భక్తి పారవశ్యంలో ప్రాణాల పోగొట్టుకున్నారు. వారంతకు వారు తీసుకున్న ప్రాణాలు కాదు. పాలక మండలి అనాలోచిత నిర్ణయాలు వారి ప్రాణాలు తీశాయి.
టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఎవరిని చూసుకుని ఈ విధమైన మాటలు మాట్లాడారు? కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తరిద్దామనుకున్న భక్తులను బంధించి చంపారనే విమర్శలు వెల్లు వెత్తు తున్నాయి. తిరుపతిలో టీటీడీ కట్టించిన భవనాలు ఎన్నో ఉన్నాయి. ఎవరు ఎప్పుడు వచ్చినా నామినల్ ఫీజుతో అక్కడ తలదాచుకుంటారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఇస్తామని మునిసిపల్ పార్కులో భక్తులను బంధించి వారి చావుకు కారకులయ్యారు టీటీడీ పాలకులు. ఇంతటి ఘోరం ఊరకే జరగదు కదా అనేది పలువురి అనుమానం. మేమున్నది భక్తుల రక్షణ కోసమే అంటూ క్షమాపణ చెబితే చచ్చిన వాళ్లు తిరిగొస్తారా? అని వెటకారపు వ్యాఖ్యలు చేయడం చైర్మన్ బిఆర్ నాయుడు కే చెల్లింది. టీటీడీ చరిత్రలో ఇదో చెరిగిపోని ఘోరమైన అధ్యాయం.
ఇవి పాలక మండలి హత్యలే
టీటీడీ పాలక మండలి సరైన నిర్ణయాలు తీసుకుని భక్తులపై భక్తితో ప్రవర్తించి ఉంటే తిరుపతిలో ఇంత ఘోరం జరిగేది కాదని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంధ్రనాధ్ అన్నారు. పాలకులమనే అహంకారం ఉన్న వారెవరూ చరిత్రలో బతికి బట్టగట్టిన దాఖలాలు లేవన్నారు. పాలక మండలి కి శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, వారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. మృతుల కుటుంబాలకు డబ్బులు ఇచ్చి, ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన వారి కుటుంబాల్లో మనశ్శాంతిని తీసుకు రాలేరన్నారు.
భక్తుల వేదన మాటల్లో చెప్పలేనిది
తిరుమల తిరుపతి ఎప్పుడూ గోవింద నామస్మరణతో మార్మోగుతుంటుంది. అటువంటి తిరుపతిలో శ్రీనివాసుని చూసి జన్మను సార్థకం చేసుకొందామని భక్తులు వస్తుంటారు. ఆ భక్తులు శ్రీవారికి కోట్లలో కానుకలు ఇస్తుంటారు. భక్తులు ఇచ్చే కానుకలతో ఉద్యోగాలు పొంది కొన్ని కుటుంబాలు దేవుని సన్నిధిలో సుఖంగా జీవిస్తున్నాయి. అటువంటప్పుడు దేవుడిని చూసేందుకు వచ్చే భక్తులకు ఏ రకమైన సౌకర్యాలు అందించాలో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌకర్యాలు కల్పించలేదు. అయినా భక్తులు సరిపెట్టుకున్నారు. భక్తి పారవశ్యంలో ఒకరిని ఒకరు తొక్కుకుని చనిపోయినప్పుడు ఆ కుటుంబాల వారు పడిన ఆవేదన మాటల్లో చెప్పలేనిది. ప్రతి సంవత్సరం మూడు సార్లు నిన్ను చూడటానికి వస్తామే స్వామీ.. మాకెందుకు ఈ శిక్ష.. అంటూ మృతుల బంధువులు రోదిస్తుంటే ఎవరి హృదయమైనా వేదనకు గురవుతుంది. అటువంటిది టీటీడీ చైర్మన్ హృదయం ఎందుకు మరో విధంగా స్పందించిందనేది శ్రీవారి భక్తుల్లో ఉన్న వేదనా భరిత సందేహం.
