భారీగా వస్తున్న భూవివాద వినతులు.. అధికారులకు లోకేష్ ఆదేశాలు
ప్రజాదర్బార్‌లో అధికంగా భూ వివాద వినతులే వస్తున్నాయని, వాటి పరిష్కారం కోసం సత్వర చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్.. అధికారులను ఆదేశించారు.
ప్రజాదర్బార్‌లో అధికంగా భూ వివాద వినతులే వస్తున్నాయని, వాటి పరిష్కారం కోసం సత్వర చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్.. అధికారులను ఆదేశించారు. తమ భూవివాదాలకు సంబంధించిన వినతి పత్రాలతో 28వ రోజు కూడా ‘ప్రజాదర్బార్’కు ప్రజలు క్యూ కట్టారు. వారి నుంచి వినతులు స్వీకరించిన అనంతరం అధికారులు ఆదేశాలు జారీ చేశారు లోకేష్. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని సమ్యలను పరిష్కరిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. భూవివాదాల పరిష్కారం కోసం వస్తున్న వినతుల సంఖ్య అధికంగా ఉన్న విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు కూడా ప్రస్తావించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్సుల స్వీకరణ కార్యక్మంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో రాష్ట్రమంతటా భూ కబ్జాలు తీవ్రంగా జరిగాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి భూవివాదాన్ని పరిష్కరించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
చెరువు కట్ట కబ్జా
ప్రజాదర్బార్‌కు వచ్చిన పెదవడ్లపూడి రైతులు తమ ఊళ్లో కొందరు చెరువు కట్టను కబ్జా చేశారని మంత్రి లోకేష్‌కు విన్నవించుకున్నారు. దీంతో తమ వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోందని చెప్పుకొచ్చారు. దాంతో పాటుగా దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న 40 ఎకరాల రైతు పట్టా భూములను 2010లో నిషేధత జాబితాలో చేర్చారని, రికార్డులు పరిశీలించి తమ భూములను 22-ఏ నుంచి తొలగించాలని కోరారు. కాగా వారి వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్.. వారి సమస్యల పరష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.