బాస్‌లపై కొరడా.. పోలీస్ అధికారుల అలర్ట్..!?
x

బాస్‌లపై కొరడా.. పోలీస్ అధికారుల అలర్ట్..!?

పోలీసు పెద్దలపై వేటు పడింది. ఎన్నికల సంఘం కఠిన నిర్ణయంతో ఆ శాఖ అధికారుల్లో అంతర్మథనం ఏర్పడింది. అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది.


(ఎస్.ఎస్.వి..భాస్కర్ రావ్)

తిరుపతి: కీలక అధికారులపై వేటు పడింది. రాష్ట్ర అధినేత స్వరం మారింది. ఇది కాస్తా దిగువ శ్రేణి నాయకుల్లో అలజడి రేకెత్తించింది. వీటిని గమనిస్తున్న స్వామిభక్తుల్లో దడ మొదలైంది. ప్రధానంగా పోలీసుశాఖలో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. " ఉన్నత స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవడం కదిలించింది" అని కోస్తాఆంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఆ ప్రభావం కింది స్థాయి వరకు కనిపిస్తుందని ఫెడరల్ ప్రతినిధితో అన్నారు.

ఉన్నతాధికారుల పెత్తనం

రాజకీయ బదిలీలతో వచ్చే ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకే కింది స్థాయి వారంతా పనిచేయాల్సి ఉంటుంది. రాజకీయ నాయకుల మాటలు ఖాతరు చేయని వారికి రోజుల వ్యవధిలోనే స్థానభ్రంశం కలుగుతుంది. అందుకు తిరుపతి జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి మహిళా ఎస్పీగా మల్లికా గార్గ్‌ అంశం నిదర్శనం. ఆమె ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఏకపక్షంగా పెడుతున్న కేసులకు చెక్ పెట్టారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నం చేశారు. ఈమె ఉంటే తమ ఆటలు సాగవు అని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు ఆమె రోజుల వ్యవధిలోని బదిలీ చేయించారు.

దాంతో పాటుగానే ప్రభుత్వం మారితే అధికారులు కూడా మారతారన్న సంప్రదాయాన్ని షరామామూలు చేసేశారు నాయకులు. అలానే 2019లో రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇచ్చారని అపవాదును సీఎం జగన్ మూటగట్టుకున్నారు. ‘‘ఆ అధికారులంతా వైసీపీకి కొంగుకాస్తూ.. ధర్నాలు, రాస్తారోకోలు చేసినా కేసులు బనాయించారు" అని టిడిపి నాయకులు ఆరోపించారు. కక్ష సాధింపు ధోరణితో ఏకపక్షంగా కేసులు బనాయిస్తున్నారని టిడిపి నాయకులు నిరసనలు దిగడంతో పాటు కోర్టుల వరకు వెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

ప్రత్యేక సమీక్ష

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లాకు సీనియర్ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పోలీసు అధికారిగా నియమించింది. మంగళవారం ఆయన ఎన్నికల సన్నద్ధత, శాంతి భద్రతలపై కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ తోపాటు ఆయా శాఖల సీనియర్ అధికారులతో సమీక్షించారు.

నకిలీ ఎపిక్ కార్డులతో వేటు ప్రారంభం..

తిరుపతి నగరంలో సుమారు 35 వేల నకిలీ ఎపిక్ కార్డులు తయారు చేశారన్న కేసులో ఐఏఎస్ అధికారులతో పాటు కొందరు పోలీస్ అధికారులను కూడా ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. 2024 ఎన్నికల ప్రక్రియ ఆరంభంలోనే చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో బ్యూరోక్రాట్స్‌తో పాటు రెవిన్యూ సిబ్బందిని కూడా ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వాటిపై వైసీపి వర్గాలు స్పందించినప్పటికీ ఈసీ మాత్రం సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించలేదు.

పోలింగ్ గడువు సమీపిస్తున్న వేళ..

పోలింగ్ ఇక వారం రోజుల్లో జరగబోతోంది.. అప్పటికే ప్రతిపక్షాల నుంచి అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో.. కడప జిల్లాకు చెందిన డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి, స్వామి భక్తుడైన అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఈ బదిలీల పర్వంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉలికిపాటుకు గురైనట్లు కనిపిస్తుంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వరంలో వచ్చిన మార్పు అని చెప్పవచ్చు. ఈ సంకేతాలతో.. ఉన్నతాధికారులపైనే వేటుపడితే, మా పరిస్థితి ఎలా ఉంటుందో అని మండల సర్కిల్ స్థాయి అధికారులు ఆలోచనలో పడినట్లు సమాచారం.

శాసించే స్థాయి నుంచి నిరసనకు...

ఇప్పటివరకు రాష్ట్రంలో సాధారణ స్థాయి నాయకుడు కూడా పెత్తనం చెలాయించారు అనేది విపక్షాల ఆరోపణ. ఫోన్ కాల్‌తో కేసులు నమోదు చేయించారన్న వ్యవహారాలు కూడా అనేకసార్లు బట్టబయలు అయ్యాయి. "పోస్టల్ బ్యాలెట్ దాఖలు చేస్తున్న కేంద్రం వద్ద టీడీపీ నాయకులు డబ్బుల సంచులతో దిగారు" అని చిత్తూరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. విజయానంద రెడ్డి సోమవారం పోలీసులు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకోలేదని నిరసిస్తూ, విజయానంద రెడ్డి చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎంత అర్థనగ్నంగా ధర్నా చేయడం చర్చకు దారి తీసింది. "మీరు చెప్పిన కేంద్రాల్లో గాలించే మాకు ఎవరూ దొరకలేదు" అని పోలీసు అధికారులు సముదాయించడానికి విఫలయత్నం చేశారు.

అర్ధనగ్నంగా వచ్చిన ఆయన పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఐదేళ్లపాటు కనుసైగలతో శాసించిన నాయకులు .. ధర్నాలకు దిగే పరిస్థితికి వచ్చారు. ఈ ఘటన ద్వారా పోలీసులు నిబంధనల మేరకు పనిచేస్తున్నామని భావన కల్పించారు. తమ విధుల్లో ఏకపక్షంగా ఉండబోమనే సంకేతాలు ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఏదిఏమైనా ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలతో ఓటర్లకు సానుకూల సంకేతాలు ఇస్తున్నట్లు వాతావరణం కనిపిస్తోంది.

Read More
Next Story