మండనున్న మదనపల్లె యాపిల్
టమోటా ధర సీజన్ ప్రారంభం కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అనేది మార్కెట్ వర్గాల విశ్లేషణ..
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)
తిరుపతి: " కాశ్మీర్ ప్రాంతానికి ఆపిల్ ఎంత ప్రధానమైనదో… మదనపల్లె టమాటాకు అంత విశిష్టత ఉంది" ఆపిల్ తో సమానంగా దేశీయ మార్కెట్లను కూడా చిత్తూరు టమాట ప్రభావితం చేస్తోంది. వంటకం ఏదైనా సరే.. టమాటా ఉండి తీరాల్సిందే. టమాటా రైతులతో ధరల దోబూచులాట సర్వసాధారణం. టమాటా పంట సీజన్ ప్రారంభం కావడం వల్ల ప్రస్తుతం ధరలు ఊరిస్తున్నాయి. రైతుకు వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కుతోంది. బహిరంగ మార్కెట్లోకి వచ్చేసరికి కిలో టమాట 40 రూపాయలు పలుకుతోంది. ఈ నెల చివరి వరకు ఇదే ధరలు కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆసియాలోనే అతి పెద్దది అయిన మదనపల్లె మార్కెట్ కమిటీకి వచ్చే టమాటో ఉత్పత్తి, ఈ ప్రాంతంలో సాగుబడి అవుతున్న విస్తీర్ణం, మార్కెటింగ్ వ్యవస్థ తీరును పరిశీలిస్తే... కూరగాయల్లో టమాటా రారాజు. టమాటా పంట సాగు చేసే రైతుల తలరాతలు మారడం లేదు. నిలకడ లేని ధరలతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఉత్పత్తి తగ్గినప్పుడు మాత్రమే ధర కాస్త పెరుగుతుంది. ఆ సమయంలోనే వారికి ఆదాయంతో ఉపశమనం లభిస్తుంది.
33 వేల ఎకరాల్లో సాగు
మదనపల్లె టమోటా మార్కెట్ పరిధిలో విస్తారంగా పంట సాగు విస్తారంగా పంట సాగులో ఉంటుంది. ఈ ప్రాంతంలో 33 వేల ఎకరాల్లో టమాట పంట సాగు చేస్తారనేది ఓ అంచనా. ఇందులో ప్రధానంగా మదనపల్లి, అంగళ్ళు ములకలచెరువు, పుంగనూరు, గుర్రంకొండ, వాల్మీకిపురం ప్రాంతాల్లో టమాటా పండు సాగు చేస్తారు. ఇక్కడ మార్కెట్ కమిటీలకు కూడా ఉత్పత్తి ఎక్కువగానే వస్తూ ఉంటుంది.
ప్రారంభమైన దిగుబడి
సాధారణంగా టమోటా పంట ఖరీఫ్, సీజన్లో కూడా చిత్తూరు జిల్లా పడమటి తాలూకాల్లో టమోటా పంట సాగు చేస్తారు. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లో ఉన్న మదనపల్లి టమాటాలకు సీజన్, అన్‌సీజన్‌తో సంబంధం లేకుండా రోజుకు 200 నుంచి 1500 మెట్రిక్ టన్నుల వరకు టమోటా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏటా.. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే సీజన్ ఆగస్టు వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం టమాటా పంట దిగుబడి ప్రారంభమైంది. అందువల్ల మార్కెట్‌కు తక్కువ స్థాయిలోనే తీసుకువస్తున్నారు. మదనపల్లి మార్కెట్‌కు మంగళవారం 101 మెట్రిక్ టన్నులు (13,800 కిలోలు) వచ్చింది. బుధవారం ఆ మోతాదు స్వల్పంగా పెరిగి 138 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది.
ధరలు ఎలా ఉన్నాయంటే..
చుట్టుపక్కల ఉన్న పల్లెల రైతులు మదనపల్లె మార్కెట్ యార్డ్‌కు టమాటా తీసుకువస్తారు. ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీ ఉన్న 30 కిలోలు ఉన్న క్రేట్ రు. 900 కు కొనుగోలు చేస్తున్నారు. అంటే మార్కెట్ యార్డులోనే కిలో టమాట 30 రూపాయలు పలుకుతోంది. ఈ సరుకు పొరుగు ప్రాంతాల దుకాణాలకు వచ్చేసరికి ఆ ధర 40 రూపాయలకు చేరుతోంది. సెకండ్ గ్రేడ్ క్వాలిటీ ఉన్న 30 కిలోల క్రేట్ ధర 450 నుంచి 550 రూపాయల వరకు పలుకుతోంది. ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల ధర పెరగడానికి ఆస్కారం ఏర్పడింది. దీనికి మరో కారణం కూడా ఉంది...
పొరుగు రాష్ట్రాల్లో...
చిత్తూరు జిల్లాకు పొరుగునే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో ఇదే సీజన్‌కు టమాట ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ప్రధానంగా తమిళనాడులో తిరుచి, మధురై, కుంభకోణం, చెన్నై మార్కెట్లకు మదనపల్లి మార్కెట్ నుంచి వెళ్లే 60 శాతం దిగుబడిపై ఆ రాష్ట్రాల మార్కెట్ ఆధారపడి ఉంటాయి. ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దిగుబడి తక్కువగా ఉండటం వల్ల మదనపల్లి ప్రాంతం నుంచి కూడా సరుకు రవాణా అవుతోంది.
అంతేకాకుండా మదనపల్లెకు అత్యంత సమీపంలోనే ఉన్న కర్ణాటక పరిధిలోని కోలార్, వడ్డిపల్లి, చింతామణి, రాయల్పాడు టమాటా మార్కెట్లో కూడా పెద్దవి. ఇక్కడ కూడా దిగుబడి తక్కువగా ఉన్న కారణంగా మదనపల్లె మార్కెట్ నుంచి రవాణా అవుతోంది. దీనివల్ల వినియోగదారులకు అవసరమైన ఎంత దిగుబడి లేకపోవడం ధరలు పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ప్రతి ఏటా సర్వసాధారణం. సీజన్ ప్రారంభంలో టమోటా ఉత్పత్తి తక్కువ కావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుందనేది మార్కెట్ వర్గాల విశ్లేషణ కూడా.
దేశంలో మార్కెట్ల పై ప్రభావం
మదనపల్లె మార్కెట్ యార్డ్ నుంచి టమాటాలు కొనుగోలు చేయడానికి ఒరిస్సా, ఛత్తీస్గడ్, ఢిల్లీ, ముంబై ప్రాంతాల నుంచి కూడా వ్యాపారులు వస్తూ ఉంటారు. గత రెండేళ్లుగా ఒడిస్సా, ఛత్తీస్‌గడ్‌లో కూడా ఈ ప్రాంతం నుంచి తీసుకువెళ్లిన రైతులు కూలీలతో టమాటా పంట సాగుకు శ్రీకారం చుట్టారు. అందువల్ల ఆ రాష్ట్రాల నుంచి మినహా మిగతా ప్రాంతాల నుంచి మదనపల్లి మార్కెట్‌కు వచ్చే వ్యాపారులు సరుకు కొనుగోలు చేసి రవాణా చేస్తుంటారు. ఏడాదిలోని రెండో సీజన్లో ఇది సర్వసాధారణం ఆ పరిస్థితి ఇంకా ప్రారంభం కాలేదు. ఆ ప్రాంత వ్యాపారులు మదనపల్లె మార్కెట్‌కు వస్తే ధరలు ఆకాశాన్ని అంటే ప్రమాదం కూడా లేకపోలేదు. అని మదనపల్లి మార్కెట్ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
వర్షాలే ఆధారం...
సాధారణంగా మదనపల్లి, సమీప ప్రాంతాలను చిత్తూరు జిల్లాకు పడమటి ప్రాంతంగా పరిగణిస్తారు. ప్రాంతంలో వర్షాధారంగా సాగించే పంటలు ఎక్కువగా ఉంటాయి. అందులో ప్రధానంగా టమాట, వేరుశనగ సాగు బడికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ప్రతి సంవత్సరం వేసవికాలం ముగిసే సమయంలో కరుణించే తొలకరి జల్లులకు దుక్కులు చేసి, పాలను సిద్ధంగా ఉంచుకునే రైతులు, మలి విడత వర్షాలు కురవంగానే వేరుశనగ విత్తుతారు. ఈ సమయంలో వేరుశనగ పంటపై రైతులు దృష్టి సారిస్తారు. సమయంలో సెప్టెంబర్ నెల నుంచి జనవరి వరకు టమాట పంట దిగుబడి తగ్గుతుంది అప్పుడు కూడా ధరలు ఆకాశాన్ని చేరతాయి.
మరో నెల తర్వాత గడ్డు కాలమే!
ప్రస్తుతం టమాటా ధరలు రైతులకు మేలు చేస్తుంటే.. వినియోగదారులకు భారంగా మారింది అనేది వాస్తవం. ఇంకా నెలన్నర తర్వాత పరిస్థితి చాలా దారుణంగా ఉండే ప్రమాదం లేకపోలేదు. చిత్తూరు జిల్లాలోనే కాకుండా పొరుగునే ఉన్న కర్ణాటక తమిళనాడు ప్రాంతాల్లో కూడా దిగుబడి ప్రారంభమైతే, ఈ ప్రాంతంలోని టమాటా ఉత్పత్తి గణనీయంగా పెరిగి, ధరలు పతనమయ్యే పరిస్థితి లేకపోలేదు. సమయంలో.. పొలాల్లో కోత, కూలీలు, పల్లెకు తీసుకువచ్చే రవాణా ఖర్చులు కూడా గిట్టని స్థితిలో టమాటాలను రోడ్డుపై పడవేసి తొక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కనీసం కిలో టమాటా.. రెండు రూపాయలు కూడా పలకని స్థితిలో రైతులకు కనీసం పెట్టుబడి అటు ఉంచి కోత, కూలీలు రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కానీ స్థితి ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం రైతులు ఎదుర్కొంటున్న అత్యంత దారుణ, దయనీయమైన స్థితి. ఈ పరిస్థితి చక్కదిద్దడానికి ప్రభుత్వాలు ఇతర సంస్థలు తీసుకుంటున్న చర్యలు కంటి తుడుపు చర్యగానే మిగిలిపోతున్నాయి. ఇదిలా ఉంటే..
గత ఏడాది రికార్డు
మదనపల్లి మార్కెట్ 27 ఏళ్ల చరిత్రలో ఆల్ టైం రికార్డ్ నమోదయింది. అంటే ఉత్పత్తి గణనీయంగా వచ్చినప్పటికీ రైతులకు, వ్యాపారులకు ఇబ్బంది లేని రీతిలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది అందులో భాగంగా. క్రితం మదనపల్లె మార్కెట్ చరిత్రలో మొదటిసారి 1500 మెట్రిక్ టన్నుల చొప్పున టమాటాను మార్కెట్‌కు తీసుకువచ్చారు. 93లో మార్కెట్ కమిటీలు టమాటా కొనుగోలు, అమ్మకాలు ప్రారంభమైన నాటి నుంచి ఇంత భారీ స్థాయిలో సరుకు రావడం అనేది ఓ రికార్డు అని మార్కెట్ వర్గాలే చెప్పాయి. భారీగా వచ్చిన సరుకును రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలతో ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, ఒడిస్సా, తమిళనాడులోనే కాంచీపురం, ఆరణి, కుంభకోణం తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలోనే వచ్చిన వ్యాపారులు మదనపల్లి మార్కెట్లో కొనుగోలు చేశారు.
ఆ సందర్భంలో మొదటి రకం టమాటా కిలో రూ. 4.80 నుంచి ఆరు రూపాయలు, రెండో రకం టమాటా మూడు నుంచి రు. 4.60 ధర పలికింది. భారీగానే వచ్చిన సరుకు నిల్వ ఉంచని విధంగా... ఏ రోజుకు ఆ రోజు దూర ప్రాంతాలకు రవాణా చేయడం వల్ల, రైతులకు మేలు జరిగిందనేది వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారుల మాట
మరో రికార్డ్..
మదనపల్లె మార్కెట్ చరిత్రలో మరో రికార్డ్ కూడా గత ఏడాది నమోదయింది. మదనపల్లెకు వచ్చిన సరుకు తక్కువగా ఉండటం వల్ల గత ఏడాది సీజన్ మధ్యలోని కిలో టమాట రు. 140 నుంచి 160 రూపాయల వరకు పలికింది. ఇతర ప్రాంతాల్లోని బహిరంగ మార్కెట్లకు వచ్చేసరికి ఆ ధర కిలో రూ. 200 అయ్యింది. దీంతో రంగం లేక తిరిగి దిగిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ యంత్రాంగం మార్కెట్లో 100 రూపాయలకు కొనుగోలు చేసి 50 రూపాయలకు రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
దిగుబడి తక్కువ...
ప్రస్తుతం సీజన్ ప్రారంభంలో ఉండడంవల్ల దిగుబడి తక్కువగా ఉండడం, ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇంకా దిగిరాని స్థితిలో కిలో టమాటా ధర 4 రూపాయల వరకు పలుకుతుంది. పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులు మదనపల్లె మార్కెట్ కు వస్తే ధర రెట్టింపు అవకాశం లేకపోలేదని చెప్తున్నారు. ఈ విషయాలపై మదనపల్లె టమోటా మార్కెట్ కార్యదర్శి అభిలాష్ ఏమంటున్నారంటే... " ఏటా ఏప్రిల్ నుంచి టమాటా ఉత్పత్తి సీజన్ ప్రారంభమవుతుంది. మే, జూన్ నాటికి కాస్త ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది" అని మార్కెట్ కమిటీ కార్యదర్శి అభిలాష్ ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు.
ప్రస్తుతం మదనపల్లి మార్కెట్‌కు సరుకు తక్కువగా వస్తుందన్నారు. 300 నుంచి 500 టన్నుల దిగుబడి రావాల్సి ఉందన్నారు. బుధవారం 138 టన్నులు వరకు వచ్చిందని, మంగళవారంతో పోలిస్తే 28 టన్నులు అధికమని ఆయన వివరించారు. " 25 కిలోల క్రెట్‌ను రూ. 700 నుంచి 750 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. కిలో 30 రూపాయలు పలుకుతోందని మార్కెట్ కమిటీ కార్యదర్శి వివరించారు. అనంతపురం జిల్లాకు సరిహద్దుల్లో ఉన్న మొలకల చెరువు మార్కెట్‌కు కూడా 200 టన్నుల టమాట దిగుబడి వచ్చిందని ఆయన మార్కెట్ స్థితిని చెప్పారు.
కర్నూలుకు లంకె
రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతం తర్వాత కర్నూలు జిల్లాలో కూడా టమాటా దిగుబడి అధికంగా ఉంటుంది. అనంతపురం కర్నూలు జిల్లాకు సరిహద్దుగా ఉన్న డోన్ టమోటా మార్కెట్ కూడా ప్రధానమైనది. కర్నూలు జిల్లాలో ఉత్పత్తి అయ్యే టమాటా పంట మొత్తం కలుపుకుంటే మదనపల్లె డివిజన్లో సాగయ్యే విస్తీర్ణంలో సగం కూడా ఉండదు. దీంతో డోన్ మార్కెట్ ను మదనపల్లి మార్కెట్ కమిటీ ఈ ప్రాంత రైతాంగం ప్రభావితం చేస్తుంటారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూడా పంట దిగుబడి తక్కువగా ఉండడం ధరలు పెరగడానికి ఆస్కారం ఏర్పడిందని విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని రైతులు వ్యాపారులు కూడా స్పష్టం చేస్తున్నారు.
Next Story