![మదనపల్లె కూటమిలో కలహాల కుంపటి మదనపల్లె కూటమిలో కలహాల కుంపటి](https://telangana.thefederal.com/h-upload/2025/02/12/512272--5-2.webp)
మదనపల్లె కూటమిలో కలహాల కుంపటి
వేసవికి ముందే మండుతున్న మదనపల్లె కూటమిలో మంటలు చాలరేగాయి. మైనార్టీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసింది. ఆయన సిఫారసు లేఖలు వివాదంగా మారాయి.
చల్లదనానికి మారుపేరు మదనపల్లి. వేసవికాలం ప్రారంభానికి ముందే రాజకీయంగా మండుతోంది. టిడిపి కూటమిలో కుదరని సఖ్యత మంటలు పుట్టిస్తోంది. ఎందుకు ప్రధాన కారణం టిడిపిలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి.
టిడిపి ఎమ్మెల్యే షాజహాన్ బాషా (జహా)తో ఆ పార్టీ తెలుగు అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, జనసేన రాయలసీమ కోకనుండం గంగారపు రాందాస్ చౌదరి, బిజెపి నాయకుల మధ్య వార్ సాగుతోంది. వీరి పంచాయతీ టిడిపి ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ దృష్టి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఎనిమిది నెలలైంది. అప్పుడే అంతర్గత కలహాలతో కూటమిలో కొట్లాట రగిలింది. మదనపల్లి ఎమ్మెల్యే షేక్ షాజహాన్ పై తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వైసిపి వారికి సిఫారసు లేఖలు ఇస్తున్నారు. నామినేటెడ్ పదవుల కోసం కూడా సిఫారసు చేశారు" అని శ్రీరామ్ చిన్నబాబు ఘాటు ఆరోపణలు చేశారు. ఆ సిఫారసులను నేనే బుట్ట దాఖలు చేయించానని కూడా ఆయన తేటతెల్లం చేశారు.
మదనపల్లి లో ఏం జరుగుతోంది?
మదనపల్లె ప్రాంతం చల్లదనానికి మారుపేరు. అందులో సందేహం లేదు. కానీ ఇక్కడ రాజకీయాలు నిత్యం వేడిగానే ఉంటాయి. గతాన్ని ఓసారి పరిశీలిస్తే, ఆ విషయం స్పష్టమవుతుంది.
2024 ఎన్నికల్లో టిడిపి టికెట్ తగ్గించుకున్న మాజీ ఎమ్మెల్యే షాజహాన్ విజయం సాధించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన షాజహాన్ 2004 ఎన్నికల్లో ఆరోగ్యంగా ఆయనకు టికెట్ దక్కింది. ఏఐసీసీ జారీ చేసిన బీఫాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ గులాబ్ నబీ ఆజాద్ సంతకం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం దక్కించుకున్న నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో టికెట్ ఆశించే భంగపడిన గంగారపు రాందాస్ చౌదరి పోటీకి దిగారు. దీంతో త్రిముక పోటీ ఏర్పడిన నేపథ్యంలో టిడిపిలో మొదటిసారి టికెట్ దక్కించుకున్న దొమ్మలపాటి రమేష్ విజయానికి బాటలు పడ్డాయి.
2009 ఎన్నికల్లో మదనపల్లి నుంచి షాజహాన్ బాషా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో సీఎం వైఎస్ఆర్ మరణించడంతో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ఆనాటి పరిస్థితుల్లో షాజహాన్ భాషా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ, మాజీ సీఎం ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి వెంట నడిచారు.
ఏఐసీసీ తో విభేదించిన వైయస్ జగన్ ఏర్పాటు చేసిన వైసీపీలో కి రావడానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సుమ కథ చూపకపోవడం, రాజకీయంగా ఊతమిచ్చిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో ఉన్న సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత వరుసగా జరిగిన ఎన్నికల్లో మదనపల్లి నుంచి ఒకసారి. రాజంపేట ఎంపీగా పోటీ చేసిన షాజహాన్ బాషా కనీసం మూడు వేల నుంచి 5000 ఓట్లకే పరిమితమయ్యారు.
రాటకొండకు ముండిచేయి
ఇదిలా ఉంటే, మదనపల్లిలో మొదటి నుంచి టిడిపి లో సాగుతున్న రాటకొండ కుటుంబానికి సీఎం చంద్రబాబు మొండి చేయి చూపారు. వీరి కుటుంబంలో మొదట రాటకొండ సాగర్ రెడ్డి, ఆ తర్వాత ఆయన మరదలు రాటకొండ శోభ టిడిపి నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. 2004 ఎన్నికల నుంచి రాటకొండ కుటుంబానికి టిడిపిలో పదవులు ఇవ్వడంలో సీఎం చంద్రబాబు ఆసక్తి చూపించడం లేదు. ఈ పరిస్థితుల్లో.. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పై వచ్చిన భూ ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో మదనపల్లి టిడిపి అభ్యర్థిగా కొత్త అనివార్యం అయ్యారు. ఇదే అదునుగా..
