సీఎం చంద్రబాబు ప్రభుత్వం కనీసం బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేక పోయింది. ఓటాన్‌ అకౌంట్‌తోనే నడుపుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమని జగన్‌ అన్నారు.


సీఎం చంద్రబాబు పాలనపైన, కూటమి ప్రభుత్వం తీరుపైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దోచుకో.. పంచుకో.. తినుకో పద్ధతిలో సీఎం చంద్రబాబు పాలన తీరు సాగుతోందని ద్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా కనీసం పూర్తి స్థాయి బడ్జెట్‌ను కూడా ప్రవేశ పెట్టలేక పోయిందని, ఓటాన్‌ అకౌంట్‌తో ఇన్నాళ్లు నడిచే ప్రభుత్వం ఎక్కడా లేదని విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో శనివారం జగన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు గడుస్తున్నా సూపర్‌ సిక్స్‌ లేదు, సూపర్‌ సెవెన్‌ లేదని ఎద్దేవా చేశారు. ఈ ఐదు నెలల పాలనలో ఇసుక, మద్యం మాఫియాను, స్కిల్‌ స్కామ్‌లో ఈడీ ప్రెస్‌ నోట్‌ను టీడీపీ వక్రీకరించిన తీరును ఎండగట్టారు.

తమ హయాంలో మాదిరిగా డీబీటీ కనిపించదన్నారు. ఇసుక దగ్గర నుంచి మొదలు మద్యం వరకు మాఫియా నడుపుతున్నారని, పేకాట క్లబ్‌లు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయన్నారు. అబద్దాలు చెప్పి ప్రజల ఆశలతో చెలగాటమాడుతున్నారని, వలంటీర్లకు రూ.10 వేలు జీతం అంటూ మోసం చేశారని విమర్శించారు. చిన్నపిల్లలకు రూ.15 వేలు, అమ్మలకు రూ.18 వేలు, పెద్దమ్మలకు రూ.45 వేలు, రైతుకు రూ. 20 వేలు ఇస్తామని ఊదరగొట్టారని, అధికారంలోకి వచ్చిన తర్వాత బీద అరుపులు మొదలెట్టారని విమర్శించారు. వీటిపైన అడిగే స్వరం వినపడకుండా చేయాలని చుస్తున్నారని అన్నారు. మార్పులు పేరుతో స్కామ్‌లకు తెర లేపుతున్నారని, ఇదీ వాళ్ల మోడస్‌ ఆపరేండ అని అన్నారు.
రాష్ట్రంలో 141 నియోజకవర్గాల్లో యావరేజ్‌గా లారీ ఇసుక రూ.30 వేలు పైగా ఉంది. కొన్ని చోట్ల లారీ ఇసుక రూ.60 వేలు పైగా ఉందన్నారు. రేట్లు చూస్తే గతంలో ఉన్న రేట్ల కన్నా రెండింతలు పెరిగాయన్నారు. తమ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వ పెడితే..ఈ ప్రభుత్వం రాగానే స్టాక్‌ యార్డ్‌లను ఖాళీ చేసిందన్నారు. దోపిడీ ఏ స్థాయిలో ఉందో టెండర్‌ డాక్యుమెంట్‌ చూడాలని వీడియో ప్రదర్శించారు. అందరూ దసరా పండుగలో నిమగ్నమై ఉంటే 180 రీచ్‌లకు టెండర్లు పిలిచారు. రెండు రోజుల్లో ఎవరైనా టెండర్లు వేస్తారా? అని ప్రశ్నించారు. దారుణంగా మాఫియా సామ్రాజ్యం నడుపుతున్నారని అన్నారు.
2014–2019 మధ్యలో కూడా ఇలాగే జరిగిందన్నారు. మొదట డ్వాక్రా మహిళలకు ఇసుక టెండర్లు అన్నారు. ఆ తరువాత వాళ్ల నుంచి చంద్రబాబు తన మనుషులకు రీచ్‌లను అప్పగించారని తెలిపారు. కూమి పార్టీలు ఎవరికి వారుగా దోచుకుంటున్నారని, అడిగే వారు లేరని రెచ్చిపోతున్నారని అన్నారు. తమ హయాంలో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చేలా అత్యధిక బిడ్డర్లకు కాంట్రాక్ట్‌ ఇచ్చామన్నారు. ఏడాదికి రూ.700 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా పాలసీ తెచ్చామన్నారు. సీఎం చంద్రబాబు ఉచితంగా ఇసుక ఎవరికి ఇస్తున్నారని ప్రశ్నించారు. గతంలో ఎంత రేటుకు ఇసుక అమ్మాలనేదానిపై ప్రతి వారం పేపర్లో ప్రకటనలు వచ్చేవి. ఇప్పుడు రెండింతలు ఎక్కువకు అమ్ముతున్నారని అన్నారు.
