నేడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో సభలు.
ఇవ్వాల మనకు, టీచర్లకు ప్రభుత్వం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నది. కొన్ని స్కూళ్ల పిల్లల్ని ఒక చోటకు పిలిచి వారితో పాటు మనం, టీచర్లు ఉంటారట. ఈ రాష్ట్రంలో ఇటువంటి సమావేశం ఎప్పుడూ ఈ స్థాయిలో జరగలేదట. నేను మా పిల్లోడితో పోతున్నా నువ్వు కూడా వస్తున్నావా... ఇదీ ఇవ్వాల ప్రతి గ్రామం, పట్టణంలో ప్రతి ఇంట్లో మాట్లాడుకుంటున్న మాటలు. అందరూ రెడీ అయి తొమ్మిది గంటల కల్లా స్కూలు వద్దకు చేరుకుంటున్నారు. మన పిల్లల కోసం ఏవేవో చెబుతారట. విందాం. మనం కూడా కొన్ని సందేహాలు అడగాలి. లేకుంటే విన్నాం... వచ్చాం.. అంటే ఉపయోగం ఉండదని తల్లిదండ్రులు మాట్లాడుకోవడం విశేషం.
స్కూళ్లల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం అయితే మన పిల్లలు హ్యాపీగా చదువుకుంటారు. మంచి వాతావరణం స్కూల్లో ఉన్నప్పుడు చదువు కూడా పిల్లలకు అలాగే ఆడుతూ, పాడుతూ వస్తుంది. మానసిక ఉల్లాసం ఉంటే ఏదైనా పిల్లలు ఈజీగా నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంటి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశానికి ప్రజా ప్రతినిధులు కూడా వస్తున్నారు. ఇదే మంచి అవకాశం సమస్యలు ప్రస్తావించండి. పరిష్కారం వైపు అడుగులు వేయండి. మంచి అవకాశం. మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియదు.
శనివారం జరిగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ఎయిడెడ్, ప్రభుత్వ స్కూళ్ల నుంచి 35,84,621 మంది విద్యార్థినీ విద్యార్థులు, 71.60లక్షల మంది తల్లిదండ్రులు, 1,88,266 మంది ఉపాధ్యాయులు, 50 వేలకు పైగా ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. సమావేశాల్లో పలు అంశాలు చర్చకు వస్తాయి. బాపట్లలో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు.
1, ప్రతి తరగతికి గదులు ఉన్నాయా.. ఉంటే ఏలా ఉన్నాయి.. అందులో ప్రశాంతంగా కూర్చొనే అవకాశం ఉందా..
2. విద్యార్థులు అందరూ కూర్చోడానికి బెంచ్ లు ఉన్నాయా.. ఉంటే విరిగి పోకుండా పుస్తకాలు పెట్టుకునే అవకాశం ఉందా? బల్లల మేకులు గుచ్చుకోకుండా ఉన్నాయా?
3. ప్రాధమిక పాఠశాల లో ప్రతి తరగతి కి ఉపాధ్యాయులు ఉన్నారా? వారంతా సక్రమంగా స్కూలుకు వస్తున్నారా?
4. ఉన్నత పాఠశాల లో ఆరు సబ్జెక్టులకు ఉపాద్యాయులు ఉన్నారా...?
5. పిల్లలు పాఠాలు అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకుంటున్నారనేందుకు మీవద్ద వివరాలు ఉంటే తెలపండి.. ఒక వేళ పిల్లలు పాఠాలు అర్థం చేసుకోలేకపోతే ఎందుకు అలా జరుగుతోందనే వివరాలు అడగండి.
6. పిల్లలకు తెలుగు, ఇంగ్లీష్ చదవడం, రాయడం వచ్చా? ఒకవేళ వారికి రాకపోతే ఎందుకు రావడం లేదో కారణాలు తెలపాలని అడగండి.
7. బ్లాక్ బోర్డు లు బాగున్నాయా.. అక్షరాలు రాస్తే కనిపిస్తున్నాయా? పిల్లలను బోర్డులు తుడవాలని టీచర్లు పిలుస్తున్నారా?
8. మెనూ ప్రకారం, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారా? లేదా వారికి ఇష్టం వచ్చిన విధంగా వండి పెడుతున్నారా? కూరగాయలు మంచివేనా? ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? భోజనం తినడానికి బాగుందా? రుచి లేకుండా సప్పగా ఉంటుందా? బియ్యం బాగుంటున్నాయా? పురుగులు వస్తున్నాయా? ఆయాలు బియ్యం చెరుగుతున్నారా? లేకుంటే అలాగే నీళ్లలో వేసి కడిగి పెడుతున్నారా?
9. రాగి జావ, పప్పు చిక్కీ ఇస్తున్నారా..? ఏ టైములో ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో ఇంకా ఏమి పెడితే బాగుంటుందో తెలపండి.
10. పిల్లలకు ఇచ్చిన బ్యాగ్ లు, షూస్, యూనిఫారంలు బాగున్నాయా? క్లాత్ క్వాలిటీ ఉందో లేదో చెప్పండి.
11. పాఠశాలలో టాయిలెట్స్ వున్నాయా..?