నారా లోకేష్ ఆశీస్సులతో..
సీఎం చంద్రబాబు కొడుకు నారా లోకేష్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆయన పాదయాత్ర మదనపల్లికి చేరుకున్న సమయంలో షాజహాన్ భాష టిడిపిలో చేరడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలు టిడిపి కూటమి ఏర్పడేందుకు ఆస్కారం కల్పించాయి. అంటే.
2019 నుంచి 24 వరకు వైసిపి అధికారంలో ఉండగా చోటు చేసుకున్న ప్రణామాల నేపథ్యంలో, టిడిపి, జనసేన, బిజెపి కలయికకు మార్గం ఏర్పడింది అనడంలో సందేహం లేదు.
ఈ పరిస్థితుల్లో సీట్ల పంపకాల్లో జనసేన పార్టీ తిరుపతి తర్వాత మదనపల్లి అసెంబ్లీ స్థానాన్ని ఆశించింది. ఈ రెండు నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన నుంచి ఆశావాహులు ఎక్కువగా ఉండడం కూడా రెండు పార్టీల అధినేతలకు తల భారంగా మారింది.
మదనపల్లి విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు అంతకంటే ముందు ఆయన కొడుకు నారా లోకేష్ పట్టు వీడలేదు. దీంతో మదనపల్లి టిడిపి రాజకీయ తెరపైకి వచ్చిన షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, మరో ఇద్దరు నాయకులు టికెట్ కోసం పోటీప పడ్డారు. అందరి అభ్యర్థిత్వలను పరిశీలించిన తర్వాత టిడిపి అధిష్టానం షాజహాన్ బాష అభ్యర్థి తత్వానికి మొగ్గుచూపింది.
"ఈ ఎన్నికల్లో షాజహాన్ బాషకు సహకరించేది లేదు" అనే వార్తలు షికారు చేశాయి.
"టిడిపి తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, జనసేన రాయలసీమ కో కన్వీనర్ రాందాస్ చౌదరి తన విజయానికి సహకారం అందించలేదు" అనేది ఎమ్మెల్యే
షాజహాన్ ప్రధాన ఆరోపణ. ఇదిలా ఉంటే
"రాజకీయ పరిపక్వతకు ఇది నిదర్శనం కాదు" అని టిడిపి నేత శ్రీరామ్ చినబాబు, జనసేన నేత రాందాస్ చౌదరి అభ్యంతరం చెబుతున్నారు.
"గెలిస్తే తనకు ఉన్న పట్టు అని. ఓడితే మిగతా వారి సహకారం లేదు" అని చెప్పడం రాజకీయాల్లో రాణించదని వారిద్దరూ చెబుతున్నారు.
ఇంతకు సమస్య ఏమిటి
మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇప్పటివరకు అందించిన సిఫారసు లేఖలపై టిడిపి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ఘాటు ఆరోపణలు చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో షాజహాన్ సిఫారసుతోనే శ్రీరామ్ చినబాబు మదనపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేశారు. ఇదిలావుంటే..
" మొదటి నుంచి షాజహాన్ వెంట ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ తర్వాత 2019 నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన తమ్ముడు మహమ్మద్ నవాజ్ బాషా తో కలిసి తిరిగిన వారికే ఇస్తున్నారు" అని శ్రీరామ్ ఆరోపించారు.
"మదనపల్లి మార్కెట్ కమిటీ పదవులు. ఇంకొన్ని నామినేటేడ్ పదవులకు కూడా టిడిపికి సంబంధంలేని నాయకుల పేర్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సిఫారసు చేశారు" అని టిడిపి తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ఆరోపించారు. ఆ వివరాలను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుపోవడం ద్వారా ఎమ్మెల్యే షాజహాన్ సిఫారసు చేసిన ప్రతిపాదనను చెత్తబుట్ట దాఖలు చేయించా అని ఓ మీడియా డిబేట్లో శ్రీరాం చిన్నబాబు వెల్లడించారు.
పదవులు తీసుకున్న వారు టిడిపికి అందించిన సేవలు ఏమిటి? తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు వద్ద సీఎం చంద్రబాబుపై రాళ్లదాడ జరిగింది. అంగళ్లు అనే ప్రాంతం మదనపల్లికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఇందులో ఎంత మందిపై కేసులు నమోదయ్యాయి. వారిలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా సిఫారసు చేసిన వారు చేసిన వారెవరైనా ఉన్నారా? అని శ్రీరామ్ చినబాబు సూటిగా ప్రశ్నించారు.
