌రెడ్డి బిడ్డ కాకుంటే బాపట్ల నుంచి బయటకు పోయేది కాదు, అంటూ బాపట్ల వైఎస్సార్‌సీపీ వారు చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్‌ షర్మిల సవాల్‌ విసిరారు


ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సవాల్‌ విసిరారు. ఎవడొస్తాడో.. ఎంత వస్తారో రండి అంటూ నిప్పులు చెరిగారు. రాజశేఖర్‌రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి బయటకు వెళ్లారు. లేకుంటే ఏమి జరిగి ఉండేదో చూసేవాళ్లు అంటూ బాపట్ల వైఎస్సార్‌సీపీ వారు చేసిన వ్యాఖ్యలకు ఆమె సరైన సమాధానం ఇచ్చారు. ఆమె అన్న మాటలు ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అందరినీ ఆలోచింప జేస్తున్నాయి. నగరిలో జరిగిన సభలో ఆమె బాపట్ల పార్టీ, వైఎస్సార్‌ సీపీ వారికి సవాల్‌ విసిరిన తీరు పలువురిని ఆశ్చర్య పరుస్తోంది.

మొన్న బాపట్లలో సభ పెట్టి వస్తే రాజశేఖర్‌రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి బయటకు రానిచ్చారట. ఒక్క నిమిషం రాజశేఖర్‌రెడ్డి బిడ్డను కాదనుకుందాం.. రండి ఎవడొస్తాడో చూద్దాం.. ఎంత మంది వస్తారో చూద్దాం.. అప్పుడు మీ దమ్ము ఏంటో చూపండి, ఎవరేంటో చూసుకుందాం సిగ్గుండాలి కదా.. రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టుకుని, ఆయన ఆశయాలకోనిలబడ్డానని చెప్పుకుంటూ ఇంత దిగజారుతారా? ఆడా, మగా తేడా లేదు. ఉచ్చం నీచం అని తేడా లేదు. ఐదు సంవత్సరాల్లో అన్ని మాటలూ తప్పారు. రాజశేఖర్‌రెడ్డి సంక్షేమ పాలనకు, జగనన్న పాలనకూ నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది అంటూ విరుచుకు పడ్డారు.
మీ మాటలు మీ అహంకారాన్ని చూపుతున్నాయి
ప్రతి మాటా తప్పారు. ఇప్పుడు నేను మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెలు అన్న ఇంగితం లేదు. మీ మాటలు మీ అహంకారాన్ని చూపిస్తున్నాయి. వైఎస్సార్‌ సీపీ మొక్కగా ఉన్నప్పుడు కాపాడింది నేను, నేను ఆంధ్రరాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఇక్కడ పోరాడుతున్నా. మీకు చేతనైతే ప్రత్యేక హోదా తెండి, పోలవరం తెండి. రాజధాని తెండి. ఇవేమీ చేతకాలేదు కానీ ఆడబిడ్డను పట్టుకుని నన్ను, నావాళ్లను, నా కుటుంబాన్ని, నా మనుషుల్ని ఆడపడుచులని చూడకుండా సొంత చెల్లెలన్న ఇంగితం లేకుండా సోషల్‌ మీడియాలో మమ్మల్ని అవమానిస్తారా? మళ్లీ చెబుతున్నా ఇలాంటి నియంతలు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం అన్నది బతకదు. ఆంధ్రరాష్ట్ర ప్రజల హక్కులు సాధించే వరకు రాజశేఖర్‌రెడ్డి బిడ్డ మనసు పెట్టి పోరాటం చేస్తుందని మాటిస్తున్నా.