తొక్కిసలాట సమీక్షలో శీవాణి ట్రస్ట్ అంశమా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భక్తుల మృతిపై సమీక్ష జరుపుతుంటే ‘ఈవో శ్యామలరావు నామాట వినటం లేదు. కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు. మీరైనా చెప్పండి’ అంటూ తన పక్కనే ఉన్న ఈవో పై సీఎం కు చైర్మన్ బిఆర్ నాయుడు ఫిర్యాదు చేశారు. ఆ సమావేశంలో సీఎం ఒక్కరే కారు అమాత్యులు చాలా మంది ఉన్నారు. నేనేమి సమాచారం ఇవ్వలేదో చెప్పండి అంటూ ఈవో ప్రశ్నించారు. శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించిన వ్యవహారం తొక్కిసలాటలో మృతి చెందిన సంఘటనపై జరుగుతున్న సమీక్షలోకి తీసుకు రావడం ఏమిటి? సమీక్ష జరుపుతున్న అంశం ఏమిటి? ఎందుకు శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారం అక్కడ వచ్చింది. అనేది ప్రస్తుతం చర్చగా మారింది. అంటే చైర్మన్ కు తొక్కిసలాట, మృతుల వ్యవహారం పట్టలేదనేది అక్కడే స్పష్టమైంది. ఈవో ఐఏఎస్ అధికారి అని కూడా చూడకుండా ఈవో గారూ.. ఏమి మాట్లాడుతున్నారు. అంటూ ఈవో ను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గదమాయించారంటే నోరు మూసుకోమనే కదా అర్థం. ఒక ఐఏఎస్ అధికారి, పైగా దేవస్థానాల ఈవో అయిన శ్యామలరావును ఇన్ డైరెక్ట్ గా నోరు మూయించేందుకు అనగాని ఎందుకు ప్రయత్నించారు? అనేది కూడా చర్చకు దారి తీసింది.
పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పమనటం కూడా తప్పేనా?
భక్తులకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరింత మెరుగైన సౌకర్యాల కల్పన, శ్రీవారి దర్శన భాగ్యం వైకుంఠ ద్వారం ద్వారా కల్పించడం, ఎన్ని రోజులు ఈ దర్శనం కల్పించాలి, అనే అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా సీఎం ఆదేశం మేరకు ప్రత్యేక పాలక మండలి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ పాలక మండలి సమావేశంలో భక్తులు, మృతి చెందిన భక్తుల కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యం ఏమిటనేది వెల్లడి కావాల్సి ఉంది. ప్రెస్ మీట్ ముగిసే సమయంలో పవన్ కల్యాణ్ భక్తులకు క్షమాపణ చెప్పమన్నారు కదా? అని ప్రశ్నిస్తే సీరియస్ గా మైక్ కట్ చేసి చైర్మన్ వెళ్లిపోయారు. పైగా భక్తుల మనోభావాలను తాను ఎప్పుడూ గౌరవిస్తానంటూనే సోషల్ మీడియా వేదికగా వస్తున్న విమర్శలపై స్పందించినట్లు చైర్మన్ ఒక ప్రకటనలో చెప్పారు. పవన్ కల్యాన్ చెప్పాలని చెప్పకముందే మేము భక్తులకు క్షమాపణ చెప్పాము. ఇప్పుడు ఆయన చెప్పాలంటే చెప్పటం ఏమిటనే ప్రశ్న కూడా నాయుడు నుంచి వచ్చింది.
పవన్ నాకు చెప్పేవాడా.. అనేదేగా దీనర్థం..
పవన్ కల్యాన్ దూకుడుకు బ్రేకులు వేసే కార్యక్రమంలో బాగంగానే బిఆర్ నాయుడు ఈ విధమైన వ్యాఖ్యలు చేశారా? అనే చర్చ కూడా మొదలైంది. వెంకటేశ్వరుని భక్తుల సానుభూతి పొందేందుకు డిప్యూటీ సీఎం ప్రయత్నించారని, ఆ ప్రయత్నాన్ని తిప్పి కొట్టే కార్యక్రమంలో భాగంగానే క్షమాపణ చెబితే చచ్చిన వారు లేచొస్తారా? అన్నారని ఆయన మాటలే చెబుతున్నాయి. ఒకరిపై ఒకరు ఇగోకు పోవాల్సిన సమయం ఇదేనా? ఎన్నో ఆశలు, ఆశయాలతో దేవుని దీవెన పొందేందుకు వచ్చిన మా కుటుంబాలకు ఇలా జరిగిందేమిటి? అనే వేదనలో ఉన్న బాధిత భక్తులను ఓదార్చే విధానం ఇదేనా? అనే చర్చ వెంకటేశ్వర స్వామి భక్తుల్లో జరుగుతూనే ఉంది.