లిక్కర్‌ పాలసీ కూడా ఇదే రీతిలోనే ఉందన్నారు. రాష్ట్రంలో 20 డిస్లరీలు ఉంటే ఇందులో 14 డిస్టరీలు చంద్రబాబు హయాంలోనే వచ్చాయన్నారు. ఆరు డిస్టరీల లైసెన్సులు అంతకు ముందు వచ్చినవే అన్నారు. తమ హయాంలో ఒక్కదానికి కూడా పర్మిషన్‌ ఇవ్వలేదన్నారు. డిస్టరీలు అవే కానీ బ్రాండ్లు మారుతాయన్నారు. చంద్రబాబు హయాంలో అమృతం, వేరే ప్రభుత్వం వస్తే విషం అంటూ ప్రచారం చేస్తారని అన్నారు. తమ హయాంలో మద్యం దుకాణాలు 4380 ఉంటే, 2038 షాపులు తగ్గించామన్నారు. మద్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపిందని, టైమింగ్స్‌ కూడా మార్చామని, పర్మిట్‌ రూములు రద్దు చేశామని, బెల్ట్‌షాపులు కట్టడి చేశామని అన్నారు. చంద్రబాబు హయాంలో 43 వేల బెల్ట్‌షాపులు ఉండేవన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న షాపులను రద్దు చేసి తన మాఫియా సామ్రాజ్యానికి మద్యం షాపులను కట్టబెట్టారని విమర్శించారు. లిక్కర్‌ పాలసీ మంచిదైతే ఎమ్మెల్యేలు ఎందుకు కిడ్నాపులు, ఎందుకు దాడులు చేయిస్తున్నారని నిలదీశారు.
స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబుకు ఈడీ క్లీన్‌ చీట్‌ ఇచ్చినట్లు ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. కానీ దీనిని కూడా వక్రీకరించారని విమర్శించారు. 13 చోట్ల చంద్రబాబు ఫైళ్లపై సంతకాలు చేసి రూ.370 కోట్లు ఇస్తే వీరు షెల్‌ కంపెనీ ద్వారా దోచుకున్నారని అన్నారు. వక్రీకరించడం అన్నది చంద్రబాబుకే సాధ్యమన్నారు. లడ్డూల విషయం కానీ, ఈడీ ఆస్తుల అటాచ్‌మెంట్‌ కానీ, లిక్కర్‌ కానీ అన్నింటికీ కూడా అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని మండిపడ్డారు. వరద బాధితులకు భోజన ఖర్చు రూ.368 కోట్లు అంటా? అసలు రిలీఫ్‌ క్యాంపులు విజయవాడలో ఉన్నాయా? ఎవరికి భోజనాలు పెట్టారని ప్రశ్నించారు. క్యాండిల్స్, అగ్గిపెట్టెలు, మొబైల్‌ జనరేటర్లు అంటూ రూ.23 కోట్లు దోచేశారని ఆరోపించారు. సాక్షి పత్రిక ఈ అవినీతిని రాసిందంటూ ఎడిటర్‌పై కేసు నమోదు చేశారని అన్నారు. మాట్లాడితే కేసులు అంటూ భయపెడుతున్నారని, ఇంత దారుణంగా పరిపాలన చేస్తున్నాని మండిపడ్డారు. బంతిని ఎంత గట్టిగా నేలకు వేసి కొడితే అంత బలంగా పైకి లేస్తుందన్నారు. అధికారంతో ఇష్టం వచ్చినట్లు కేసులు పెడితే ప్రజలు తిరుగబడుతారని హెచ్చరించారు. ఆడవాళ్లు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని, వారందరికీ తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రజల తరుఫున పోరాటం చేసేందుకు తాము ముందుంటామని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
Next Story