‘ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు’.. వైసీపీపై లోకేష్ ఫైర్
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో పాత విధానం తీసుకొస్తామని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో పాత విధానం తీసుకొస్తామని ప్రకటించారు. ఈ విషయంపై ఇప్పటికే చర్చిస్తున్నామని, సెప్టెంబర్ 11న సీఎం సమక్షంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం వైసీపీ చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. తాము ప్రజాధనం వృధా చేస్తున్నామని కొందరు విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి అధికారం కొత్తేమీ కాదని, తమ సీఎం ఇప్పటికి కూడా ప్రజా ధనం వృధా చేయొద్దనే తమకు ప్రతి సమావేశంలో చెప్తుంటారని గుర్తు చేశారు. అనవసర ఆర్భాటాలకు ప్రజాధనం వాడొద్దని కూడా ఆయన చెప్తారని, తాను కూడా అదే విధంగా నడుచుకుంటానని వివరించారు. ఇప్పటి వరకు తాను ఒక్క రూపాయి కూడా ప్రజా ధనాన్ని తన ఖర్చుకు వాడుకోలేదని స్పష్టం చేశారు.
‘‘గత ప్రభుత్వం ప్రజాధనం వృధా చేయడానికి పరాకాష్టలాంటిది. భూ సర్వే సరిహద్దు రాళ్లపై తమ ముఖాలు ఉండాలన్న ఉద్దేశంతో.. తమ బొమ్మలు చెక్కించుకోవడానికే వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. ఇక నా విషయానికి వస్తే నేను తాగే కాఫీకి కూడా నా సొంత డబ్బులే చెల్లించుకుంటాను. ప్రజాధనం లూటీ చేయడంలో జగన్ సిద్ధ హస్తులు. నాకు ఆ కళ అస్సలు రాదు’’ అంటూ చురకలంటించారు. ఆఖరికి తాను ఉండటానికి కూడా వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసి రుషి కొండపై విళాసవంతమైన ప్యాలెస్ కట్టిన ఘటన జగన్‌కే దక్కుతుందని చురకలంటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడవట్లేదని, తాను చెప్పిన రెడ్‌బుక్‌కు తూచా తప్పకుండా ఫాలో అవతానని, తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టనని హెచ్చరించారు నారా లోకేష్.
అన్నీ బయటపెడతా..
‘‘రాష్ట్రంలో జరిగిన భూ కుంభకోణాలపై సిసోడియా నివేదికపై వచ్చే కేబినెట్‌లో చర్చిస్తాం. అన్ని లెక్కలు బయటపెడతాం. అక్రమాలకు బాధ్యులైన అందరిపై చర్యలు ఉంటాయి. వైసీపీ పాలనలో విశాఖలో రాజారెడ్డి రాజ్యంగం అమలైంది. బెదిరించి భూముల దోపిడీ చేశారు. ఆ క్రమంలో అనేక నేరాలు జరిగాయి. విశాఖను ఏఐకి కేంద్రంగా మారుస్తాం. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయడానికి పెట్టుబడిదారులతో చర్చిస్తాం. ఎన్‌డీఏ కూటమికి ప్రజాక్షేత్రంలో మంచి తీర్పు వచ్చింది. ఇక కోర్టులో మాత్రమే తీర్పు పెండింగ్‌లో ఉంది. ఇంతలోనే ఒక పత్రిక తనపై తప్పుడు కథనాలు ప్రచురించింది. తప్పు చేసినట్లు ఆ పత్రిక ఒప్పుకోలేదు. అందుకే రూ.75కోట్లకు పరువు నష్టం దావా వేశాను’’ అని వెల్లడించారు. అదే విధంగా తప్పుడు ప్రచారాలు చేసేవారిని, తప్పు చేసేవారిని ఎవరైనా వదిలి పెట్టమని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.