లిక్కర్ స్కాం నిందితుడు రాజ్ కెసిరెడ్డి ఆస్తులు జప్తు చేయండి!
x

లిక్కర్ స్కాం నిందితుడు రాజ్ కెసిరెడ్డి ఆస్తులు జప్తు చేయండి!

హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ


ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు పెద్ద మలుపు తీసుకుంది. ఈ కేసులో ఒకటవ నిందితుడిగా ఉన్న రాజ్‌ కెసిరెడ్డి ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సెట్) గుర్తించింది. మద్యం కుంభకోణం కేసులో రాజ్ కెసిరెడ్డి అక్రమంగా డబ్బు సంపాయించినట్టు ఇప్పటికే కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో సెట్ పేర్కొంది. ఈ డబ్బును వైట్‌ మనీగా మార్చుకునేందుకు కెసిరెడ్డి వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు నిర్ధారించింది. రాజ్‌ కెసిరెడ్డి రూ.13 కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. బంధువుల పేర్లతోనూ ఆస్తులు కొన్నట్లు గుర్తించారు. ఈ ఆస్తులను జప్తు చేసేందుకు కొత్త రూల్ మేరకు హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకు రూ. 120 కోట్లు మేర ఆస్తులు జప్తు అయ్యాయి. అందులో 90 శాతం నగదు. సిట్ దాఖలు చేసిన మొదటి చార్జిషీట్‌లోనే రూ. 30 కోట్లు ఆస్తులను సీజ్ చేశారు. రెండో చార్జిషీట్‌కు ముందు హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ఒక ఫామ్ హౌస్‌లో రూ.11 కోట్లు నగదును సిట్ అధికారుల స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కుంభకోణంలోని నిందితులకు చెందిన వివిధ అకౌంట్లలో సుమారు రూ. 15 కోట్లు స్వాధీన పరుచుకున్నారు. ఇక రాజ్ కెసిరెడ్డికి చెందిన వివిధ కంపెనీలు, బినామీ కంపెనీలలో ఉన్న బినామి ఆస్తులను అత్యధికంగా స్వాధీనం చేసుకున్నట్టు సిట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సుమారు రూ. 90 కోట్లు ఆస్తుల జప్తునకు కోర్టు నుంచి సిట్ అనుమతి పొందింది.
జగన్ ప్రభుత్వ హయాంలో కల్తీ, నకిలీ మద్యం విక్రయించడం, ప్రముఖ బ్రాండ్లను నిషేధించి కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వడం వంటివి జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మద్యం విక్రయ లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలో కాకుండా నగదు రూపంలో దుకాణాల్లో వసూలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ మద్యం కుంభకోణం వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అంతా రాజ్ కెసిరెడ్డి అంటూ మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి మీడియా ఎదుట బాంబు పేల్చారు. ఆ క్రమంలో రాజ్ కెసిరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. సిట్ పోలీసులకు అప్పగించారు. అప్పటికే ఈ కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్పను సైతం సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ 3200 కోట్ల మద్యం కుంభకోణం జరిగినట్లు తేల్చారు.
Read More
Next Story