ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి హోం శాఖ మంత్రి. ఆమె కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. అధికారం ఆమె చేతుల్లోనే ఉంది. అదే రాజకీయం అంటే...


సోషల్‌ మీడియా ట్రోల్స్‌ ధాటికి బలై అసువులు బాసిన జి గీతాంజలి కుటుంబానికి శ్రద్ధాంజలి ఘటించేందుకు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత. ఇది ఎంత విడ్డూరంగా ఉంది. చెప్పుకునేందుకు కాస్త విడ్డూరంగా ఉన్నా వాస్తవం. పశ్చిమ గోదావరి జిల్లాలోని నలజర్ల మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీతో ఆ కుటుంబంలోని బాధలు పోతాయా? ఆర్థిక బాధల నుంచి ఆకుటుంబం బయట పడుతుందా? అందరూ ఆలోచించాలి.

ఎవరు ఏ చిన్న ఉద్యమం చేసినా ఉక్కుపాదాలతో అణచి వేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ఆ కుటంబానికి కావాల్సింది మీ సానుభూతి కాదు. ఓదార్పు అంతకంటే కాదు. కొవ్వొత్తుల ర్యాలీ అసలే వద్దు. మీరు చేయాల్సింది ఒక్కటే నిందితులు ఎవరు? ఎందుకు ఈ విధమైన దారుణానికి పాల్పడ్డారు. వారిని పట్టుకోవాలి. నలుగురిలో నిలబెట్టాలి. శిక్ష పడేలా చేయాలి. ఇప్పుడు మీ చేతిలో ఆ అధికారాలు ఉన్నాయి. ఈ అధికారాలతో కొరడా ఝుళిపించాలి. అప్పుడే ఆ కుటుంబానికి న్యాయం జరుగుంది. అంతే కాని కొవ్వొత్తుల ర్యాలీతో న్యాయం జరుగుతుందా?
ముఖ్యమంత్రి రూ. 20 లక్షలు సాయం ప్రకటించారు. అంతేనా మీరు ఆ కుటుంబానికి కట్టే వెల. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పథకాలను ఎంతగా ఆమె నమ్మింది. కుటుంబాన్ని ప్రభుత్వం ఎలా ఆదుకుందని వివరించింది. అంత నమ్మకం ప్రభుత్వంపై పెట్టకుంది గీతాంజలి. అటువంటప్పుడు మీరు కొవ్వొత్తులు వెలిగించి సరిపెట్టుకుంటారా? ఇదేమన్నా కరోనా అనుకుంటున్నారా? ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అందరినీ ఇళ్లు కదలకుండా ఉండాలని చెప్పి అందరి చేతా చప్పట్లు కొట్టించి, కొవ్వొత్తుల దీపాలంకరణ చేయించారు. దీంతో వ్యాధి నయమవుతుందా? పాలకులు ఏది చెప్పినా పాలితులు పాటించాలా? పాలకులది తప్పైనా జైకొట్టాల్సిందేనా?
ఎంత దారుణం 30 సంత్సరాల యువతి. ఎంతో ఆనందంగా ఉన్న కుటుంబం, ఇద్దరు చిన్న పిల్లలు. నా పిల్లలకు ప్రభుత్వమే అండగా ఉందనుకుంది. అటువంటి యువతి ఒక్కసారిగా ప్రాణం తీసుకుంది. బలవన్మరణానికి కారకులై వారిని వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? వారికి సరైన శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ న్యాయవాదులపై లేదా? న్యాయవాదులు కేవలం కోట్లు తీసుకుని మాత్రమే ప్రభుత్వం తరపున వాదిస్తారా? ఇదేమి న్యాయం? ఇదేమి వ్యవస్థ? ఈ వ్యవస్థలో ఓ సాధారణ యువతి ఎలా బతకాలి? ప్రభుత్వాన్ని అభిమానించినా తప్పే. ప్రతిపక్షాన్ని స్వాగతించినా తప్పేనా? ఏం జరుగుతోంది ఈ వ్యవస్థలో. ఎప్పుడు మారుతుంది పాలన తీరు.
అకారణ దారుణ కాండకు బలైన యువతి కుటుంబానికి న్యాయం జరిగే అవకాశమే లేదా? అంటూ పౌరహక్కుల వారు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే పౌరహక్కుల సంఘానికి 50 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా వారు గతాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో పౌరహక్కుల సంఘం అంటే పోలీసులకు ఉచ్చ పడేవి. ఇప్పుడు పోలీసులు విహంగ విఫణిలో విహరిస్తున్నారని చెప్పొచ్చు. అందుకు ఉదాహరణే ఈ సోషల్‌ మీడియా హత్య. ఏమి చెప్పినా, ఎవరికి చెప్పినా, వినేవారైతే చెప్పొచ్చు. న్యాయం చేయాలని ఆలోచించే వారికి చెప్పొచ్చు. కొవ్వొత్తుల ర్యాలీ చేసి చేతులు దులుపుకునే వారికి ఏమి చెబుతాం. అంతా ప్రజలకు తెలుసు. చూస్తూనే ఉన్నారు. వారే సమధానం చెప్పాలి.
Next Story