మంత్రివర్గంపై లోకేష్ కసరత్తులు.. కొందరికి బెర్త్‌లు ఫిక్స్
x

మంత్రివర్గంపై లోకేష్ కసరత్తులు.. కొందరికి బెర్త్‌లు ఫిక్స్

మోదీ కేబినెట్‌లో ఏపీ నుంచి ఎవరు ఉంటారు అన్న అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ భారీగా జరుగుతోంది. మరోవైపు కేంద్రం తర్వాత అసలు రాష్ట్ర కేబినెట్‌ పరిస్థితి ఏంటి.


మోదీ కేబినెట్‌లో ఏపీ నుంచి ఎవరు ఉంటారు అన్న అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ భారీగా జరుగుతోంది. కానీ దానికి మించి కేంద్రం తర్వాత అసలు రాష్ట్ర కేబినెట్‌లో ఎవరెవరికి స్థానం దక్కొచ్చు అనే చర్చలు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే జూన్ 12 తేదీకి ఇంకా రెండు రోజుల సమయమే ఉందని, రెండు రోజుల్లో కేబినెట్ మంత్రుల ఎంపిక పూర్తవుతుందా? లేకుంటే ఇప్పటికే ఎవరెవరిని మంత్రి వర్గంలో చేర్చుకోవాలి? ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అన్న అంశాలపై టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చేసిందా? అన్న ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా తెగ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర కేబినెట్‌పై చంద్రబాుబ ఫోకస్ పెడితే రాష్ట్ర కేబినెట్‌పై నారా లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారని, ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి, మిత్ర పక్షాలకు ఏ శాఖలు కేటాయించాలి అన్న అంశాలపై నారా లోకేష్.. పార్టీ పెద్దలతో సమావేశాలు నిర్వహించి చర్చిస్తున్నారని తెలుస్తోంది. ఈ అంశంపై మిత్ర పక్షాలతో కూడా చర్చలు చేస్తున్నట్లు సమాచారం.

భారీగా ఆవావహులు

ఎన్నికల కౌంటింగ్ ముగియడం మొదలు మంత్రిమండలిలో స్థానం కోసం కూటమి నేతలు రేస్ షురూ చేసేశారు. తనకంటే తనకంటూ భారీ సంఖ్యలో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే భారీ సంఖ్యలో ఆశావహులు పార్టీ కార్యాలయాల ముందు పడిగాపులు కాస్తున్నారు. మూడు పార్టీల కార్యాలయాల దగ్గర భారీగా గెలిచిన అభ్యర్థులు చేరుకుని ఉన్నారు. ఒక కేబినెట్ కూర్పుపై లోకేష్ తనదైన శైలిలో కసరత్తులు చేస్తూ బిజీబిజీ అయిపోయి ఉన్నారు. ఇప్పటికే ఈ అంశంపై జనసేనాని పవన్ కల్యాణ్.. టీడీపీ పెద్దలతో క్షణ్ణంగా చర్చలు జరిపారని, తమకు కావాల్సిన శాఖలపై క్లారిటీ తెచ్చుకున్నారని తెలుస్తోంది. మంత్రిమండలి పదవుల రేసులో కొందరు సీనియర్లకు మాత్రం బెర్త్ ఖరారు అయినట్లే తెలుస్తోంది. అదే విధంగా పలువురు సీనియర్ నేతలు కూడా మంత్రి పదవుల కోసం పోటీలో ఉన్నారు.

