అందులో జగన్ నెంబర్ వన్.. లోకేష్ చురకలు..
x
Source: Twitter

అందులో జగన్ నెంబర్ వన్.. లోకేష్ చురకలు..

సీఎం జగన్‌పై నారా లోకేష్ సెటైర్లు వేశారు. రాష్ట్రానికి, ప్రజలకు సీఎం జగన్ చేసిందేమీ లేదన్నారు.


ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు. దేశంలో ఏమీ చేయని, చేతకాని సీఎంల జాబితాలో జగన్ మోహన్ రెడ్డిదే మొట్టమొదటి స్థానం అంటూ చురకలంటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసిన తొలి సీఎం కూడా జగనే అని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల పాలనలో అప్పులు తీసుకురావడం తప్ప జగన్ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తాడెపల్లి మండలం పాలనుకొండలోని ఆర్ఆర్ అపార్ట్‌మెంట్ వాసులతో నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యల చేశారు లోకేష్.


జగన్ వల్ల ఆయన కుటుంబీకులకు, ఆయన గూండా గ్యాంగ్‌కు తప్ప రాష్ట్ర ప్రజలకు నయా పైసా లాభం, సంక్షేమం అందలేదని విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తి చేశామని చెప్పుకుంటున్న జగన్.. ఒక్క శాతం హామీలను కూడా నెరవేర్చలేదని, ప్రాజెక్ట్‌లను రద్దు చేయడం, పూర్తి చేయడం ఒకటి కాదని జగన్ తెలుసుకోవాలంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో టీడీపీ ప్రారంభించిన ఎన్నో పథకాలు, ప్రాజెక్ట్‌లు జగన్ రద్దు చేశారని, వాటిని కూడా బహుశా పూర్తి చేసిన ప్రాజెక్ట్‌లగా లెక్కేస్తున్నట్లు ఉన్నారు సీఎం అంటూ ఎద్దేవా చేశారు.


‘‘2019లో అధికారంలోకి రాగానే అమరావతి, పోలవరం పూర్తి చేస్తామని గొప్పలు చెప్పుకున్నారు. ఏది వాటిలో దేన్ని పూర్తి చేశారు. టీడీపీ ప్రభుత్వంలోనే పోలవరం ప్రాజెక్ట్‌ను 72 శాతం పూర్తి చేశాం. ఆ మిగిలిన 28 శాతం పనులను కూడా జగన్ తన ఐదేళ్ల పాలనలో ముగించలేకపోయారు. అసలు పోలవరం పనులు జరుగుతున్నాయా? జరుగుతుంటే ఎలా జరుగుతున్నాయి? నత్తకు నడకలు నేర్పుతున్నాయా?’’ అని సెటైర్లు వేశారు లోకేష్.


‘‘ఉద్యోగుల సీపీఎస్, ఓపీఎస్‌పై సమగ్ర అధ్యయనం అవసరం. అధికారంలోకి రాగానే వాటిపై దృష్టి సారించి అన్నింటినీ గాడిలో పెడతాం. అధికారం చేపట్టిన వెంటనే ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నీ చెల్లించేస్తాం. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుంది. అన్ని రంగాల ప్రజలు అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తాం. నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చర్చలు తీసుకుంటాం. ప్రతి ఏటా జాబ్ కాలెండర్, డీఎస్‌సీని విడుదల చేస్తాం’’అని లోకేష్ వెల్లడించారు.



Read More
Next Story