తార స్థాయికి చేరిన వివాదం
తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు తారాస్థాయికి చేరడానికి దారి తీసిన పరిస్థితిలోకి వెళితే.. మదనపల్లి నుంచి తిరుపతికి వచ్చే మార్గంలో అంటే మదనపల్లి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సిటిఎం ( చిన్న తిప్ప సముద్రం) సమీపంలోని కాటన్ మిల్ కూలగొట్టారు. ఇక్కడ స్థలం చదును చేయడానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు స్థలం చదును చేయించేందుకు ట్రాక్టర్లతో మట్టి తోలుస్తున్నారు. వీటిని ఎమ్మెల్యే షాజహాన్ స్వయంగా అడ్డుకొని, వాహనాల తాళాలు విఆర్ఓ కు అప్పగించారు. ఈ ఘటనతో టిడిపిలో రగులుతున్న అంతర్గత విభేదాలు మరింత తీవ్రస్థాయికి చేరాయి.
"అక్రమంగా వ్యాపారం చేయడానికి తాను ఈ పనులు చేయడం లేదు" అనేది శ్రీరామ్ చినబాబు వాదన. ఏ పార్టీలో వారైనా సరే పేదలు బాగుపడాలి. వ్యాపారాలు చేసుకోవాలి. అనేది తన అభిమతం అని ఆయన చెబుతున్నారు. కానీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా పనిగట్టుకొని అనాదిగా టిడిపిలోనే ఉన్న నాయకులు, మద్దతు దారులకు అన్యాయం చేసే దిశగానే వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే..
ఎమ్మెల్యే వాదన ఎలా ఉందంటే..
నేను ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ ప్రతిష్ట, తన వ్యక్తిత్వం దెబ్బతినకుండా పనిచేస్తున్నానని టిడిపి ఎమ్మెల్యే షాజహాన్ భాషా చెబుతున్నారు.
"నేను పట్టణంలో ఉంటే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా. సమీక్షలు చేస్తా. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న" అనేది ఎమ్మెల్యే షాజహాన్ బాషా చెబుతున్న మాట.
నిత్యం అనేకమంది బాధితులు తన వద్దకు వచ్చి సమస్య చెప్పిన వెంటనే వారికి సిఫారసు లేఖలు ఇస్తున్న అని కూడా ఆయన 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధికి స్పష్టం చేశారు.
టిడిపి విధానాలకు కట్టుబడి తాను పనిచేస్తున్నానని చెబుతున్న ఆయన నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న వారికి కూడా లేఖలు ఇచ్చాను అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వారిలో అనాదిగా టిడిపిలో ఉన్న నాయకులకే లేఖలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
టిడిపి మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఎస్ఏ మస్తాన్, మదనపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాటకొండ గుర్రప్ప నాయుడు, జన్మభూమి ఎస్ఎం రఫీ, చీకల బైలు సర్పంచ్ ప్రభాకర్, రాటకొండ మధుబాబు, టిఎన్ఎస్ఎఫ్ నేత ప్రభాకర్, టిడిపి నాయకుడే అయిన సాజిత్ వంటి వారికి సిఫారసు లేఖలు ఇచ్చిన మాట వాస్తవం అని ఎమ్మెల్యే షాజహాన్ బాషా వివరించారు. వీరందరిలో టిడిపి నాయకులు కాని వారు ఎవరు? కాంగ్రెస్ లేదా వైసిపి నాయకులు ఎవరున్నారనేది తేల్చాలని కూడా ఎమ్మెల్యే గుర్తు చేశారు.
మదనపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా టిడిపి కూటమిలో అంతర్గత విభేదాలు చెలరేగడానికి, ఆయా పార్టీల్లోనే నాయకులు పదవులు ఆశిస్తున్నారు. తనపై అకారణంగా బురద చల్లుతున్నారనేది ఎమ్మెల్యే షాజహాన్ వాదన.
రాష్ట్రంలో మరో విడత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే అవకాశాన్ని సీఎం చంద్రబాబు ఇటీవల గుర్తు చేశారు. ఆ మేరకు పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఐవిఆర్ఎస్ (interactive voice response) ద్వారా టిడిపి అధిష్టానం అభిప్రాయ సేకరణకు రంగంలోకి దిగింది.
మదనపల్లి నియోజకవర్గంలోని నాయకులు పార్టీలు మారారు. ఏ పార్టీలోకి వెళ్లిన వారే ప్రత్యర్థులుగా మిగులుతున్నారు. ప్రస్తుతం టిడిపి కూటమిలో కూడా అదే పరిస్థితి. నామినేటెడ్ పదవుల పంపిణీ ద్వారా అంతకంటే ముందు కూటమిలో అంతర్గత కలహాలను ఎలా చక్కదిద్దుతారనేది సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు నారా లోకేష్ తీసుకుని నిర్ణయాలు కీలక పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు. ఈ వివాదానికి వారిద్దరూ ఎలాంటి కాయకల్ప చికిత్స చేస్తారనేది వేచి చూడాల్సిందే.