12. స్కూళ్లో విద్యార్థుల సంఖ్య ను బట్టి ఆడ పిల్లలకు, మగ పిల్లలకు వేరు వేరుగా మరుగు దొడ్లు ఉన్నాయా? లేకుంటే వెంటనే ఏర్పాటు చేయాలని కోరండి.
13. మరుగు దొడ్లలో నీటి సదుపాయం, లైట్లు వున్నాయా? నీటి పైపులు వేశారా? బకెట్లతో తెచ్చుకోవాలా? బకెట్లతో తేవాలంటే ఆయాలు ఉన్నారా? పిల్లలే తెచ్చుకోవాలా?
14. రోజు లెట్రిన్ లు శుభ్రపరుస్తున్నారా? లేక అలాగే వదిలేస్తున్నారా? మురుగు వాసనతో ఉన్నాయా? ఉచ్చ కంపు కొడుతున్నాయా?
15. పాఠశాలలో తాగడానికి మంచి నీరు వుందా? పైపుల వద్ద గ్లాసులు ఉంచారా? లేదా? ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారా? పంచాయతీ నీరు నేరుగా బోరు నుంచి ఇస్తున్నారా?
16. పిల్లలు ఆడుకునేందుకు ఆ స్కూళ్లో ఆటస్థలం ఉందా? పిల్లలు రోజు ఆటలు ఆడుతున్నారా?
17. ఎటువంటి క్రీడా పరికరాలు ఉండాలి. అవి ఉన్నాయా లేదా? లేకుంటే ఎందుకు కొనుగోలు చేయలేదు?
18. డ్రిల్ మాస్టర్ ఉన్నారా? లేకుంటే ఎందుకు నియమించలేదు.
19. ఆటల పోటీలు నిర్వహిస్తున్నారా...? అంతర్జోన్ ఆటలు జరుగుతున్నాయా? జరగకపోతే ఎందుకు జరగటం లేదు?
20. యోగ నేర్పిస్తున్నారా..? నేర్పించకపోతే కారణాలు ఏమిటి?
21. స్కూళ్లో ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా..?
22. పాఠశాలకు డాక్టర్లు వస్తున్నారా..? రక్త పరీక్షలు చేస్తున్నారా? ఐరన్, పోలిక్ ఆసిడ్ మాత్రలు ఇస్తున్నారు. ఇస్తే ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నారు?
23. అందరికి కళ్ళ పరీక్షలు చేసారా..? అవసరమైన వారికి కళ్ల అద్దాలు ఇస్తున్నారా?
24. పిల్లలకు ప్రోగ్రస్ కార్డులు ఇస్తున్నారా...? ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో అయినా పరవాలేదు. అన్ని చోట్లా ప్రోగ్రెస్ కార్డులు ఉండాలి. లేకుంటే ఎందుకు లేవో అడగండి.
25. ప్రోగ్రెస్ కార్డు ఇచ్చిన వెంటనే ఆయా తరగతి ఉపాధ్యాయులు విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడాలని కోరండి..
26. పాఠశాలలో పిల్లల చేత పాటలు పాడించడం.. నృత్యాలు (డ్యాన్స్) చేయించడం.. పోటీలు పెట్టడం చేస్తున్నారా..?
27. పాఠశాలలో ఎన్ని మొక్కలు నాటారు.. వాటికి నీళ్లు పోస్తున్నారా?
28. ఆడపిల్లలకి శానటరీ నాప్కిన్స్ ఇస్తున్నారా..?
28. ఇంటి చుట్టుపక్కల ఎవరైనా దివ్యాంగ పిల్లలు బడికి రాకుండా వున్నారా తెలుపండి.
29. చారిత్రాత్మక ప్రదేశాలకు లేదా కర్మాగారాలకు తీసుకు వెళ్ళారా. అక్కడి విశేషాలు ఎప్పుడైనా వివరించారా?
30. పాఠశాలలో ఆడపిల్లల్ని చుట్టుపక్కల ఎవరైనా ఆకతాయిలు అల్లరి పెట్టడం లేదా వేధించడం వంటి చర్యలకు రక్షణ గా ఏమి జాగ్రత్తలు తీసుకొన్నారు..?
31. పాఠశాలలో టివి లేదా కంప్యూటర్లు వున్నాయా..
32. పాఠశాలలో లైబ్రరీ పుస్తకాలు ఇచ్చి విద్యార్థుల చేత చదివిస్తున్నారా..?
33. 10వ తరగతిలో తెలుగు మీడియం లో లేదా ఇంగ్లీష్ మీడియం.. పరీక్షలు రాయడం మన పిల్లలకు అనుకూలంగా ఉందా లేదా తెలుపండి..
34. పాఠశాల లో IFP panel (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్.) వాడుతున్నారా.. లేదా.. తెలుసుకోండి.
ఇంకా ఎన్నో సమస్యలు ఉంటాయి. సమస్యలు ప్రస్తావించడంతో పాటు తల్లిదండ్రులు వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారో సమావేశానికి వచ్చిన అధికారులను అడిగి తెలుసుకోండి. ఈ ప్రశ్నలు ది పేరెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారి నుంచి వచ్చినవిగా అధికారులు గుర్తించాలి. స్కూళ్లలో నేటి నుంచి ఎటువంటి సమస్యలు లేకుండా అహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు విద్యను అభ్యశిస్తున్నారనే వాతావరణం కనిపించాలి.