ఏడాది బిడ్డకి న్యాయం జరగాలి.. అందుకే ఈ పోరాటం: మదన్‌మోహన్
x

ఏడాది బిడ్డకి న్యాయం జరగాలి.. అందుకే ఈ పోరాటం: మదన్‌మోహన్

తన ఐవీఎఫ్‌కు విజయసాయి రెడ్డే డోనర్ అని శాంతి చెప్పారని మదన్‌మోహన్ వెల్లడించారు. ఆసుపత్రి కేస్‌షీట్‌లో భర్త పేరు వేరే ఉంది. అసలు బిడ్డ తండ్రి ఎవరు? అని ప్రశ్నించారు.


దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, విజయసాయిరెడ్డి వ్యవహారం ఆంధ్ర రాష్ట్రమంతటా హాట్ టాపిక్‌గా ఉంది. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి పచ్చ మీడియా చేస్తున్న ప్రచారమే ఇదంతా అని విజయసాయి రెడ్డి కొట్టిపారేశారు. అదే సమయంలో శాంతి, ఆమె భర్త మదన్‌మోహన్ కలిసి బిడ్డతో ఆడుకుంటున్నప్పటివి, బారసాల జరిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఇంత చూసిన నువ్వు ఇప్పుడు బిడ్డ పుట్టుకని అనుమానించడం ఏమాత్రం సబబు కాదని మరికొందరు హితవు కూడా పలికారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అసలు తనకు అనుమానం ఎందుకు వచ్చింది? తాను ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? అన్న ప్రశ్రలకు శాంతి భర్త మదన్‌మోహన్ క్లారిటీ ఇచ్చారు. తాను ఏదో ఆశించి ఈ పని చేయడం లేదని చెప్పారు. తనకు శాంతికి చట్టబద్దంగా విడాకులు ఇంకా కాలేదని, రెండేళ్లుగా తాను అమెరికాలో ఉండి జనవరి 2024లో భారత్‌కు తిరిగి వచ్చానని వివరించారు మదన్.

‘‘ఇది చాలా సున్నితమైన అంశం. బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి సంబంధించినది. నేను రెండేళ్లు అమెరికాలో ఉన్నాను. తిరిగి వచ్చాక తాను ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కన్నట్లు శాంతి చెప్పారు. అది విని నేను షాక్ అయ్యా. అదేంటి.. అసలు ఐవీఎఫ్ చేయించుకోవాల్సినంత అవరం ఏముంది? అని నిలదీశాను. ఈ విషయంపైనే మా మధ్య ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. ఆ తర్వాత ఒకసారి ఆమె విజయసాయిరెడ్డి పేరు చెప్పి ఆయన డోనర్ అని వెల్లడించారు. ఆయన ద్వారానే ఐవీఎఫ్ చేయించుకున్నానని వివరించారు. ఆమెతో నాకు ఇప్పటికే కవల ఆడపిల్లలు ఉన్నారు. వారికి న్యాయం చేయాలని శాంతిని కోరా. ఈ వ్యవహారం తర్వాత విడాకుల కోసం నన్ను ఎంతో బెదిరించింది. కానీ కుమార్తెలు ఉండటంతో నాకు సమాధానం చెప్పాలని నిలదీశా’’ అని వివరించారు మదన్ మోహన్. అంతేకాకుండా తన భర్త సుభాష్ అని ఐవీఎఫ్ చేయించుకున్న ఆసుపత్రిలోని కేస్‌షీట్‌లో శాంతి రాయించినట్లు వెల్లడించారు.

‘తండ్రిగా ఎవరి పేరు రాయాలి’

విశాఖలోని ఓ ఆసుత్రికి వెళ్లి అడిగితే వివరాలు ఇచ్చారు. ఆ కేస్‌షీట్‌లో భర్త పేరు దగ్గర పోతిరెడ్డి సుభాష్ అని ఉంది. ఆ పేరు వివరాలు సేకరిస్తే వైసీపీ హయాంలో హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్న వ్యక్తే సుభాష్ అని తేలింది. ఈ బిడ్డ విషయంపై సుభాష్‌తో చర్చిస్తే.. తనకు బిడ్డకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. శాంతి మాత్రం తన భర్త సుభాష్ అంటూ ఫొటోలు చూపిస్తున్నారు. ఈ సమస్యను ఇప్పుడు వదిలేస్తే భవిష్యత్తులో చాలా అనర్థాలు జరుగుతాయిన భావించా. అందుకే దీని పరిష్కారం కోసం పోరాడుతున్నా. ఏడాది బాబుకు న్యాయం జరగాలి. భవిష్యత్తులో ఆ పిల్లాడు స్కూల్‌లో చేరిన సమయంలో తండ్రి పేరేంటి అంటే ఎవరి పేరు రాయాలి? ఆ బిడ్డకి తండ్రి ఎవరో తెలియాలి? ఇప్పటి వరకు శాంతి కూడా బిడ్డకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదు. ఒక బిడ్డ భవిష్యత్తు కోసమైనా నాతో పాటు విజయసాయిరెడ్డి, సుభాష్ ఇద్దరూ కూడా డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.

విడాకులు కాలేదు

‘‘2016లో విడాకుల పత్రాలపై నేను సంతకం చేసినట్లు శాంతి చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలే. ఆ పత్రాలు కూడా నకిలీవే. కావాలంటే వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపండి. డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించి ఆ బిడ్డ తండ్రి ఎవరో తేల్చిన తర్వాత రాత పూర్వకంగా ఓ పత్రాన్ని జారీ చేయడం ద్వారానే ఈ సమస్య పరిష్కారమవుతుంది. అలా చేస్తే భవిష్యత్తులో నాకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. నిజంతా తప్పు చేయకుంటే, నిజాయితీ ఉంటే మీడియా ముందకు వచ్చి తాను డీఎన్ఏ టెస్ట్‌కు రెడీ అని విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ విషయంపై హోంమంత్రి అనిత, డీజీపీలను కలిసి న్యాయం చేయాలని కోరాను. వారు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే నిజానిజాలు తేలుస్తామని చెప్పారు’’ అని మదన్‌మోహన్ వెల్లడించారు.

Read More
Next Story