అన్న ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన చెల్లెలు
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం అహర్నిశలు కృషి చేసింది వైఎస్సార్‌ మాత్రమే. ఆయన ఏ సాగునీటి ప్రాజెక్టులైతే బాగుచేసి ప్రజలకు సాగు, తాగునీరు అందిద్దామనుకున్నారో ఆ ప్రాజెక్టులు ఈరోజు అటకెక్కాయి. ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు సాగలేదు. వైఎస్సార్‌ ఆశయాలు సాధించడంలో జగనన్న పూర్తిగా విఫలమయ్యారు. అందుకే చెబుతున్నా నన్ను ప్రేమించినంతగా వైఎస్సార్‌ ఎవ్వరినీ ప్రేమించలేదు. అందుకే ఆయన ఆశయాలు సాధించేందుకే కాంగ్రెస్‌లో చేరా. నేటికీ వైఎస్సార్‌ను ప్రేమిస్తున్నది కాంగ్రెస్‌ మాత్రమే. కాంగ్రెస్‌ గెలిస్తే ఆయన ఆశయ సాధన జరుగుతుందని చెప్పుకొచ్చారు. జగన్‌ అన్న వైఎస్సార్‌ పథకాలకు నీళ్లొదిలారని విమర్శించారు.
వైఎస్సార్‌మీద అపారమైన గౌరవం ఉంది
కాంగ్రెస్‌ పార్టీకి ఈ రోజుకూ వైఎస్సార్‌మీద అపారమైన గౌరవం ఉందని, ఆ గౌరవం మా అన్న ప్రభుత్వంలోనే లేదని చెబుతూ వైఎస్సార్‌కు గౌరవం లేనిచోట ఒక్క క్షణం కూడా ఉండనని చెప్పడం విశేషం. అందుకే జగన్‌ ప్రభుత్వం నియంత పాలనలా ఉందని, ఆ ప్రభుత్వాన్ని ఎవ్వరూ గౌరవించాల్సిన అవసరం లేదని చెబుతున్నట్లు తన ప్రసంగాల్లో షర్మిల స్పష్టం చేశారు. షర్మిల రోజూ నీతులు చెబుతున్నదనుకుంటున్నారేమో నేను చెప్పేవి నీతులు కాదు. విభజన సమస్యల పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వాలు ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నిస్తున్నానన్నారు. అందుకే ఆమె ప్రసంగాలకు అంత క్రేజ్‌ వచ్చింది. కాంగ్రెస్‌ వారు వస్తే ముఖం చాటేసుకుని వెళ్ళిన ప్రజలు ఈరోజు ఆమెను సభల్లో నేరుగా ఆమెనే ప్రశ్నిస్తున్నారు. పైగా ఆమె సభలకు వేలాదిగా తరలి వస్తున్నారు. దీనిని బట్టి కాంగ్రెస్‌కు ఏపీలో పూర్వపు రోజులు రాబోతున్నాయని పలువురు వ్యాఖ్యానించడం విశేషం.
షర్మిల తాను చేస్తున్న ప్రసంగాల్లో అన్నను టార్గెట్‌ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒక సమయంలో మాత్రమే ప్రతిపక్షమైన టీడీపీని కూడా ప్రశ్నిస్తున్నాను. ఈ రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయనే విషయాన్ని ఆమె మాట్లాడిన ప్రతి చోటా విష్పష్టంగా చెబుతుండటం విశేషం. పైగా ఆమె చెబుతున్నదేమిటంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒక్క ఎంపీసీటు, ఎమ్మెల్యే సీటు గెలుచుకోకుండానే పాలన సాగిస్తున్నదని, ఇరు పార్టీల స్వార్థ రాజకీయ ప్రయోజనాలు ఇందులో ఉన్నాయనే విషయాన్ని ఆమె స్పష్టంగా చెబుతున్నారు.
మీ నాన్నను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన కాంగ్రెస్‌ పార్టీని మీరు ఎందుకు భుజాన వేసుకుని సాగుతున్నారని ఓ అభిమాని వేసిన ప్రశ్నకు ఆమె సుదీర్ఘమైన సమాధానం ఇచ్చారు. వైఎస్‌ఆర్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో నేను చేర్పించలేదు. నన్ను నమ్ము అంటూ సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ చెప్పిన మాటలు నేను నమ్మాను, అందుకే ఆమె మరో మాట కూడా చెప్పారు. రాజీవ్‌ గాంధీ హత్యకు గురైన తరువాత బోఫోర్స్‌ కుంభకోణంలో రాజీవ్‌ గాంధీ పేరును చేర్చిన ఘనత ఇండియా పోలీసులకు దక్కిందని చెప్పారని, అంతేకాని నేను ఎప్పుడూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని దూరం చేసుకోలేదని చెప్పడం నాకు బాగా నచ్చిందన్నారు.
Next Story