బెర్త్ కన్ఫర్మ్ అయిన నేతలు

మంత్రిమండలిలో చర్చలు, వెయిటింగ్ లిస్ట్ వంటి వాటితో సంబంధం లేకుండా నేరుగా పదవులను కన్ఫర్మ్ చేసుకున్న నేతలు కొందరు ఉన్నాని ప్రచారం జోరుగా సాగుతోంది. వారిలో గొట్టిపాటి రవికుమార్, డోలా వీరాంజనేయ స్వామి, నెల్లూరు నుంచి నారాయణ, ఆనం రామనారమణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, శ్రావణ్ కుమార్, ప్రకాశం జిల్లా నుంచి ఏలూరు సాంబశివరావుకు ఛాన్స్ కనిపిస్తోంది. అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బీసీ జనార్ధన్ రెడ్డి, కడప నుంచి సుధాకర్ యాదవ్, మాధవి రెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మైనార్టీల నుంచి ఫరూక్, మహిళల నుంచి బండారు శ్రావణి, ఎస్టీల నుంచి శిరీషాదేవి, బీసీల నుంచి యనమల దివ్య, సవిత పేర్లు రేసులో ఉన్నాయి. వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

రేసులోని సీనియర్లు

రాష్ట్ర కేబినెట్‌లో స్థానం కోసం పోటీ పడుతున్న సీనియర్ నేతల సంఖ్య భారీగా ఉంది. మొత్తం 25 మంత్రిమండలి స్థానాలు ఉండగా వాటి కోసం 50 మందికి పైగానే పోటీ పడుతున్నట్లు సమాచారం. వారిలో కొందరు సీనియర్లు గట్టిగా పోటీ పడుతున్నారు. వారిలో.. ఉత్తరాంధ్ర నుంచి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, కొండ్రు మురళీమోహన్, కళా వెంకటరావు, అయ్యన్నపాత్రుడు, తూర్పుగోదావరి జిల్లా నుంచి చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పశ్చిమ గోదావరి నుంచి పితాని, నిమ్మల రామానాయుడు, కనుమూరి రఘురామరాజు, కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్ర, బోండా ఉమరేసులో ఉన్నారు. ఇప్పటికే వీరు తమ తరపు వాదనలను చంద్రబాబు సహా లోకేష్‌కు కూడా వినిపించినట్లు సమాచారం.

మిత్రపక్షాల్లో ఆరుగురికి ఛాన్స్

25 మందితో కొలువుదీరనున్న ఆంధ్ర కేబినెట్‌లో మిత్రపక్షాల నుంచి ఆరుగురు నేతలకు అవకాశం దక్కనున్నట్లు టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఆ ఆరు సీట్లను బీజేపీ, జనసేనకు సమానంగా పంచనున్నారన్న మాట కూడా వినిపిస్తోంది. వీరిలో జనసేన నుంచి పవన్‌కు అవకాశం దక్కుతుందా లేదా అనేదానిపై క్లారిటీ లేదు. కానీ నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధ ప్రసాద్ పేర్లు మాత్ర గట్టిగానే వినిపిస్తున్నాయి. అదే విధంగా బీజేపీ నుంచి సుజనా చౌదరి, సత్యకుమార్, విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీనివాస్ పోటీలో ఉండగా వీరిలో ముగ్గురికి ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది.

మంత్రి పదవిపై పవన్‌కు ఇంట్రస్ట్ లేదా!

ఒకవైపు కేంద్ర కేబినెట్, మరోవైపు రాష్ట్ర కేబినెట్ గురించి రాష్ట్రమంతా చర్చలు హోరెత్తుతున్నాయి. వీటిలో పవన్ పేరు ఎక్కడ ఉంటుందా అని అభిమానులు, అనుచరులు కళ్లుకాయలు కాచేలా చూస్తున్నారు. కానీ పవన్‌కు రెండు కేబినెట్‌లలో స్థానాలపైనా ఇంట్రస్ట్ లేదని మరో వాదన వినిపిస్తోంది. ఈసారికి పిఠాపురం ఎమ్మెల్యేగానే కొనసాగాలని, పిఠాపురం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపైనే పవన్ ఫుల్ ఫోకస్ పెట్టనున్నారని తెలుస్తోంది. మంత్రి పదవి గురించి వచ్చే ఎన్నికల తర్వాత ఆలోచిద్దామని, ఎంపీ స్థానం గురించి కూడా అప్పుడే చూద్దామని పవన్ ఆలోచిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

Read More
Next Story