ఏపీలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకునేందుకు శుక్రవారం ఆఖరు. క్యూలో ఉండే వారికి టోకెన్లు ఇచ్చి దరఖాస్తులు స్వీకరిస్తామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం పోటీ పెరిగింది. భారీ స్థాయిలోనే దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తుదారులు లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ఎగబడుతున్నారు. శుక్రవారం ఆఖరు రోజు కావడంతో ఎక్సైజ్ స్టేషన్ల వద్ద క్యూ కడుతున్నారు. ఈ రోజు రాత్రి 7గంటల వరకు ఆన్‌లైన్‌లో నూతన రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు. రిజిస్ట్రేషన్ తదుపరి రాత్రి 12 గంటల్లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల రుసుం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. బ్యాంకు డీడీలతో నేరుగా ఎక్సైజ్ స్టేషన్‌లో దరఖాస్తులు సమర్పించే వారు రాత్రి 7 గంటలలోపు క్యూ లైన్లలో ఉంటేనే దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఎక్సైజ్ స్టేషన్ల వద్ద క్యూలైన్‌లలో ఉన్న వారికి ప్రత్యేకంగా టోకెన్లు అందించి వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు బాగా వచ్చాయి. 3,396 మద్యం దుకాణాలకు గాను ఇప్పటి వరకు 65,424 దరఖాస్తులు వచ్చాయని నిషాంత్ కుమార్ తెలిపారు. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం చేసుకునే దరఖాస్తుల ద్వారా రూ. 1,308 కోట్లు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు.