బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతానికి స్థిరంగా కొనసాగుతోంది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన అనంతరం.. తన దిశను మార్చుకొని నెల్లూరు జిల్లాకు సమీపంలో తమిళనాడువైపుగా పయనించనుంది. తమిళనాడులోనే తీరం దాటే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతానికి స్థిరంగా కొనసాగుతోంది. వచ్చే రెండు రోజుల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు ఉన్న సముద్ర తీర ప్రాంతంపై ఉండే అవకాశం ఉంది. దీంతో పాటుగా కోస్తా ఆంధ్ర జిల్లాలపై ఎక్కువుగా ఉంటుందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావం వల్ల బుధవారం నుంచి 22 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర తీరం వెంబడి గంటకు 35కిమీ నుంచి 45కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, గరిష్టంగా 55కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.